గ్నోమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గ్నోమ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఆగస్టు 2014, సోమవారం

'గ్నోమ్-సుషి' దస్త్ర మునుజూపకం

గ్నోమ్ అనువర్తనాలలో నాకు బాగా నచ్చిన అనువర్తనాలలో  'గ్నోమ్-సుషి' కూడా ఒకటి. ఈ ప్రయోజనకారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. గ్నోమ్-సుషి అనువర్తనం వ్యవస్థలోని వివిధ రకాల దస్త్రాలను మునుజూపుతుంది. అంటే మీ కంప్యూటరులో ఉండే వివిధ దస్త్రాలను చాలా సులభంగా తెరచి అందులోని అంశాలను/ప్రాథమిక సమాచారాన్ని చూడవచ్చు. ఇది వ్యవస్థలో ఉన్న వివిధ లైబ్రరీలను వాడుకుని శ్రవ్యక(ఆడియో), దృశ్యక(వీడియో), పాఠ్య, పత్ర దస్త్రాలను మును చూపిస్తుంది.

గ్నోమ్ సుషిలో వీడియో ప్రదర్శన
పరిమితులు: దస్త్రాలను వీక్షిస్తున్నప్పుడు అవి చూడటానికి మాత్రమే తప్ప నకలుచేయుటకు లేదా మరే ఇతర పనులు చేపట్టడానికి అనుమతించదు. అలాగే సుషిని వాడుతున్నంతసేపూ దస్త్ర విహారకం తెరచేవుండాలి.
 
ఈ అనువర్తనాన్ని మీ లినక్స్ వ్యవస్థలో స్థాపించడానికి
డెబియన్‌లో అయితే
#apt-get install gnome-sushi

ఉబుంటులో అయితే
$sudo apt-get install gnome-sushi

ఫెడోరాలో అయితే
$su yum install gnome-sushi

వాడటం ఎలా:
ముందుగా నాటిలస్ (దస్త్రాలను తెరవడానికి, చూడటానికి, నకలు చేయడానికి వాడే అనువర్తనం) దస్త్ర విహారకాన్ని తెరచి ఏదైనా దస్త్రాన్ని(.txt,pdf,odt,avi,wmv,mp4,mp3,jpeg,png...వంటివి) ఎంపికచేసి 'space' మీటను నొక్కండి. మీరు ఎంచుకున్న దస్త్రం దృశ్యకం(వీడియో) అయితే ప్రదర్శించబడుతుంది, శ్రవ్యకం(ఆడియో) అయితే వినిపిస్తుంది. ఒకవేళ PDF దస్త్రం అయితే చదువుటకు అనుమతిస్తుంది. తెరచిన దస్త్రాన్ని మూసివేయుటకు space లేదా esc మీటలను వాడవచ్చు. పూర్తిస్థాయిలో(నిండుతెరలో) దస్త్రాన్ని చూడటానికి F లేదా Ctrl+F వాడవచ్చును.

గమనిక: ఈ అనువర్తనం కేవలం గ్నోమ్ 3‌.2 లేదా ఆ తరువాత రూపాంతరాల పై మాత్రమే పనిచేస్తుంది.

పైన వాడిన పదజాలం
1. Applications - అనువర్తనాలు
2. File Previewer - దస్త్ర మునుజూపకం
3. File Browser - దస్త్ర విహారకం - దస్త్రాలు తెరవడానికి, చూడటానికి, నకలు చేయడానికి, తరలించడానికి ఉపయోగించే అనువర్తనం
4. Install - స్థాపించు

పై పదాలకు అచ్చ తెలుగు పదాలు/ఇంకా సులభమైన పదాలు మీకు ఏమైనా తడితే వ్యాఖ్య రూపంలో ఇక్కడ చేర్చండి

13, జూన్ 2012, బుధవారం

గ్నోమ్ షెల్‌లో వ్యవస్థను మూసివేయడం ఎలా



సాధారణంగా గ్నోమ్‌లో వ్యవస్థను మూసివేయుటకు నేరుగా మూసివేసే (ష్యట్‌డౌన్) బటన్ ఉండేది. కానీ ఆ తరువాత విడుదలైన గ్నోమ్ షెల్‌లో అటువంటి బటన్ ఏమీ కనిపించదు. కేవలం నిష్క్రమించు (లాగౌట్) మరియు తాత్కాలికంగా మూసివేయి (సస్పెండ్) ఐచ్ఛికాలు మాత్రమే కనిపిస్తాయి. గ్నోమ్ షెల్ వాడే చాలా మందికి తమ వ్యవస్థను నేరుగా మూసివేయడం తెలియక ముందుగా లాగౌట్ అయ్యి లాగిన్ మెనూ నుండి ష్యట్‌డౌన్ అవుతారు. అసలు విషయం ఏమిటంటే మీరు ఆల్ట్ బటన్ ఒత్తి పట్టుకుంటే సస్పెండ్ ఐచ్ఛికం కాస్తా విద్యుత్ ఆపు(పవర్ ఆఫ్)గా మారుతుంది.


