7, ఫిబ్రవరి 2011, సోమవారం

డెబియన్ -ది యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టం

డెబియన్ 1993లో ఇయాన్ ముర్డాక్ అనే పుర్డ్యు విశ్వవిద్యాలయ విద్యార్ధిచే సృష్టించబడింది.అతను లినక్స్ పంపకం అందరికీ అందుబాటులో డెబియన్ ప్రణాళిక ఉండేటట్లు రూపొందించాడు.డెబియన్ కు పేరు ఎలా వచ్చిందంటే అతని స్నేహితురాలి(ఇపుడు అతని భార్య ) పేరు డెబ్రా(DEBRA) లోని మొదటి మూడు అక్షరాలను తన పేరులోని(Ian Murdock) మొదటి మూడు అక్షరాలను కలిపి DEBIAN గా తయారయింది.దీనిని డెబియన్(deb-e′-en)అని పిలుస్తారు.



           డెబియన్ అంటే చాలా మందికి తెలియదు మనవాల్లకి ఉబుంటునో లేదా లినక్స్ మింట్ వంటి వాటి గురించి తెలుసేమోగాని దీని గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.అసలు వీటన్నిటికీ మూలమే డెబియన్.ఇది లినక్స్ కెర్నల్ను మరియు గ్నూ ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడి చేయబడింది కనుక డెబియన్ గ్నూ/లినక్స్ గా కూడా పిలుస్తారుదీనిని డెస్క్టాపు మరియు సెర్వర్(సేవిక)గాను వాడుకోవచ్చు.డెబియన్ లినక్స్ యునిక్స్ మరియు ఉచిత సాప్ట్వేర్ సంబందిత తత్వాలను ఖచ్చితంగా అనుసరిస్తుంది.డెబియన్ అభివృద్దిచేసేవారు స్థిరమైన,దృఢమైన రక్షణతో తయారుచేయటానికే వారి దృష్టినికేంద్రీకరిస్తారు.ఇలా రూపొందించిన దానినే చాలా ఇతర లినక్స్ పంపకాలు ఆధారంగా వాడుకుంటాయి, వాటిలో ఉబుంటు,లినక్స్ మింట్ నాపిక్స్, గ్సాండ్రోస్లు ఇతర ఉన్నాయి.
అందరికీ అందుబాటులో ఉండే ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిపరచాలనేదే డెబియన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది స్వచ్ఛంద కార్యకర్తలచే మరియు లాభం ఆశించని స్వచ్ఛంద సంస్థల విరాలాలచే అభివృద్ధి చేయబడుతుంది.
           
            డెబియన్ విరివిగా పొందగలిగిన సాప్ట్వేర్లకు,ఐచ్ఛికాలకు కొలువు.ప్రస్థుత స్థిర విడుదల 25 వేల సాప్ట్వేర్ ప్యాకేజీలను 12 వివిధ రకాల కంప్యూటర్ నిర్మితాలకు అందిస్తుంది. నిర్మితాలలో ఇంటెల్/AMD 32-బిట్/64-బిట్ నిర్మితాలు వ్యక్తిగత కంప్యూటర్లలో వాడబడుతుంటే, ARM నిర్మితాలలో ముఖ్యంగా ఎంబెడెడ్ సిస్టంలలో మరియు IBM సెర్వర్ మెయిన్ ఫ్రేమ్ లలో సాధారణంగావాడుతూ కనిపిస్తున్నాయి.డెబియన్ లో చెప్పుకోదగ్గ ముఖ్య మైనది APT ప్యాకేజీ మేనేజ్ మెంట్ సిస్టం, అధిక మొత్తంలో ప్యాకేజీలు, నిర్ణబద్దమైన ప్యాకేజీల విధానాలు, అధిక నాణ్యత కలిగిన విడుదలలు. పద్ధతి ద్వారా పాత ప్యాకేజీల నుండి కొత్తగా విడుదల అయిన ప్యాకేజీలను కావలిసిన వాటిని స్వయంచాలకంగా స్థాపించి అనవసరమైన ప్యాకేజీలను తొలగిస్తుంది.డెబియన్ మరియు దాని ఆధారిత సాప్ట్వేర్లన్నీ .deb అనే పొడిగింతతో ఉంటాయి,వీటిని డెబియన్ ప్యాకేజీలుగా పిలుస్తారు.వీటిని సులభంగా స్థాపించి వాడుకోవచ్చు.


