ప్రముఖ
యాజమాన్య VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) కక్షిదారు(క్లయింటు)
అయిన స్కైపును మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసిన తరువాత లినక్సుకు మద్ధతు
ఉండదేమో అని అందరూ భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. దాదాపు కొనుగోలు
చేసిన ఏడాది తరువాత సరికొత్త రూపాంతరాన్ని విడుదల చేసింది. స్కైప్ 2.2
తరువాత నేరుగా స్కైప్ 4.0 విడుదలైంది. ఈ విడుదల యొక్క సంకేతనామం "ఫోర్
రూమ్స్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్". సుదీర్ఘకాలం తరువాత విడుదలయిన ఈ రూపాంతరంలో
విశిష్టతలేమిటో చూద్దాం.
ఈ రూపాంతరంలో ప్రత్యేకతలు
- ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరిచారు.
- అదనపు వెబ్ క్యామ్ మద్ధతు
- చాట్ చరిత్ర నింపుట మరింత వేగం
- క్రాష్ లేదా ఫ్రీజ్ అయ్యే అవకాశాలు తక్కువ
- సంభాషణల సమకాలీకరణను మెరుగుపరిచారు
- సరికొత్త స్థితి ప్రతీకలు మరియు హావభావాల చిహ్నాలు
- ట్యాబ్స్ ద్వారా సంభాషణ
- సంభాషణ మరియు కాల్ వీక్షణలలో మార్పులు
గమనిక:
మీ వ్యవస్థలో స్కైప్ 2.2 స్థాపించబడివుంటే ప్యాకేజీల సంఘర్షణ తలెత్తకుండా
ఉండాలంటే ముందుగా పాత ప్యాకేజీని తొలగించి తరువాత సరికొత్త ప్యాకేజీని
స్థాపించుకోండి
ప్రస్తుతం డెబియన్, ఉబుంటు మరియు ఫెడోరా,
ఓపెన్‌స్యూజ్ పంపకాలకు మాత్రమే ప్యాకేజీలు అందుబాటులోవున్నాయి. ఇతర పంపకాల
వాడుతున్న వారు కనీసం కంపైల్ చేసుకుని స్థాపించుకుందామనుకుంటే, సోర్సుకోడు
అందుబాటులో లేదు.