ఈ ప్రశ్నకు జవాబు ఎన్ని సార్లు విన్నా భిన్నమైన జవాబులు వింటున్నా అన్న ఒక తోటి బ్లాగరు సలహా పై ఈ టపా రాస్తున్నా!
Linux, By Definition:
మ్యాక్ఓఎస్ యొక్క ఒకప్పటి రూపం
Linux, By Definition:
Linux is an open source UNIX-like operating system
which is popular for it's robustness and availability.
అనగా లినక్సు అనేది తన పనితనానికి ప్రసిద్ధియైన ఒక స్వేచ్ఛావాహక యునిక్సు-వంటి నిర్వహణా వ్యవస్థ.
కానీ నిజానికి లినక్స్ అనేది ఒక నుంగు(కెర్నల్) మాత్రమే. నుంగు నిర్వహణా వ్యవస్థ యొక్క మూలభాగం అత్యంత సున్నితమైన కార్యక్రమాలకు నుంగును ఉపయోగిస్తాము. ఈ నుంగు కథ, నిర్వహణా వ్యవస్థ తీరుతెన్నులు తెలుసుకుందాము. లినక్సు నుంగును వాడుకుంటూ వేలల్లో నిర్వహణా వ్యవస్థలు కలవు, వీటన్నిటినీ కలిపి లినక్సు అని మనం వ్యవహరిస్తుంటాం.
మీరు గమనించి ఉంటే కలనయంత్రాన్ని కొన్న వెంటనే దానిని ప్రారంభిస్తే నల్లని తెర కనిపించి, చిన్న శబ్దం చేసి అలానే ఉండిపోతుంది! కారణం అందులో నిర్వహణావ్యవస్థ లేదు. నిర్వహణావ్యవస్థ లేనిదే ఎంత బలమైన అంతర్జాలవ్యవస్థతో అనుసంధానం చేసినా, మీరు జాలంలోని గూడులను చూడలేరు, సంగీతం వినలేరు, సినిమాలు చూడలేరు, మీ దస్త్రాలను రాయలేరు.
అదీ మన నిర్వహణావ్యవస్థ ప్రాధాన్యత.
ఒక నిర్వహణావ్యవస్థ మీకూ, మీ కంప్యూటర్ నందు గల స్థూల ఉపకరణాలకు మధ్య నిలుస్తుంది.
మీరు మౌసును ఒక ఫోల్డర్ పై క్లిక్ చేసినపుడు, మీ నిర్వహణా వ్యవస్థ ఆ క్లిక్ కు సంబంధించిన చర్యను వెనువెంటనే రెప్పపాటుకంటే తక్కువ సమయంలో పూర్తిచేస్తుంది. ఇందుకోసం ముందు గానే నిర్వహణావ్యవస్థకు ఏ చర్యకు ఏ ప్రతిచర్య జరగాలి అన్న విషయాన్ని కార్యక్రమాల ద్వారా తెలపాలి. ఒక సీడీనుండి సినిమా చూపటం, కీబోర్డ్ పై గల బటన్స్ ను వత్తినపుడు ఆయా బటన్ కు సంబంధించిన అక్షరాలు/చర్యలు స్క్రీన్ పై చూపబడటం ఇవన్నీ ముందుగా నిర్వహణా వ్యవస్థకు ఆజ్ఞలతో కూడిన కార్యక్రమాల ద్వారా తెలుపుతాము.
సరే నిర్వహణా వ్యవస్థ ముఖ్యమైనదని తెలుసుకున్నాం. కానీ నిర్వహణా వ్యవస్థ ఏమేమి చేస్తుంది : ముఖ్యమైన పని - మన దస్త్రాలను దస్త్రవ్యవస్థను నిర్వహించటం.
నిర్వహణా వ్యవస్థ దస్త్రములతో ఇవన్నీ చెయ్యగలదు:
- దస్త్రాలను సృష్టించడం
- ఒకచోటనుండి మరో చోటుకి మార్చడం
- వాటి పేరు మార్పిడి
- ప్రతిరూపం తీయటం
- తీసివేయటం
- ప్రింటరుకు లేదా జాలానికి పంపడం
- ఇంకా చాలా చాలా...
