యునిటీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యునిటీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఉబుంటు 12.04 విడుదలైంది


ఉబుంటు సరికొత్త విడుదల ఉబుంటు 12.04 విడుదలైంది. ఈ విడుదలలోని విశేషాలేమిటో చూద్దాం. ఈ విడుదల యొక్క సంకేత నామం ప్రిసైజ్ ప్యాంగోలిన్. ఈ విడుదలకు 04/2017 వరకూ మద్ధతుంది. LTS అంటే లాంగ్ టెర్మ్ సపోర్ట్(దీర్ఘకాలిక మద్ధతు).




మార్పులు - చేర్పులు
ఈ రూపాంతరంలో ఇటీవలే విడుదలైన గ్నోమ్ 3.4 అనువర్తనాలను వినియోగించారు. కానీ అప్రమేయ అంతరవర్తిగా మాత్రం యునిటీనే కొనసాగించారు.
యునిటీ అంతరవర్తి
ఉబుంటు జట్టు అభివృద్ధి చేసిన అంతరవర్తి యునిటీ, దీనిని మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ మరియు ఉబుంటు వన్ వంటి వాటికి యునిటీ సమన్వయాన్ని మెరుగుపరిచారు. 
అనువర్తనాలు
లినక్స్ కెర్నల్ 3.2.0-23.36, యునిటీ 5.10, నాటిలస్ 3.4.1, జియెడిట్ 3.4.1, గ్విబర్ 3.4, రిథమ్ బాక్స్ 2.96, ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ 5.2, సరికొత్త లిబ్రే ఆఫీస్ 3.5.2 మరియు మొజిల్లా ఫైర్ ఫాక్స్ 11.0 రూపాంతరాలు, థండరుబర్డ్ ఈమెయిల్ కక్షిదారు 11.1, ఎంపతి సత్వర సందేశకం 3.4.1, టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం 3.0.1, షాట్వెల్ 0.12, ట్రాన్స్మిషన్ 2.51
బన్షీకి బదులుగా రిథమ్ బాక్సును తిరిగి అప్రమేయ సంగీత ప్రదర్శకముగా తీసుకున్నారు. బన్షీతో పాటుగా  టోంబాయ్ మరియు జీబ్రెయినీ అనువర్తనాలను తీసివేసారు.
గ్నోమ్ నియంత్రణ కేంద్రంలో జిట్ గీస్ట్ కార్యకలాపాల చిట్టా నిర్వాహకం ద్వారా గోప్యత (ప్రైవసీ) ఐచ్ఛికాన్ని చేర్చారు. దీనిని ఉపయోగించి ఇటీవలి వాడిన దస్త్రాలు, సంచయాలు, అనువర్తనాల చరిత్రను చెరిపివేయవచ్చు.
ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రం
సరికొత్త రూపంతో, మరిన్ని హంగులతో ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రాన్ని బాగా తీర్చిదిద్దారు. అంతే కాకుండా అనువర్తనాల సమీక్షా విధానం ఉండటం వలన సమీక్షలను చదివి అనువర్తనాలను స్థాపించుకోవచ్చు, మీ అభిప్రాయాలను కూడా జోడించవచ్చు. కొనుగోలు చేయుటకు అనేక ఆటలు, మ్యాగజైనులు...అందుబాటులో ఉంచారు, పేపాల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పుస్తకాలు మరియు మ్యాగజైన్స్ అనే కొత్త వర్గం చేర్చబడింది. బహుళ తెరపట్టులు, సిఫారసుల వ్యవస్థ, భాషా ప్యాక్ల మద్ధతు చెప్పుకోదగినవి.
ఉబుంటు తెలుగు లినక్స్ స్థితి:
ఉబుంటు అనువాదం దాదాపు 71 శాతం పూర్తయివుంది, స్థాపక ప్రక్రియ నుండే తెలుగు అందుబాటులో ఉన్నది. అందువల్ల దాదాపు ఉబుంటు నిర్వాహక వ్యవస్థ అంతా తెలుగులో అందుబాటులో ఉంది. అంతేకాక కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నవారు ప్రయత్నించి చూడవచ్చు ఒకవేళ నచ్చకపోతే ఆంగ్ల భాషలోకి మారిపోవడం కూడా ఎంతో సులభం. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు.
ఉబుంటు తెలుగు లినక్స్ గణాంకాలు


ఉబుంటు 12.04 కు ఉన్నతీకరణ(అప్ గ్రేడ్) ద్వారా మారండి
ఒకవేళ మీరు ఉబుంటు పాత విడుదలని వాడుతున్నట్లయితే, క్రిందపేర్కొన్న ఆదేశాల ద్వారా మీ వ్యవస్థను కొత్త విడుదలకు ఉన్నతీకరించవచ్చును.
ముందుగా మీరు వాడుతున్న ప్యాకేజీలన్నీ తాజాగా ఉండేట్టు చూసుకోండి లేకపోతే
sudo apt-get update

sudo apt-get dist-upgrade

ఆ తరువాత క్రింది ఆదేశాన్ని నడపండి
sudo update-manager -d


ఉబుంటు 12.04 ను దింపుకోండి...
ఒకవేళ మీరు ఉబుంటూకి కొత్త అయితే, ఉబుంటు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక లుక్కేసుకోండి. స్థాపన సహాయం కోసం ఈ లంకెను సందర్శించవచ్చు.




ప్రత్యామ్నాయ దింపుకోలు లంకెలు | దింపుకోలు మిర్రర్లు.


వీటిని కూడా చూడండి:
హైదరాబాదులో ఉబుంటు విడుదల వేడుక చేసుకుందామా..?
మీ అభిప్రాయం తెలపండి

2, మే 2011, సోమవారం

ఉబుంటు 11.04 విడుదల మరియు సమీక్ష

ప్రత్యేకాంశాలు
  •  స్థాపన ప్రక్రియ నుండే దాదాపు అన్నీ తెలుగు భాషలో అందుబాటు.
  • యునిటీ అంతరవర్తి
ఉబుంటు సరికొత్త డెస్కుటాప్ అంతరవర్తి "యునిటీ"
ఉబుంటు 11.04లో యునిటీ అంతరవర్తి అప్రమేయంగా ఉంటుంది. ఇంతకు ముందు గ్నోమ్ అంతరవర్తి ఉండేది, గ్నోమ్ కొత్త రూపాంతరం గ్నోమ్ 3 విడుదల సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం మరియు కొన్ని ఇతర కారణాల వలన "యునిటీ"ని అభివృద్ధిచేసారు.యునిటీని ఇంతకుముందు వర్షన్ ఉబుంటు 10.10 మేవరిక్ మీర్కట్ లోనే ప్రవేశపెట్టినా అది ప్రయోగాత్మకంగా వుంది, కానీ ఈ రూపాంతరంలో యునిటీని పూర్తిస్థాయిలో చేర్చడం జరిగింది. యునిటీని అనుభవజ్ఙులచే రూపొందించబడింది, ఇది వాడుకరులకు మరింత సౌకర్యవంతంగా ఉండేటట్లు తయారుచేయబడింది.నిజానికి ఇది చాలా వైవిధ్యముగా ఉంటుంది, దీనిని చెత్తగా వుందని అర్ధంచేసుకోకూడదు.ఇది ఇంచుమించు గ్నోమ్ 3 లాగానే ఉంటుంది కానీ ఇది ప్రత్యేకమైనది. బహుశా కొత్త వాడుకరులు అలవాటు పడేవరకూ ఇది అంతగా నచ్చకపోవచ్చు.దీనికి ప్రత్యామ్నాయం కూడా ఒకటి ఉంది అదే ఉబుంటు క్లాసిక్ అంతరవర్తి(interface) దీనిని వాడుకరి కంప్యూటరు నందు ప్రవేశించేటపుడు ఎంపికచేసుకోవలసివుంటుంది, ఇది గ్నోమ్ అంతరవర్తి వలె మెనూలను కలిగివుంటుంది. కొన్ని పాత లేదా గ్రాఫిక్స్ సహకారం సరిగాలేని కంప్యూటర్ నందు యునిటీ లోడవ్వకపోయే అవకాశం ఉంది ఇటువంటి సందర్భంలో ఉబుంటు క్లాసిక్ అంతరవర్తి వాడబడుతుంది. గ్నోమ్ ఇష్టపడేవారు సరికొత్త గ్నోమ్ 3 రూపాంతరాన్ని వ్యక్తిగత ప్యాకేజీ సంగ్రహము(Personal Package Archieve-PPA) నుండి స్థాపించుకొనవచ్చును కాకపోతే ఇలా చేయడం వలన యునిటీని శాశ్వతంగా కోల్పోతారు. 



సరికొత్త మార్పులు-చేర్పులు
ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రములో సమీక్షా విధానాన్ని చేర్చారు.దీని వలన మీరు స్థాపించదలచుకున్న సాఫ్ట్వేర్ యొక్క రేటింగును మరియు సమీక్షలను చదివి స్థాపించుకోవచ్చు. .mp3 ఫైళ్ళను ఇదివరకూ ప్లేచేయాలంటే సాధారణంగా ఉచితంగా లభించని, ఆంక్షలువున్న కొడెక్ లను వాడేవారు కాని ఇపుడు ఈ అవసరం లేదు ఎందుకంటే ఫ్లుయెండో mp3 ప్లగిన్‌ను థర్డ్-పార్టీ సాఫ్ట్వేర్ ద్వారా ఉచితంగానే లభిస్తుంది.అంతేకాకుండా కుచించబడిన .rar ఫైళ్ళకు కూడా సహకారం అప్రమేయంగా చేర్చబడింది.మొజిల్లా వారి సరికొత్త రూపాంతరమయిన ఫైర్‌ఫాక్స్ 4 కూడా చేర్చబడింది.స్క్రోల్ బార్ నందు కూడా మార్పును గమనించవచ్చు.




ఆప్ మెను
అనువర్తనాల మెనూలు ఇదివరకూ ఏ అనువర్తనానికి దానికదే ప్రత్యేక విండోను కలిగి మెనూలన్నీ అదే విండోలో వుండేవి కాని ప్రస్తుతం అన్ని అనువర్తనాలకు ఒకటే మెను దానినే సార్వత్రిక మెను(గ్లోబల్ మెను) ఉంటుంది.

సాఫ్ట్ వేర్ మార్పులు-చేర్పులు
లిబ్రే ఆఫీసు
ఓపెన్ ఆఫీసుకు బదులుగా లిబ్రే ఆఫీసును చేర్చడం జరిగింది. దీనివెనుక అసలు కారణం సన్ నెట్వర్కును ఒరాకిల్ సంస్థ కనుగోలు చేయడం వలన ఓపెన్ ఆఫీసే లిబ్రే ఆఫీసుగా రూపాంతరం చెందింది.అర్జునరావుగారు సరైన సమయానికి దీనిని గమనించి ఉన్న అనువాదాలను సమీక్షించి ఈ ప్రోజెక్టును పూర్తిచేసారు.
షాట్‌వెల్
ఇదివరకూ ఫొటోలను చూడాలన్నా వాటిని నిర్వహించాలన్నా f-స్పాట్ ఫొటో నిర్వాహకాన్ని వాడేవారు ప్రస్తుతం అన్ని ప్రోజెక్టుల నందు దీనికి బదులుగా షాట్‌వెల్ ఫొటో నిర్వాహకాన్ని చేర్చారు.ఇది చాలా సౌకర్యవంతంగా, సులభంగా ఉన్నది.
బన్‌షీ
సంగీత సాధనమైన రిథమ్ బాక్సుకు బదులుగా బన్‌షీ సంగీత ప్లేయరును చేర్చడం జరిగింది. ఇందులో కేవలం సంగీతమే కాకుండా వీడియోలను చూడవచ్చు, అంతర్జాల రేడియో వినవచ్చు మరియు అంతర్జాలములో సంగీతమును శోధించవచ్చు.అమెజాన్ mp3,7 డిజిటల్ సంగీత దుఖానాల సహకారాన్ని చేర్చారు.బన్‌షీ చూడటానికి కూడా ఎంతో ఆసక్తికరంగా, మెనూ ఇంటిగ్రేషనుతో అందముగా కనపడుతుంది.బన్‌షీ అనువాదము పాక్షికముగా అయినప్పటికీ పూర్తయింతవరకూ సంతృప్తికరంగానేవుంది.

ఉబుంటు shipit free కార్యక్రమమును ఆపి వేసారు కనుక ఇకనుంచి ఉబుంటు సిడిలను ఉచితంగా పొందటం అంత సులభం కాదు.గత కొన్ని సంవత్సరములుగా వారు నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉబుంటు గురించి తెలిసిన వారందరూ ఉచిత సిడిలను పొందివున్నారు. కెనానికల్ సంస్థ దాదాపు వారనుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు ప్రకటించారు.అయినప్పటికీ ఈ కార్యక్రమమును తమ స్థానిక జట్ల ద్వారా కొనసాగిస్తామన్నారు.ఇది ఎంతవరకూ సఫలమవుతుందో వేచి చూడాలి.
ఉబుంటుని నేరుగా ఇక్కడి నుండి దిగుమతి చేసుకోండి.
 
ఇతర పద్ధతులలో దిగుమతి చేసుకోవడానికి ఈ పేజీని సందర్శించండి.
తెలుగులినక్స్ బ్లాగు బ్లాగర్ నుండి త్వరలోనే వర్డ్ ప్రెస్ కు విస్తరించబడనుంది గమనించగలరు.
మీ అభిప్రాయాలను, సూచనలను వ్యాఖ్యల రూపంలో నిర్మొహమాటంగా జోడించగలరు.

2, ఏప్రిల్ 2011, శనివారం

ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ రాబోతుంది...

లినక్స్ గురించి పెద్దగా పరిచయం లేనివారు కూడా ఉబుంటు గురించి కాస్తో కూస్తో తెలుసుకుంటున్నారు.దీనికి ముఖ్య కారణాలు ఉబుంటు ఉచితం, ఆకర్షణీయమైన డెస్కుటాప్ పరిసరం మరియు ఆన్ లైన్ లో లభించే మద్ధతు కూడా ఎక్కువే.అంతేకాకుండా ఈ పంపకాన్ని నిర్వహిస్తున్న కెనానికల్ సంస్థ అందరికీ అందుబాటుల్  ఉండేలా ఉబుంటు CDలను ఉచితంగా పంపిణీచేస్తుంది. అందువలన చాలామంది ఈ ఉచిత CDని పొందుటకు ఆశక్తి చూపుతున్నారు. ప్రపంచంలో చాలా మంది ఈ విధంగా ఉచిత CDలను పొందుతున్నారు, మన రాష్ట్రంలో కూడా. కాని ఇలా పొందిన వారిలో ఎంతమంది దానిని సరిగా ఉపయోగిస్తున్నారనేది ఆలోచించవలసిన విషయం.దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకి అంతర్జాల అనుసంధానం ఎలా ఏర్పరుచుకోవాలో తెలియకపోవడం, ఏమేమి అనువర్తనాలు ఉన్నాయో వాటిని ఎలా వాడుకోవాలో...ఇలా అనేకం ఉండవచ్చు.


ఇక విషయానికి వస్తే ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఇప్పటికే బీటా 1 వెర్షన్ విడుదలయింది, బీటా 2 ఏప్రిల్ 14న విడుదల అవుతుంది.బీటా 2 కల్లా ఉన్న అన్ని లోపాలను, దోషాలను సరిదిద్ది ఆఖరి విడుదల చేస్తారు.

ఉబుంటు 11.04 ఎలా ఉండబోతోందో ఇక్కడ ఒకసారిచూడండి...వీడియోబంధించేటపుడుకొన్నిప్రభావాలు సరిగాబంధించలేకపోయింది దానిని రికార్డర్ తప్పిదముగా గుర్తించగలరు.





తెలుగు స్థానికీకరణ విషయానికి వస్తే నేను కొంత భాధ్యత తీసుకుని ఉన్న లోపాలను, తప్పులను సరిదిద్దాను అంతేకాకుండా ఈ సారి తెలుగువారు ఒక అడుగు ముందుకేసి తెలుగులో వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కాస్త సరళీకరించాను.కొన్ని కొత్త అనువర్తనాలను మరియు అప్రమేయంగా వచ్చే అనువర్తనాలను స్థానికీకరించాను. వాడుకరి అంతరవర్తి (user interface) దాదాపు తెలుగులోనే ఉండబోతుంది. నిన్న విడుదలయిన బీటా వెర్షన్ లో మొన్నటివరకూ చేసిన అనువాదాలు ఇంకా పూర్తిగా చేర్చబడలేదు. చివరి విడుదలకల్లా ఇవి చేర్చబడతాయి.


గమనిక: తెలుగు లినక్స్ లేదా అనువర్తనాలను తెలుగులో వాడటం అనేటప్పటికీ చాలా మంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. లినక్స్ తెలుగులో వాడటమంటే కేవలం తెలుగు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇంగ్లీషు ఉండబోదని కొంతమంది అనుకుంటారు. నిజానికి ఎందులోనైనా అప్రమేయంగా ఇంగ్లీషు ఉంటుంది.దీనికి అదనంగా తెలుగు భాష కూడా అందుబాటులో ఉంటుంది. సిస్టం యొక్క వాడుకరి అంతరవర్తి (user interface) భాషను సిస్టం ప్రారంభించేటపుడే ఎంచుకోవలసి ఉంటుంది. మీ ప్రాధాన్యత బట్టి తెలుగులో కావలిస్తే తెలుగులో లేదా ఇంగ్లీషులో.


ఈసారి తెలుగు ఉబుంటు విడుదలలో చెప్పుకోదగ్గ విషయాలు


  • స్థాపన ప్రక్రియను తెలుగులోనే ప్రారంభించవచ్చు.
  • దాదాపు వాడుకరి అంతరవర్తి (user interface) అంతా తెలుగులోనే ఉండబోతుంది.


ఉబుంటు 11.04 లో మార్పులు-చేర్పులు


  1. ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ లో సాధారణంగా ఎప్పుడూ ఉండే వాడుకరి అంతరవర్తి గ్నోమ్ కాకుండా ఉబుంటు వారు ప్రత్యేకంగా యునిటీ [unity] అనే దానిని రూపొందించి అభివృద్ధిచేసారు. ఇది దాదాపు కొత్తగా రాబోయే గ్నోమ్ 3(gnome 3)ను పోలి ఉంటుందనుకోండి.
  2. ఫ్లుయెండో MP3ప్లగిన్ ను ఉబుంటు ఉచితంగా అందిస్తున్నది.
  3. రిథమ్ బాక్స్ కు బదులుగా బన్‌షీ మీడియా ప్లేయర్ ను ఉండబోతుంది.
  4. F-spotకు బదులుగా షాట్‌వెల్ ఫొటో మానేజర్ ఉండబోతుంది.
  5. rar పైళ్ళకు మద్ధతు.
  6. సాఫ్ట్ వేర్ కేంద్రంలో కొత్తగా సమీక్ష చేసే అవకాశాన్ని కల్పించారు.ఈ సమీక్షల ఆధారంగా వాటి యొక్క రేటింగులను చూసి సాఫ్ట్ వేర్లను స్థాపించుకోవచ్చు.అంతేకాకుండా కొన్ని సాఫ్ట్ వేర్లను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.(దాదాపు ఉబుంటూలో లభించే సాఫ్ట్ వేర్ అంతా ఉచితంగానే అందించబడుతుంది)
  7. సరికొత్త ఫైర్ ఫాక్స్ 4 వెర్షన్.
  8. ఓపెన్ ఆఫీసుకు బదులుగా లిబ్రే ఆఫీసు ఉండబోతుంది (సన్ నెట్వర్కుని ఒరాకిల్ సంస్థ కనుగోలు చేసి దీనిని లిబ్రే ఆఫీసుగా మార్చడం జరిగింది.)
ఉబుంటూనిప్రచారం చేయాలనుకుంటే ఈకౌంటర్లనిమీ బ్లాగులలోను మరియుసైట్లలోను ఉంచగలరు.వీటిని జతచేయాలంటే మీ బ్లాగు డిజైన్ కు వెళ్ళి add gadgets లో html/Javascript  ను నొక్కి ఈ కింది పాఠ్యమును ప్రవేశపెట్టన తరువాత Richtext మీద క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది.

<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner1.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>
లేదా


<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner2.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>

లేదా


<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner3.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>
లేదా

<a href="http://www.ubuntu.com/testing/natty/beta"><img title="Ubuntu 11.04 days to go" src="http://picomol.de/counter/i_t.png" alt="Ubuntu 11.04 days to go" /></a>


స్థానికీకరణలోనూ మరియు ఇతర అంశాలలోనూ సహాయం, సహకారం అందించిన అర్జున రావు, కృష్ణబాబు, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం, రవిచంద్ర, సునీల్ మోహన్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

నెనరులు,
Praveen Illa.