ప్రతీసారీ ఆల్ట్ నొక్కనవసరం లేకుండా ఈ ఐచ్ఛికాన్ని గ్నోమ్ షెల్ పొడిగింత ద్వారా మార్చుకోవచ్చు. ఈ పొడిగింతను స్థాపించుకోండి. గ్నోమ్ షెల్ పొడిగింతల గురించి తెలుసుకోవాలంటే దిగువ ఇవ్వబడిన లంకెను సందర్శించండి.
గ్నోమ్ షెల్ పొడిగింతలు


గ్నోమ్ తదుపరి విడుదలయిన 3.6లో మూసివేత ఐచ్ఛికాన్ని నేరుగా ఇవ్వనున్నట్లు సమాచారం. నిజానికి ఈ టపాను ఏడాది క్రిందటే పోస్టు చేయవలసింది తీరికలేకపోవడం వలన ఆలస్యమైంది.

10, ఏప్రిల్ 2012, మంగళవారం

గ్నోమ్ షెల్ పొడిగింతలు

గత కొద్ది కాలంగా లినక్స్ డెస్కుటాప్ పర్యావరణంలో గణనీయమైన మార్పులు చేసుకుంటున్నాయి. గ్నోమ్ 2.32 రూపాంతరం తరువాత విడుదలైన గ్నోమ్ షెల్ కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. ఎందుకంటే సాంప్రదాయక డెస్కుటాప్ పర్యావరణం వలె కాకుండా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే నిర్వాహక వ్యవస్థ వలె ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ ఈ మార్పులు కొత్త తరం నిర్వాహక వ్యవస్థను రూపొందించుటకు దారితీసాయి.

గ్నోమ్ షెల్ పూర్తిగా వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో మెనూలు మరియు ప్యానల్స్ వంటివి ఉండవు. ప్రతీరోజువాడే అనువర్తనాలను సరళంగా వాడుకునే రీతిలో రూపొందించారు. గ్నోమ్ పరియోజన అభివృద్ధి కూడా చాలా వేగవంతమైనది. సృజనాత్మకతతో గ్నోమ్ షెల్‌కు మరిన్ని హంగులు దిద్దుతున్నారు. గ్నోమ్ డెస్కుటాప్ పర్యావరణాన్ని క్రింది తెరపట్టులలో తిలకించవచ్చు.




గ్నోమ్ షెల్ కొరకు పొడిగింతల సైటును ప్రారంభించారు. ఈ పొడిగింతలు ఫైర్‌ఫాక్స్ లోని యాడ్-ఆన్స్ వలె ఉంటాయి. ఈ పొడిగింతలు ద్వారా మీ డెస్కుటాపుకి మరిన్ని ప్రయోజకాలను జతచేయవచ్చు.
గమనిక: ఈ పొడిగింతలు కేవలం గ్నోమ్ 3.2 లేదా ఆపై రూపాంతరాలలో మాత్రమే పనిచేస్తాయి. గ్నోమ్ షెల్ 3.0 లో పనిచేయవు.






గ్నోమ్ షెల్‌లో నాకు నచ్చిన కొన్ని పొడిగింతలు
ఈ పొడిగింతలను మీ వ్యవస్థ నందు స్థాపించుటకు https://extensions.gnome.org/ సైటుకు వెళ్ళి మీకు నచ్చిన పొడిగింతను ఎంచుకుని నొక్కినపుడు లోడైన పుటలో పైన ఎడమవైపున ఆఫ్ అనే బొత్తాం కనిపిస్తుంది
  

దానిపై నొక్కినట్లయితే స్థాపించమంటారా అని సంవాదం ప్రత్యక్షమవుతుంది. అపుడు install పై నొక్కండి.
స్థాపించిన పొడిగింతలను తొలగించడం ఎలా..?
మీ వ్యవస్థలో స్థాపించిన పొడిగింతలను తొలగించాలంటే స్థాపించిన పొడింత చిరునామాలో కనపడు ఆన్ బొత్తాంపై నొక్కి తొలగించవచ్చు.

31, జనవరి 2012, మంగళవారం

తెలుగు లినక్స్ బ్లాగుకు తిరిగి స్వాగతం...

కొన్ని కారణాల దృష్ట్యా గత కొద్ది కాలముగా ఎటువంటి టపాలను చేయలేకపోయాను. తెలుగు లినక్స్ స్థానీకరణ, వివిధ స్వేచ్ఛాయుత సాఫ్టువేర్ స్థానికీకరణపై పూర్తి శ్రద్ధ పెట్టడం వలన గత కొద్ది నెలలుగా బ్లాగును నవీకరించడం కుదరలేదు. ఉన్నటువంటి అనువాదాలన్నిటినీ సమీక్షించి సామాన్య వాడుకరికి అర్ధమయ్యే రీతిలో ఉండాలని భావించి ఈ కార్యానికి పూనుకోవడం జరిగింది. నా మాతృ భాషకు నేను ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పమే నన్ను ఆ దిశగా నడిపించింది. నేను అనుకున్న లక్ష్యాలు దాదాపు చేరుకున్నాను వాటిలో ముఖ్యమైనవి వియల్సీ మాధ్యమ ప్రదర్శకం (VLC మీడియా ప్లేయర్), జిపార్టెడ్, షాట్వెల్, బన్షీ, ఉబుంటు అంతర్భాగ అనువర్తనాలు, లినక్స్ మింట్, గింప్, గ్నోమ్ అనువర్తనాల అనువాదం మరియు సమీక్ష, వెబ్సైటు తెలుగీకరణ, ఫెడోరా వెబ్సైటు తెలుగీకరణ, Xfce, LXDE అంతరవర్తుల అనువాదం...ఇంకా చాలా చేసాననుకోండి (చెబితే అదో పెద్ద జాబితా అవుతుంది :-)). చిన్న పిల్లల కోసం ఏదైనా ఒక లినక్స్ పంపిణీను తెలుగులోకి తీసుకురావాలనుకున్నాను. అందుకని డ్యుడ్యులినక్స్ అనే పరియోజనలో భాగస్వామినై అనువదించాను. ఇది దాదాపు 43 శాతం పూర్తయినది. కాకపోతే అంతర్జాలంలో అనువదించడం వలన కొన్ని అక్షరాలు ఎగిరిపోయినవి. అందువలన దీనిని ఇప్పటివరకూ ఎవరికీ సిఫారసు చేయలేకపోయాను. ఈ అనువాద దోషాలన్నీ ఇప్పటికే సరిచేసాను ఇక కొత్త రూపాంతరం వెలువడం ఒక్కటే ఆలస్యం. 
ఇకనుండి సరికొత్త లినక్స్ సాంకేతికాలను, మెలుకువలను, చిట్కాలను మరియు జిమ్మిక్కులను  వివిధ రూపాలలో అందించే ప్రయత్నం చేస్తాను.
మీరు తెలుగులినక్సును ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో కూడా అనుసరించవచ్చు.
ఎప్పటివలె మీ సలహాలను, సూచనలను తెలుగులినక్సుకు అందిస్తారని ఆశిస్తున్నాను.
నిర్వాహకుడు,
Praveen Illa.

19, ఫిబ్రవరి 2011, శనివారం

గ్నోమ్

గ్నోమ్ కి అర్థం ఏమిటి? గ్నోమ్, ఆంగ్లంలో GNOME అనునది GNU Network Object Model Environment అన్న పదానికి క్లుపతరూపం. కానీ మనకు అది అవసరం లేదు.
అయితే
గ్నోమ్ అంటే ఏమిటి? గ్నోమ్  గురించి గ్నోమ్ వారు ఏం చెబుతున్నారంటే:

GNOME is a [free] Unix and Linux Desktop suite and development platform.
Gnome started life in August 1997, and was brought to life, as most things Linux, through lots of contributors via newsgroups.
గ్నోమ్ అనేది స్వేచ్ఛగా లభించే (ఉచితంగా??) యునిక్స్ మరియు లినక్స్ యొక్క తెర (స్క్రీన్/డెస్క్టాప్) ను చూపే వ్యవస్థ.
ఇందులో మనం రోజువారీ పనులకు వాడుకునే అన్ని ఉపకరణాలు ఉంటాయి.
1997 వ ఆంగ్ల సంవత్సరపు ఆగస్ట్ నెలలో గ్నోమ్ మొదలుపెట్టి లినక్స్ లోని ఇతర ప్రకల్పాల లాగానే కేవలం ఔత్సాహికుల స్వచ్ఛంద సహాయం ద్వారానే ముందుకు సాగుతోంది.

గ్నోమ్ కు ప్రత్యర్థి ఐన కెడిఈ కూడా ఇదే తరహాలో అభివృద్ధి చెందుతోంది. ఈ రెండు కలిసి ఒక నిర్దిష్ట వ్యవస్థను లినక్స్ లో తెచ్చాయి.
గ్నోమ్ ను గ్నోమ్ అనే పలకాలి గనోమ్ అనో లేక జీనోం అనో లేక నోమ్ అని పలకడం తప్పు.


1999 నాటి గ్నోమ్ మొదటి వెర్షన్ యొక్క తెరపట్టు
గ్నోమ్ లాభాలు :
  • ఇందులో మీకు విండో మేనేజర్ తో సహా అన్ని వాడుకరి ఉపకరణాలు కలవు
  • ఇది ఒక నిర్దిష్టమైన వ్యవస్థ
  • నాటిలస్ అనే ఫైల్ మేనేజర్ చాలా బాగా పని చేస్తోంది
  • గ్నోమ్ మన ఇష్టానుసారం మార్చుకోవచ్చు
  • కొన్ని వేల కొలది ఉపకరణాలు గ్నోమ్ కు అందుబాటులో కలవు
  • మంచి డాక్యుమెంటేషన్ మరియు తోడ్పాటు


                                                          గ్నోమ్ 2.6 తెరచాప


నేటి గ్నోమ్ 3.0 చాలా హంగులతో వచ్చే ఏప్రిల్ ఆరున విడుదలకాబోతోంది.


అది ఎలా ఉండబోతోందో ఒక నమూనా :