ఇదీ నిర్వహణా వ్యవస్థ కథ!
ఇక యూనిక్సు గురించి తెలుసుకుందాము.
యునిక్సు 1969 లో బెల్ ల్యాబ్స్ , ఏటీ&టీ నందు మొదటిసారి రూపొందింది. ఇది మొట్టమొదటి నిర్వహణా వ్యవస్థ కాకపోయిన ఒక నిర్దిష్టతతో ఒకే కెర్నల్(నుంగు) తో తయారుచెయ్యబడ్డ పూర్తిస్థాయి నిర్వహణా వ్యవస్థ. అందుచేతనే అప్పట్నుండీ, నేటికీ అది ప్రముఖ నిర్వహణా వ్యవస్థగా కొనసాగుతున్నది. ఇది మైక్రోసాఫ్ట్ ఇంకా ఆపిల్ ఓఎస్ కన్నా ప్రసిద్ధమైనది.
యునిక్సు గురించి మరోసారి చూద్దాం.
ఇక లినక్సు
లినక్సు యునిక్సు లాంటి నిర్వహణా వ్యవస్థ, తీరుతెన్నుల్లో అచ్చుగుద్దినట్టు యునిక్సులా పనిచేసే లినక్సుకు యునిక్సుకి గల ఒకేఒక తేడా -- ఆ తేడానే లినక్సు ఇంత ప్రముఖంగా ఎదగటానికి కారణం. అదే లినక్సు ఉచితంగా అందుబాటులో ఉండటం. యునిక్సు ఎంత ప్రసిద్ధమైనా, నేటికీ ఎంతో మంది వాడుతున్నా, అది నిఃశుల్కం కాదు.
యునిక్సు నిర్వహణా వ్యవస్థలోని కొన్ని ప్రముఖ రకాలుః
ఫ్రీబీఎస్డీ తప్ప మిగతా ఏ యునిక్సు వాడాలన్నా మన జేబులు ఘల్లు ఘల్లుమంటూ ఉండాల్సిందే. వాటి ఖరీదు ఊహాతీతం. అందుకనే వీటిని నేడు కేవలం ధనిక బహుళజాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉపయోగిస్తున్నాయి.
కానీ గత కొద్ది కాలంగా చాలా సంస్థల్లో యునిక్సు స్థానం లినక్సు ఆక్రమిస్తోంది, ఒక్క ఉచితంగా దొరకడమే దీనికి కారణమనుకుంటే పొరపాటే.
యునిక్సు ఎందుకని అంత ప్రసిద్ధిచెందినది అంటే, దానికి కారణం యునిక్సుని ఒకేసమయంలో ఎందరైనా ఉపయోగించవచ్చు, అలానే ఒకే వ్యవస్థలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అంచేత యునిక్సు ఒక తెలివైన నిర్వహణా వ్యవస్థ కూడా!
మరి ఇలాంటి యునిక్సుని మనం ఎందుకు విరివిగావాడం.
1981 లో సియాటిల్ లో మైక్రోసాఫ్ట్ అనే ఒక చిన్న కంపెనీ(ప్రమాదవశాత్తు డిజిటల్ రిసర్చ్ అన్న కంపెనీ నిజానికి విడుదల చెయ్యాల్సిన) నిర్వహణా వ్యవస్థను విడుదల చేసింది. ఇది మళ్ళీ ప్రమాదవశాత్తు ఐబీఎమ్ వారి కొత్తగాప్రవేశ పెట్తిన ఐబీఎమ్ పీసీ తో కలిపి విడుదల చేయబడింది, ఈ పీసీ నేటి పీసీల్లా కాదు కేవలం కన్సోల్ లో (గ్రాఫికల్ కాక) ఉండేది, కాకపోతే ఇక్కడి ఆజ్ఞలు కొంచెం సుళువు. కానీ మైక్రోసాఫ్ట్ వాడి డాస్ అనబడే ఈ వ్యవస్థను ఒకసారి ఒకరే వాడవచ్చు, అంటే ఇది పనితనంలో యునిక్సంత కాదనమాట. కేవలం సుళువుగా ఉండటం అన్న కారణం తో ఇది విశ్వవ్యాపి అయింది. యునిక్సు కష్టతరం, ఖర్చుఎక్కువ అవటంతో అలానే లైసెన్సుల గొడవలతో యునిక్సు వాడుక మందగించి, డాస్ వాడుక పెరిగింది.