           డెబియన్ ప్రమాణిక స్థాపనలో GNOME డెస్క్టాప్ పర్యావరణం వాడబడుతుంది.ఇందులో లిబ్రేఆఫీసు,ఐస్ వీసెల్(ఫైర్ఫాక్స్ నకలీ), ఎవల్యుషన్ మెయిల్, CD/DVD వ్రైటింగ్ ప్రోగ్రాంలు, సంగీత మరియు వీడియో ప్లేయర్లు, చిత్రాల వీక్షక మరయు సవరణ సాప్ట్వేర్లు, మరియు PDF చదువరి సాప్ట్వేర్లు డెబియన్ స్థాపించినపుడే దానితో పాటే స్థాపించబడతాయి.ముందుగా తయారుచేయబడిన CD ఇమేజ్లు KDE సాప్ట్వేర్ల కంపైలేషన్, Xfce మరియు LXDE వంటి డెస్క్టాపు పర్యావరణాలకు కూడా అందుబాటులో ఉన్నాయి.
           డెబియన్ ను డౌన్లోడు చేసుకోవాలంటే అక్కడ మనకు చాలా ఇమేజ్ ఫైళ్ళు కనిపిస్తాయి.DVD ఫైళ్ళు అయితే ఐదు లేదా CD ఫైళ్ళు ఐతే ముప్పయి వరకూ ఉంటాయి.వీటిని చూసి చాలా మంది డౌన్లోడు చేసుకోవడానికి కూడా సాహసించరు నిజానికి అందులో ఉన్న మొదటి ఒక్క డిస్కు సరిపోతుంది పూర్తి ప్రామాణిక స్థాపన కోసం.మిగిలిన డిస్కులలో సిస్టం స్థాపనకు అవసరం లేని అధిక సాప్ట్వేర్లను ఉంచుతారు.మీరు ఒకసారి మొదటి డిస్కు పెట్టి డెబియన్ స్థాపించన తరువాత మీరు నేరుగా అంతర్జాల సదుపాయం మీకు ఉంటే మిగిలిన మీకు కావలసిన సాప్ట్వేర్లను నేరుగా డౌన్లోడు చేసుకుని స్థాపించుకోవచ్చు.అలాకాకుండా మీకు నెట్ సదుపాయం లేకపోతే మిగిలిన డిస్కులను మీరు కలిగిఉంటే డిస్కులను పెట్టి నేరుగా వాటినుండి సాప్ట్వేర్లను స్థాపించుకోవచ్చు.వాటిని(మిగిలిన డిస్కులను) అందించటంలో ముఖ్య ఉద్ధేశ్యం అంతర్జాల సదుపాయం లేకుండా సాప్ట్వేర్లు స్థాపించుకునే వీలు ల్పించడమే. సిడి/డివిడి ఇమేజ్ (.iso)ఫైళ్ళను మీరు ఉచితంగా నేరుగా లేదా టోరెంట్లు లేదా jigdo ద్వారా వివిధ పద్ధతులలో డౌన్లోడు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ వర్తకుల నుండి కొనుక్కోవచ్చు.

మన దేశంలో వాడుకోలోనున్న సి-డాక్(C-DAC) వారి బాస్(భారతీయ ఆపరేటింగ్ సిస్టం సొల్యూషన్స్) మరియు స్వేచ్ఛ వంటివి కూడా డెబియన్ ఆధారితాలే...

కామెంట్‌లు లేవు: