ప్రిసైజ్ పాంగోలిన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రిసైజ్ పాంగోలిన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2012, బుధవారం

ఉబుంటు 12.04 వేడుక విశేషాలు


కెనానికల్ నుండి వచ్చిన రితేష్ తన సహచరుడితో రానే వచ్చారు. కానీ అప్పటికింకా ప్రొజెక్టర్ వేదిక నందు సిద్ధంగాలేదు. వేడుకకు వచ్చేవారిని స్వాగతం పలుకుటలో, వేదిక వివరాలు అందించుటలో తీరికలేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను. ఇంతలో ప్రణవ్ మరియు వీవెన్ ఒకరి తరువాత ఒకరు వచ్చారు. వారిని స్వాగతించి వేదిక వద్దకు తీసుకువెళ్ళాను. మునుపటి రోజు కరాచీ బేకరీ వద్ద ఆర్డరిచ్చిన కేకుతో పవిత్రన్ శాఖమూరి, వికీమీడియా ప్రతినిధి అయిన శ్రీకాంత్‌తో కలసి HIT చేరుకున్నారు. అక్కడ విశేషమేమిటంటే కేకు పై ఉన్న ప్యాంగోలిన్ బొమ్మని చూచిన ఇద్దరు యువతులు ఆసక్తితో దాని గురించి అడిగి తెలుసుకున్నారట అంతేకాకుండా కరాచీ బేకరీ వారు కేకు ఛాయాచిత్రాన్ని తీసుకున్న తరవాతే చేతికిచ్చారట, బహుశా వారి చిత్రశాలలో చేరుస్తారేమో. ఆ తరువాత పవిత్రన్, అతుల్ జా మరియు క్రిష్‌లకు దిశానిర్దేశం చేయగా వారే వచ్చారు, అప్పటికే గది నిండినది.

మునుపటి రోజున కలిసిన పవిత్రన్ మిత్రుడైన అనివార్ తీరకలేని ప్రణాళికలోనూ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషాన్నిచ్చింది అతడు మంచి మాటకారి. నేను నా ల్యాపుటాపుని ప్రోజక్టురుకి అనుసంధానించుటకు కొంతసేపు కుస్తీ పట్టాను కానీ ప్రయోజనం లేదు, ఆ పిమ్మట కష్యప్ గారు వారి ల్యాపుటాపుతో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇక పవిత్రన్ రంగ ప్రవేశం చేసి తన వెంటబెట్టుకొచ్చిన శ్రీకాంత్ గారి ల్యాపుటాపుని విజయంతంగా అనుసంధానించాడు. గ్రాఫిక్స్ డ్రైవర్ సమస్య ఉన్నప్పటికీ సమర్పణకు ఎటువంటి ఆటంకం కలుగులేదులేండి. 

ఇంతలో రితేష్ గారు తన గురించి పరిచయం చేసుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉబుంటు, లినక్స్ వంటివి ముందు కటువుగా ఉన్నట్టు అనిపిస్తుందని కానీ రాను రాను అవే అలవాటవుతాయని, అంతే తప్ప ఒక్క రోజులో నచ్చేవి, వచ్చేవి కాదని విండోస్ కూడా మొదట్లో అలానే అనిసిస్తుందని  పేర్కొన్నారు. అలా అంటే నాకు జులాయి సినిమాలోని డైలాగు గుర్తు వచ్చింది. "భయమేస్తుందని దెయ్యాల సినిమాలు చూడకుండా ఉంటామా (కావాలని పట్టుబట్టి మరీ చూస్తాము), ఉబుంటు కూడా అంతే అని అనుకున్నాను". ఉబుంటు కూడా విండోస్ వలె ఒక నిర్వాహక వ్యవస్థ అని ఉబుంటూని కూడా మీరు మీ నిర్వాహక వ్యవస్థగా స్వేచ్ఛగా వాడుకోవచ్చని తెలిపారు.
వారి ప్రసంగం ముగిసిన తరువాత సభికులు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. నా వరకూ నేను తడబడుతూ ఇటీవలే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ మద్ధతు ఉపసంహరించుకోవడం వలన ఫైర్‌ఫాక్స్ లోని ఫ్లాష్ మద్ధతు సరిగా ఉండదు కాబట్టి తదుపరి సంస్కరణలో ఏ విహారిణి ఏమి ఉంచబోతున్నారు అని అడగగా వారు దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఫైర్‌ఫాక్స్ కూడా పెప్పర్ ఎపిఐ చొప్పింతని విహారిణిలో చేర్చే విషయంపై పనిచేస్తుందని, అలాకాకుంటే క్రోమియమ్ విహారిణి వినియోగించబడుతుందని తెలిపారు. అలాగే ఉబుంటు యునిటీ గురించి అడగగా, యునిటీని వాడుకరులు ఆదరిస్తున్నారనీ, మంచి స్పందన వస్తుందని తెలిపారు. 
ఇక అసలు కార్యక్రమం అదేనండీ ఉబుంటు కేకు కోయాలని నిర్ణయించారు కానీ అంతకంటే ముందు అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆ పిమ్మట ఛాయాచిత్రాలు తీసే కార్యక్రమం ఆపై కేకు కోసే కార్యక్రమం ఇంతకూ కేకు ఎవరూ కోయాలి అని అంటుండగానే అతిపిన్న వయస్కుడైన ఉబుంటు వాడుకరి(14 సం)చే కేకు కోయించాలని ఏకగ్రీవంగా అరిచారు.
అంతకుముందే అతుల్ ఝా ఉబుంటు స్టిక్కర్లను బల్లపై ఉంచాడు. కేకుతో పాటుగా స్టిక్కర్లను కూడా వచ్చినవారందరూ పంచుకున్నారు.


ఆ తరువాత నేను తెలుగు డెస్కుటాపు గురించి మాట్లాడటం జరిగింది. అందులో ఉబుంటు ప్రత్యేకతలు, తెలుగుపదం, లాంచ్పాడ్ మరియు గణాంకాలు, లక్షాల గురించి నాకు తోచిన భాషలో ప్రస్తావించాను. పవిత్రన్, అనివార్ మరియు కష్యప్ మధ్యలో కల్పించుకుని కాస్త ఆసక్తికరంగా మలిచారు.


మొజిల్లా కౌన్సిల్ మెంబర్ అయిన వినీల్ రెడ్డి ఫైర్‌ఫాక్స్ 13 లోని ప్రత్యేకతలను వివరించారు. అందులో వెబ్‌సైట్ ట్రాకింగ్ ముఖ్యమైనది. వెబ్‌సైటులు మిమ్మల్ని ట్రాక్ చెయ్యడం ఇష్టం లేకపోతే ఈ ఐచ్ఛికం ద్వారా నిరోధించవచ్చు. అలాగే వివిధ మొజిల్లా పరియోజనలను గురించి తెలిపారు.


ఓపెన్‌స్టాక్‌పై మాట్లడుకై ప్రత్యేకించి బెంగుళూరు నుండి విచ్చేసిన అతుల్ ఝా, ఒపెన్‌స్టాక్ ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్టువేరని, అది యాజమాన్య క్లౌడ్ కంప్యూటింగు సాఫ్టువేర్లకు ప్రత్యామ్నామయమని తెలిపారు. ఓపెన్‌స్టాక్ ప్రత్యేకతలను, పనితీరును చక్కనైన పటాలతో వివరించారు. ఒపెన్‌స్టాక్‌కు ప్రజాదరణ క్రమక్రమంగా పెరుగుతుందని కూడా తెలిపారు.
క్రిష్ పప్పెట్ గురించి బోర్డుపై పప్పెట్ సెర్వర్స్ మరియు క్లయింట్లను గీస్తూ వివరించారు. పప్పెట్‌పై మంచి మార్కెట్ ఉన్నదనీ, ఆకర్షనీయమైన జీతాలభ్యాలు ఉన్నాయనీ పేర్కొన్నారు. ఈ కోర్సు విదేశాల్లో చాలా ఖరీదయిందనీ, ప్రస్తుతం ఇండియాలో ఈ కోర్సుని పరిమిత సభ్యులకే అతి తక్కువ ధరకే అందిస్తున్నట్లు చెప్పారు. అతికష్టం మీద అందరిని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని ఆసియాలో జరుపబోతున్నట్లు తెలిపారు. 
చివరిగా వికీమీడియా ప్రతినిధి అయిన శ్రీకాంత్ మాట్లాడారు. ఇంతలో అనివార్ బస్సుకు వేళవడంతో నేను లక్డీకపూల్ వద్ద దించి తిరిగి వేదిక స్థలానికి చేరుకున్నాను. ఇంతలో అంతా అయిపోయింది ఎందుకంటే అసలు మజా అప్పుడే ఉంటుంది అంతా అయిపోయినపుడు జరిగే చర్చలు చాలా బాగుంటుంది, కాని నేను ఆ ఆనందాన్ని మిస్సయ్యాను. అందరూ వెళ్లిపోతున్నారు. నా బ్యాగు సర్దుకుని ఇక నేను బయటకు చేరుకున్నాను.
బయటకు వచ్చిన తరువాత పవిత్రన్ శ్రీకాంత్ ఒక బైకుపై, రితేష్‌ తన బైకుపై ముందుగా బయలుదేరారు. నేను విపుల్, అతుల్ ఝా ముగ్గురమూ కలసి క్రిష్ కారులో మెల్లగా ప్యారడైజ్ వెళ్లి ఫుడ్ తీసుకుని నేరుగా మిలటరీ జోన్‌లోని రితేష్ గారి కుటుంబీకుల ఇంటికి వెళ్లాము. అపుడు ఇంటిలో ఎవరూలేరనుకోండి. అక్కడ మరలా డిస్కషన్ షురూ చేసినాము. మధ్యలో రహ్మాన్ గారు ఫోను చేసి అందరితోనూ స్పీకరులో మాట్లాడారు. తరువాత రాత్రికి మేము ముగ్గురము అక్కడే బస చేసి తరువాత రోజు ఇంటికి చేరుకున్నాము.

కొసమెరుపేంటంటే ప్రణవ్ అయినవోలు ఒక్కరే ఉబుంటు 12.04 సీడీని పొందగలిగారు :p

23, మే 2012, బుధవారం

ఉబుంటు 12.04 స్థాపించిన తర్వాత చేయాల్సిన పనులు

ఉబుంటు స్థాపించిన తరువాత వ్యవస్థనంతటినీ మనకు కావలసిన విధంగా మలుచుకోవాల్సివుంటుంది. ఇందుకు కొన్ని కొత్త అనువర్తనాలను, ప్యాకేజీలను స్థాపించాలి. ఉబుంటు 12.04 స్థాపించిన తరువాత వ్యవస్థలో ఉన్న నవీకరణ నిర్వాహకం (అప్డేట్ మ్యానేజర్) ద్వారా నవీకరణలు ఏమైనా అందుబాటులో ఉన్నాయేమో పరిశీలించి వాటిని స్థాపించిన తరువాత క్రింది పేర్కొన్న ప్యాకేజీలను, అనువర్తనాలను స్థాపించడం మంచిది.



కోడెక్‌లను మరియు ఇతరాలను స్థాపించండి

ఉబుంటులో పాటలు వినటానికి లేక చలనచిత్రాలు చూడాలంటే అందుకు కావలసిన కొడెక్‌లను మీరు స్థాపించాలి. న్యాయపరమైన కారణాల దృష్ట్యా ఉబుంటు ఈ కొడెక్‌లను అప్రమేయంగా అందించుటలేదు. MP3, DVD, Flash, Quicktime, WMA మరియు WMV,వంటి దస్త్రాలను ప్రదర్శించుటకు, అలాగే RAR దస్త్రాలను తెరుచుటకు, మైక్రోసాఫ్టు కోర్ ఫాంట్స్, ఫైర్‌ఫాక్స్ అడోబ్ ఫ్లాష్ చొప్పింత కొరకు క్రింద పేర్కొన్న ప్యాకేజీని స్థాపించాలి.
 
sudo apt-get install ubuntu-restricted-extras



జిడెబి మరియు సినాప్టిక్ మ్యానేజర్


.deb ప్యాకేజీలను స్థాపించుటకు అంతరవర్తితో కూడిన జిడెబి మరియు సినాప్టిక్ నిర్వాహకాలను స్థాపించండి.

sudo apt-get install gdebi


sudo apt-get install synaptic
 


 గూగుల్ క్రోమ్ విహారిణిని స్థాపించండి

అడోబ్ వారు లినక్సుకు ఫ్లాష్ ప్లేయర్ మద్దతును ఫ్లాష్ ప్లేయర్ ప్లగిన్ ద్వారా అందిస్తున్నారు. కాకపోతే ఈ ప్లగిన్‌కు ఇక ముందు ఎటువంటి మద్ధతును అందించమని పేర్కొన్నారు. గూగుల్ వారు క్రోమ్ విహారిణిలో అప్రమేయంగా పెప్పర్ ఎపిఐతో ఫ్లాష్ తోట్పాటును ఏర్పాటుచేసారు. అందువలన మీరు ఎటువంటి లోపాలను లేని స్థిరమైన ఫ్లాష్ మద్ధతు కావాలంటే గూగుల్ క్రోమ్ ఎంచుకోవాల్సివుంటుంది.

http://google.com/chrome


  ఫ్లాష్ చొప్పింతను స్థాపించండి

మీరు ఫైర్‌ఫాక్స్ అభిమానా...విహారిణిని మార్చకూడదనుకుంటున్నారా. సమస్య ఏమీ లేదు ఎందుకంటే అడోబ్ ఇదివరకు విడుదల చేసిన ఫ్లాష్ చొప్పింత ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రంలో అందుబాటులో ఉండనే ఉంది. మీరు ఫైర్‌ఫాక్స్ లోనే ఫ్లాష్ మద్ధతు కావాలనుకుంటే క్రింద పేర్కొన్న చొప్పింతను స్థాపించుకోండి.


sudo apt-get install flashplugin-installer


యునిటీ ప్రత్యామ్నాయాలు


ఉబుంటు 12.04 ప్రిసైజ్ ప్యాంగోలిన్‌లో యునిటీ అంతరవర్తి అప్రమేయంగా ఉంటుంది. ఒకవేళ మీకు యునిటీ నచ్చకపోయినట్లయితే, గ్నోమ్ క్లాసిక్ లేదా గ్నోమ్ షెల్ వాడవచ్చును.


క్లాసిక్ గ్నోమ్ సెషన్

sudo apt-get install gnome-session-fallback

గ్నోమ్ షెల్

sudo apt-get install gnome-shell

ఐబస్
తెలుగులో టంకించుటకు ఆపిల్, ఇన్‌స్క్రిప్ట్, ఆర్టియస్, పోతన మరియు ఐట్రాన్స్ వంటి వివిధ రకాల కీబోర్డు నమూనా(అమరిక)లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఐబస్ తో పాటుగా ibus-m17n ప్యాకేజీని స్థాపించాల్సివుంటుంది. ఒకవేళ మీరు ఇన్‌స్క్రిప్ట్ వినియోగించువారయితే ఐబస్ సహాయం లేకుండానే వ్యవస్థలో ఉన్న కీబోర్డు అమరికల ద్వారా ఇన్‌స్క్రిప్ట్ అమర్చుకోవచ్చును.

sudo apt-get install ibus ibus-m17n

గ్నోమ్ ట్వీక్ టూల్

గ్నోమ్ అంతరవర్తిని మీకు కావలసిన విధంగా అనురూపించుటకు గ్నోమ్ ట్వీక్ టూల్ సహకరిస్తుంది.  
 

sudo apt-get install gnome-tweak-tool

వీయల్సీ మాధ్యమ ప్రదర్శకం
 


వియల్సీ సరికొత్త రూపాంతరమయిన టూఫ్లవర్‌ను స్థాపించండి. వియల్సీ ద్వారా ఎటువంటి మాధ్యమ దస్త్రాలనైనా ప్రదర్శించవచ్చు. కాబట్టి లినక్సులో వియల్సీ మాధ్యమ ప్రదర్శకం ప్రామాణికమైన మాధ్యమ ప్రదర్శకంగా పేర్కొనవచ్చును.

sudo apt-get install vlc 



అదనపు (ffmpeg, x264) మాధ్యమ ప్యాకేజీలను స్థాపించండి క్రింద పేర్కొన్న ప్యాకేజీలను దింపుకుని జిడెబి లేదా టెర్మినల్ ద్వారా స్థాపించండి.
ffmpeg
http://db.tt/Gtmz7pO0

x264
http://db.tt/bcAA2cZp
libvpx
http://db.tt/myGXyfX3
qt-fast start
http://db.tt/fWWqJh04

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఉబుంటు 12.04 విడుదలైంది


ఉబుంటు సరికొత్త విడుదల ఉబుంటు 12.04 విడుదలైంది. ఈ విడుదలలోని విశేషాలేమిటో చూద్దాం. ఈ విడుదల యొక్క సంకేత నామం ప్రిసైజ్ ప్యాంగోలిన్. ఈ విడుదలకు 04/2017 వరకూ మద్ధతుంది. LTS అంటే లాంగ్ టెర్మ్ సపోర్ట్(దీర్ఘకాలిక మద్ధతు).




మార్పులు - చేర్పులు
ఈ రూపాంతరంలో ఇటీవలే విడుదలైన గ్నోమ్ 3.4 అనువర్తనాలను వినియోగించారు. కానీ అప్రమేయ అంతరవర్తిగా మాత్రం యునిటీనే కొనసాగించారు.
యునిటీ అంతరవర్తి
ఉబుంటు జట్టు అభివృద్ధి చేసిన అంతరవర్తి యునిటీ, దీనిని మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ మరియు ఉబుంటు వన్ వంటి వాటికి యునిటీ సమన్వయాన్ని మెరుగుపరిచారు. 
అనువర్తనాలు
లినక్స్ కెర్నల్ 3.2.0-23.36, యునిటీ 5.10, నాటిలస్ 3.4.1, జియెడిట్ 3.4.1, గ్విబర్ 3.4, రిథమ్ బాక్స్ 2.96, ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ 5.2, సరికొత్త లిబ్రే ఆఫీస్ 3.5.2 మరియు మొజిల్లా ఫైర్ ఫాక్స్ 11.0 రూపాంతరాలు, థండరుబర్డ్ ఈమెయిల్ కక్షిదారు 11.1, ఎంపతి సత్వర సందేశకం 3.4.1, టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం 3.0.1, షాట్వెల్ 0.12, ట్రాన్స్మిషన్ 2.51
బన్షీకి బదులుగా రిథమ్ బాక్సును తిరిగి అప్రమేయ సంగీత ప్రదర్శకముగా తీసుకున్నారు. బన్షీతో పాటుగా  టోంబాయ్ మరియు జీబ్రెయినీ అనువర్తనాలను తీసివేసారు.
గ్నోమ్ నియంత్రణ కేంద్రంలో జిట్ గీస్ట్ కార్యకలాపాల చిట్టా నిర్వాహకం ద్వారా గోప్యత (ప్రైవసీ) ఐచ్ఛికాన్ని చేర్చారు. దీనిని ఉపయోగించి ఇటీవలి వాడిన దస్త్రాలు, సంచయాలు, అనువర్తనాల చరిత్రను చెరిపివేయవచ్చు.
ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రం
సరికొత్త రూపంతో, మరిన్ని హంగులతో ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రాన్ని బాగా తీర్చిదిద్దారు. అంతే కాకుండా అనువర్తనాల సమీక్షా విధానం ఉండటం వలన సమీక్షలను చదివి అనువర్తనాలను స్థాపించుకోవచ్చు, మీ అభిప్రాయాలను కూడా జోడించవచ్చు. కొనుగోలు చేయుటకు అనేక ఆటలు, మ్యాగజైనులు...అందుబాటులో ఉంచారు, పేపాల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పుస్తకాలు మరియు మ్యాగజైన్స్ అనే కొత్త వర్గం చేర్చబడింది. బహుళ తెరపట్టులు, సిఫారసుల వ్యవస్థ, భాషా ప్యాక్ల మద్ధతు చెప్పుకోదగినవి.
ఉబుంటు తెలుగు లినక్స్ స్థితి:
ఉబుంటు అనువాదం దాదాపు 71 శాతం పూర్తయివుంది, స్థాపక ప్రక్రియ నుండే తెలుగు అందుబాటులో ఉన్నది. అందువల్ల దాదాపు ఉబుంటు నిర్వాహక వ్యవస్థ అంతా తెలుగులో అందుబాటులో ఉంది. అంతేకాక కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నవారు ప్రయత్నించి చూడవచ్చు ఒకవేళ నచ్చకపోతే ఆంగ్ల భాషలోకి మారిపోవడం కూడా ఎంతో సులభం. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు.
ఉబుంటు తెలుగు లినక్స్ గణాంకాలు


ఉబుంటు 12.04 కు ఉన్నతీకరణ(అప్ గ్రేడ్) ద్వారా మారండి
ఒకవేళ మీరు ఉబుంటు పాత విడుదలని వాడుతున్నట్లయితే, క్రిందపేర్కొన్న ఆదేశాల ద్వారా మీ వ్యవస్థను కొత్త విడుదలకు ఉన్నతీకరించవచ్చును.
ముందుగా మీరు వాడుతున్న ప్యాకేజీలన్నీ తాజాగా ఉండేట్టు చూసుకోండి లేకపోతే
sudo apt-get update

sudo apt-get dist-upgrade

ఆ తరువాత క్రింది ఆదేశాన్ని నడపండి
sudo update-manager -d


ఉబుంటు 12.04 ను దింపుకోండి...
ఒకవేళ మీరు ఉబుంటూకి కొత్త అయితే, ఉబుంటు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక లుక్కేసుకోండి. స్థాపన సహాయం కోసం ఈ లంకెను సందర్శించవచ్చు.




ప్రత్యామ్నాయ దింపుకోలు లంకెలు | దింపుకోలు మిర్రర్లు.


వీటిని కూడా చూడండి:
హైదరాబాదులో ఉబుంటు విడుదల వేడుక చేసుకుందామా..?
మీ అభిప్రాయం తెలపండి