14, ఫిబ్రవరి 2011, సోమవారం

లినక్స్ ఎందుకు?

ఈ టపా ఇంతక ముందు రాసిన లినక్స్ అంటే ఏమిటి?  అన్న టపా కు తరువాయి భాగం.
లినక్స్ అవగాహనలో ఇది రెండవ మజిలీ.
మీకిప్పుడు లినక్స్ అంటే ఏమిటో తెలిసింది. 
కానీ అది మీరు విండోస్ లేక మ్యాక్ ను వదిలి లినక్స్ వాడుకర్లు కావటానికి దోహదం చేయదు.
లినక్స్ యునిక్స్ కన్నా ఎన్నోరెట్లు ప్రత్యేకమైనది. అదెలా?
ఇందుకు గల ముఖ్య కారణం లినక్స్ కు ఉన్న లైసెంస్ -- "ఓపెన్ సోర్స్"

లినక్స్ ఒక సంపూర్ణ ఓపెన్ సోర్స్ నిర్వహణా వ్యవస్థ, అదెలా?
ఇలా:
  1. లినక్స్ వాడే గ్నూ జెనరల్ పబ్లిక్ లైసెన్స్ ప్రకారం, మీరు లినక్స్ ను ఉచితంగా పొందవచ్చు, దాని మూలపదాల్ని కూడా పొంది, మార్పులు చేసి మరలా అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. మరియు ఇలా తిరిగి పంచేప్పుడు కావాలంటే ఒక ధర నిర్ణయించి ఆ ధరకు అమ్మవచ్చుకూడా!
  2. లినక్స్ మూల పదాలు(సోర్స్ కోడ్) అందుబాటులో ఉండటం వలన అలా రూపొందే సాఫ్ట్వేర్ లో సాధారణం కంటే తక్కువ లోపాలు(బగ్స్) ఉంటాయి, మరియు అవి కూడా వెంటనే నివృత్తి చేయబడి, లోపరహితంగా ఉండే లినక్స్ అందుబాటులో ఉంటుంది.
  3. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే అది ఎటువంటి ప్లాట్ఫాం అయినా పనిచేస్తోంది. వహనీయత చాలా విస్తృతం.
  4. నమ్మదగిన సాఫ్ట్వేర్ ఎందుకంటే మూలపదాలు మనవద్ద  ఉండటంవలన మన దస్త్రాలు లేక మన సమాచారం ఏ-ఏ మార్పులకు లోనవుతుందో మనకు తెలుసు, అందువల్ల సమాచారచౌర్యం(data stealing, eavesdropping) వంటి సమస్యలు ఉండవు.
  5. ఏదో ఒకరోజు ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ జెండా ఎత్తేస్తే ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదు అన్న సమస్య నెట్ స్కేప్ వాడుకర్లకు నెట్స్కేప్ బ్రౌజరు  నిలిపివేత తరువాత ఎదురైంది. అలా ఏనాటికీ లినక్స్ మూసివేత ఉండదు.
  6. ఇది ఉచితం! మరియు ఎటువంటి సాంకేతిక సహాయం కావాలన్నా మేమున్నాం! :)
అంటే, మీకు డబ్బూ ఖర్చు ఉండదు, మంచి నాణ్యతగల సాఫ్ట్వేర్ కూడా మీ స్వంతం!
మరి వాణిజ్యం? సాధారణంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వ్యవస్థకు ఆదాయం సాంకేతిక సహాయం, పంపకాలు మరియు శిక్షణ ద్వారా వస్తాయి. ఇది ఒక వినూత్నమైన వ్యాపార సూత్రం, దీనిని ఇప్పటికే వాణిజ్యరంగంలో మహామహులైన ఐబీఎమ్, హెచ్ పీ, నోవెల్, సన్ , ఇన్టెల్ ఆచరణలో పెట్టారు. ఐటీకాని కంపెనీలు, ఉదాహరణకు బోయింగ్, గ్లాక్సోస్మి త్క్లైన్  , మొదలగునవి కూడా ఈ సూత్రాన్నే వాడుతూ ఓపెన్ సోర్స్ కు తమ వంతు తోడ్పాటు చేస్తున్నారు.

ఎంతటి క్లిష్టమైన పనినైనా చెయ్యటానికి లినక్స్ ఒక నమ్మదగిన వేదిక:
  • విండోస్ వంటి వాటితో పోలిస్తే అనవసరపు ప్రోగ్రాంలతో లినక్స్ సమర్థవంతంగా పని చెయ్యటం వల్ల మీ సిస్టం క్రాష్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీ దస్త్రాలకు భద్రత.
  • లినక్స్ లో ప్రస్తుతం వైరస్లు లేవు. లినక్స్ వంటి నిర్దిష్టమైన వ్యవస్థలో ప్రస్తుత వైరస్ లు చొరబడలేవు, పూర్తి వైరస్ తీరుతెన్నులు మారితే గానీ ఆ అవకాశం లేదు, అది ఇప్పట్లో సాధ్యం కాదు.
  • ఇది పాత, మూలపడిన మీ హార్డ్వేర్ పై కూడా నడుపవచ్చు.
  • యాంటివైరస్లకు ఇక స్వస్తి పలుకండి.
  • సెక్యూరిటీ(భద్రత) అనేది ఇక్కడ ఒక భాగం, అదనపు విశేషం కాదు.


లినక్స్ కొన్ని అద్వితీయమైన ఉత్తమమైన సాఫ్ట్వేర్లకు నెలవు. అంతకంటే ఉత్తమమైన విషయం ఇవి ఉచితంగా లభించడం. చట్టరీత్యా విండోస్ లేక అడోబ్ వారిచ్చే వీడియో లేక ఆడియో ప్లేయర్లకు వారు మనవద్ద రుసుము తీసుకొనవచ్చు, అలా కాకపోతే అది అనైతికం అవుతుంది. కానీ లినక్స్ తో ఆ చిక్కులు లేవు.


లినక్స్ తోవచ్చే కొన్ని ప్రముఖమైన సాఫ్ట్వేర్లు:

    ఓపెన్ ఆఫీస్ (ప్రస్తుతం లిబ్రే ఆఫీస్)
    Gimp Logo
    గింప్ : ఫోటోషాప్ కు ధీటుగా అందుబాటులో ఉన్న ఫోటో కూర్పు సాఫ్ట్వేరు
    VideoLan movie playerవీడియోలాన్ (వీఎల్సీ)
    ప్రముఖ మీడియా ప్లేయర్.
      Gaim Instant Messengerపిడ్గిన్ యాహూ, జీమెయిల్, ఐఆర్సీ, ల్లో చాటింగ్ చేస్కొనే ఉపకరణం 
    Evolution email and groupware clientఎవల్యూషన్ మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ కు ధీటైన బహుముఖ సాఫ్ట్వేఋ
...ఇలా ఎన్నో ఎన్నెన్నో...
మరి అంతా ఉచితమయితే, నాకేమిటంటా? 

మీరే కాదు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే పొరబడుతుంటాయి. చాలా వరకు లినక్స్ అంటే ఒక వ్యాపకం, అది కాలేజీ కుర్రాళ్ళకుండే ఒక చెడు వ్యసనం అని ఫీలయ్యేవాళ్ళు నేటికీ ఉన్నారూ( మా హెచ్ ఓడీ తోసహా)
అయితే ఇవన్నీ కేవలం అపోహలు. నిజాలు:
  • ఎలా అయితే కార్పొరేట్ సాఫ్ట్వేర్లను పెద్ద కంపెనీలు కొని వాడుకుంటాయో అలానే లినక్స్ ను కూడా కొని వాడుతారు.
  • ఇన్టెల్ వంటి బహుళజాతి సంస్థలు లినక్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టి తద్ఫలితంగా వారు తయారుచేసిన హార్డ్వేర్ కు వెనువెంటనే పని చేయించే సాఫ్ట్వేర్ కేవలం లినక్స్ మాత్రమే ఇవ్వగలదు. విండోస్ వంటి సాఫ్ట్వేర్లు కొత్తగా వచ్చిన హార్డ్వేర్కు సరిపోవు.
  • చైనా వంటి దేశాల్లో ౭౦% వరకూ అన్ని కంప్యూటర్లలోనూ లినక్స్ ను మాత్రమే వాడుతున్నారు.ఈ విధంగా ఆ దేశ పౌరులకు చాలా వరకు ధనం ఆదా అవుతుంది. తద్వారా కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
  • మరెన్నో కంపెనీలు వారి సర్వర్లను లినక్స్ కు మార్చుకుంటున్నారు, కారణం : రక్షణ మరియు భద్రత.
  • అలానే ఈ విధంగా లినక్స్ ద్వారా, లేక ఇతర స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల ద్వారా లాభం పొందిన వ్యక్తులు, విద్యార్థులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వారి వారి తోడ్పాటులను లినక్స్ కు తిరిగి అందించటం ద్వారా లినక్స్ మరింత ప్రభావవంతం అవుతున్నది. దీనికి మంచి ఉదాహరణ : వికీపీడియా. వికీపీడియా ఎటువంటి ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా మీకు సమాచారాన్ని అందిస్తుంది, అందువల్లనే కోట్లాది మంది మరలా తిరిగి వికీపీడియాకు సమాచారాన్ని చేర్చి మరింత సమృద్ధి పరుస్తున్నారు. 

లినక్స్ లోని అన్ని ప్రకల్పాలు(ప్రాజెక్టులు) దాదాపు ఇదే విధంగా పని చేస్తాయి.

2 కామెంట్‌లు:

నా బ్లాగ్ నా ఇష్టం చెప్పారు...

ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే అది ఎటువంటి ప్లాట్ఫాం అయినా పనిచేస్తోంది. వహనీయత చాలా విస్తృతం.

ఓపెన్ సోర్సు అర్ధం ఇది కాదు అని నా ఉద్దేశ్యం...

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

సంజీవ్ గారూ, ఓపెంసోర్స్ అంటే ఇదే అర్థాన్ని ఇస్తుంది. ఫ్రీ లిబ్రె ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్న పొడుగాటి పదానికి షార్ట్గా ఫ్లాస్ లేక ఫాస్ అని అంటాము.
అయితే మరి అలా మీరు విడగొట్టి చెప్తూ పోతే క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ వాడే ఎన్నో సాఫ్ట్వేర్లు అవి ఇదే కోవకు చెందినా వాటిని అంవయించుకోలేము.