80వ దశకంలో, ఆపిల్ అనేసంస్థ పీసీకు ధీటుగా ఒక కలనయంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ యంత్రం తన సొంత నిర్వహణా వ్యవస్థ తో కలదు. డాస్ వాడలేదు, మ్యాక్ఓఎస్ అనే నిర్వహణావ్యవస్థను ఇందులో వాడారు. ఆపిల్ కామాండులతో నడిచే డాస్, ఇన్కా యునిక్సుకు విరుద్ధంగా పూర్తిగా దృశ్యరూపంలో (గ్రాఫికల్) వ్యవస్థను ప్రవేశపెట్టి కీబోర్డ్ కు అదనంగా మౌసును జతచేసి ప్రవేశపెట్టారు. ఈ మౌసును చాలా అరుదుగా డాస్ లో వాడారు, ఇక్కడ అది విరివిగా వాడబడింది.
ఇదే సమయంలో యునిక్సు కు కూడా ఎక్స్ విండో సిస్టం అనబడే ఎక్స్ ఫ్రంట్ ఎండ్ తీర్చిదిద్దబడింది.
మ్యాక్ఓఎస్ యొక్క ఒకప్పటి రూపం
1990 లో మైక్రోసాఫ్ట్ విండోస్ ౩.0 (1 మరియు రెండు అంతగా ప్రాముఖ్యత పొందలేదు) అనే ఒకేవాడుకరికి సరిపోయే, ఒకసారికి ఒకే కార్యక్రమాన్ని చెయ్యగలిగే 16-బిట్ GUI తో రూపొందించబడింది.
యునిక్సు అప్పటికే 32-బిట్ మరియు 64-బిట్ సామర్థ్యం గల వ్యవస్థలపై పనిచెయ్యగల సామర్థ్యం కలిగిఉన్నా, ఖరీదు ఎక్కువగా ఉండేది. విండోస్ 95 అన్న 32-బిట్ వ్యవస్థ తో బహువాడుకరి, బహుకార్యకారిగా విడుదలై ప్రసిద్ధిచెందింది. అయినా యునిక్సు వాడుకలోనే ఉంది, యునిక్సుకిగల సామర్థ్యం వల్ల.
మరి యునిక్సుకీ లినక్సుకీ తేడా?
1991 నుంది 1995 మధ్యకాలంలో ఎందరో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు యునిక్సు మరియు ఎక్స్ యొక్క వాడుకలో ఎన్నో సంచలనాలను సృష్టించసాగారు. ఈ-మెయిల్ అంతర్జాలం ఈ వ్యవధిలో రూపొందినవే.
ఈ కోవలో నే లినస్ టోర్వాల్డ్స్, 1991 లో ఫిన్ల్యాండ్ లోని హెల్సింకీ విశ్వవిద్యాలయంలో చదువుకునే వాడు.
లినస్ తరచు యునిక్సు వాడే వాడు. అతనికి డాస్ ఆధారిత 386పీసీ వాడటం విసుగునిచ్చేది. అందుచేత అతను తన సొంత నుంగును తయారుచెయ్యాలని నిర్ణయించాడు. నుంగు అనేది నిర్వహణా వ్యవస్థకు గుండె వంటిది, అది నేరుగా స్థూల ఉపకరణాలతో సంభాషిస్తుంది.
అతను ఈ నుంగును ఉచితంగా పంచాలని నిర్ణయించాడు, తద్వారా ఎక్కువమంది వాడి వారి అనుభవాలు తెలుపుతారని! 1991 సంవత్సరపు ఆఖరుకల్లా అతను లినక్సు నుంగును పూర్తిచేసాడు. 32-బిట్ సామర్థ్యంగల నుంగుని చెయ్యటమే కాక అది అచ్చం యునిక్సులా ఉండేలా చేసాడు. కానీ ఈ నుంగుపై నడుపుటకు తన వద్ద సాప్ట్వేర్లు లేవు.
అదృష్టవశాత్తు అమెరికాలోని ఒక పూర్వ విద్యార్థి రిచార్డ్ స్టాల్మాన్ కోమలాంత్రకోవిదుల గుంపును సమీకరించి ఉచితంగా మృదోపకరణలను సృష్టించడం మొదలెట్టారు. ఫ్రీసాఫ్టువేర్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి గ్ను ను కనుగొన్నారు. అలా గ్ను ద్వారా వచ్చిన మృదోపకరణాలను లినక్స్ నుంగును కలిపి
పరిపూర్ణ గ్ను/లినక్సు నిర్వహణా వ్యవస్థ ను తయారు చేసారు.
- Linux is pronounced 'Lih-nucks' not 'Ly-nucks' Click here to listen to Linus Torvalds pronounce Linux!
linux ను లినక్స్ అని పలుకాలి లైనక్స్ లేక లినుక్స్ అని కాదు!
5 కామెంట్‌లు:
రహ్మానుద్దీన్ గారూ,
ఉబంటు ఓ.ఎస్. యెన్ వీడియా గ్రాఫిక్స్ కార్డును, ఇంటెల్ వారి కొత్త ప్రోసెసర్ లను, డ్యుఎల్ కోర్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ లను గుర్తించి వాటి వేగాన్ని వినియోగించుకో గలుగుతుందా? తెలుపగలరు.
ధన్యవాదములు.
ఫణి
డైరెక్ట్ ఎక్స్ లాగా ఉబంటుకు ఏదైనా ఉన్నదా?
ఫణి ప్రసన్న కుమార్ గారూ, ఉబుంటూ మీ గ్రాఫిక్ కార్డును గుర్తించి ఆయా ప్రొప్రెయిటరీ ఉపకరణాలను దింపుకోలు చేయమని అడుగుతుంది.
ఇక మీరు వాడే ఉబుంటూ వెర్షన్ ను బట్టి ప్రొసెసర్ వేగాన్ని గుర్తుపడటం జరుగుతుంది.
ఒకే చోట కాకపోయిన వివిధ రకాలుగా డైరెక్ట్ ఎక్స్ కు ప్రత్యామ్నాయాలు కలవు.
ఓపెన్ జీఎల్ లైబ్రరీ తో మీరు ఇంకా చాలా ఎక్కువ ఫంక్షనాలిటీస్ చెయ్యవచ్చు
లేదా wine వాడి డైరెక్ట్ ఎక్స్ ను ఇక్కడ ఉబుంటూ లో వాడవచ్చు
మీ అవసరమేమిటో తెలిపితే దానికి అనుగుణంగా చెప్పొచ్చు
నెనరులు
లేదండీ, ఇప్పట్లో ఉబంటుకు మారే అవకాశం లేదు. ఆసక్తి కొద్దీ అడిగాను.3డి,2డి గ్రాఫిక్స్, CAD, యానిమేషన్, వీడియో ఎడిటింగ్, కంపోసిటింగ్, ఆడియో ఎడిటింగ్ నా ఉపయోగాలు. వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు ఎక్కువగా విన్డోస్ లోనే ఉన్నాయి. ఓపన్ సోర్స్ సాఫ్ట్వేర్లు (Blender, Synfig Studio లాంటివి)విండోస్ వర్షన్లు డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు. ఓపన్ జియెల్ సపోర్ట్ ఉంటే ఇంకేం!
ధన్యవాదాలు
ఫణి ప్రసన్న కుమార్.
నిర్వహణా వ్యవస్థ పక్కన బ్రాకెట్ పెట్టి operating system అని వ్రాస్తే అర్థమవుతుంది. గ్రాంథిక బాష అర్థం చేసుకోవడం కష్టమే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి