కంప్యూటర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కంప్యూటర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, నవంబర్ 2010, బుధవారం

ఓపెన్ సోర్సే బెటర్



నేడు కంప్యూటర్ లేనిదే క్షణమైనా గడవటం లేదు. పాతకాలంలో ఒక వాల్వు రేడియో కొంటే దాన్ని పదికాలాలపాటు వాడేవారు. ఆధునిక ప్రపపంచంలో ఆ పరిస్థితి లేదు. అంతా ఆరునెల్లే. ప్రతిరోజూ కొత్త పరిజ్ఞానం మార్కెట్‌లోకి వస్తోంది. ఇది సాఫ్ట్వేర్‌కూ మినహాయింపేమీ కాదు. వేలకు వేలు పోసి ఒక సాఫ్ట్వేర్ కొంటే, దానికి మరో వెర్షన్ ఆరు నెలల్లో ప్రత్యక్షం. మనం కొత్త సాఫ్ట్వేర్ను వాడకపోతే ఔట్‌డేట్ అయిపోయినట్టే. దీనివల్లే హెచ్చుశాతం ప్రజలు ‘పైరసీ’కి దోహదపడుతున్నారు. సాఫ్ట్వేర్ కాపీ చేసి వాడటం తప్పేకాదు. నేరం కూడా! మరిదీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. అదే ‘ఓపెన్ సోర్స్’. అంటే అంతా బహిరంగంగానే లభించడం. అదీ ఉచితంగా. దానికి సోర్స్ కోడ్ కూడా లభిస్తుంది. కేవలం మనం ఒక సాఫ్ట్వేర్ను వాడటమే కాక, కావలిస్తే దానికి మరిన్ని ఫీచర్లు జోడించడమో, ఉన్న సమస్యను పరిష్కరించడమో చేసి, దానిని తిరిగి అందరికీ అందుబాటులో తేగల్గడం ‘ఓపెన్ సోర్స్’ ప్రత్యేకత. వాణిజ్యపరంగా లభించే ఆఫీస్ సూట్‌ల నుంచీ ఫోటోలు ఎడిటింగ్, ప్రజంటేషన్ సాప్ట్వేర్లే కాదు, ఆపరేటింగ్ సిస్టమ్‌లూ, డేటాబేస్ సిస్టమ్‌లూ- ఏ రకమైన సాఫ్ట్వేర్ అయినా సరే! ఓపెన్ సోర్స్ ప్రత్యామ్నాయం వుంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను వాడుకోవడానికి ఎలాంటి పరిమితులూ, పర్మిషన్లూ అక్కర్లేదు. 1983లో రిచర్డ్స్ మాథ్యూస్ స్టాల్‌మాన్ ఆరంభించిన ఫ్రీ సాఫ్ట్‌వేర్ స్ఫూర్తితో 1998లో ఓపెన్ సోర్స్ ఉద్యమ రీతిలో వెలుగులోకి వచ్చింది. 1999లో ‘స్టార్ ఆఫీస్’ పేరుతో అమ్మకాలు సాగించిన సన్‌మైక్రో సంస్థ దానిని ఉచితంగా, ఓపెన్ సోర్స్ కింద ఓపెన్ ఆఫీస్, ఓఆర్‌జి పేరుతో అందుబాటులోకి తేవడంతో ఊపునందుకొంది. స్పెయిన్ లాంటి దేశాల్లో ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్ల ఆధారంగా శిక్షణనివ్వడమే కాదు, ఆయా సాఫ్ట్వేర్లను ఈ-గవర్నెన్స్ చొరవల్లో వాడుతున్నారు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడటం మొదలైంది.
ఓపెన్ సోర్స్
సాఫ్ట్వేర్లను అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలూ వాడి ఈ-గవర్నన్స్ అమలు చేస్తే, ఆర్థికంగా, ఎంతో లబ్ధి చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్లు అటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ, ఇటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ కూడా పనిచేసేలా దొరుకుతాయి. ఆఫీస్ సూట్స్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్‌టిఎంఎల్ ఎడిటర్స్, టెక్స్ ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్, యానిమేషన్ టూల్స్, ఈ-మెయిల్ క్లయింట్స్, ఇంటర్నెట్ బ్రౌజర్స్, ఎఫ్‌టిపీ క్లయింట్స్, వెబ్ సర్వర్స్, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఆఖరికి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. వైజ్ఞానిక, సాంకేతిక పరమైన సాఫ్ట్వేర్లూ ఉన్నాయి. ఆడియో, వీడియో సాఫ్ట్వేర్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇఆర్‌పి, క్యాడ్, క్యామ్ రంగాల్లో కూడా ఎన్నోసాఫ్ట్వేర్లూ ఉన్నాయి.
మన ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులన్నీ ఓపెన్ సోర్స్ ఆధారంగా రూపొందితే కొన్నివేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. దానిని ప్రజా సంక్షేమానికి వాడొచ్చు. ఈ రీతిలో మన మేథావులూ, ప్రభుత్వాలూ ఆలోచిస్తే ఎంత బావుంటుందో! కదా!