తెలుగు లినక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు లినక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఉబుంటు 12.04 విడుదలైంది


ఉబుంటు సరికొత్త విడుదల ఉబుంటు 12.04 విడుదలైంది. ఈ విడుదలలోని విశేషాలేమిటో చూద్దాం. ఈ విడుదల యొక్క సంకేత నామం ప్రిసైజ్ ప్యాంగోలిన్. ఈ విడుదలకు 04/2017 వరకూ మద్ధతుంది. LTS అంటే లాంగ్ టెర్మ్ సపోర్ట్(దీర్ఘకాలిక మద్ధతు).




మార్పులు - చేర్పులు
ఈ రూపాంతరంలో ఇటీవలే విడుదలైన గ్నోమ్ 3.4 అనువర్తనాలను వినియోగించారు. కానీ అప్రమేయ అంతరవర్తిగా మాత్రం యునిటీనే కొనసాగించారు.
యునిటీ అంతరవర్తి
ఉబుంటు జట్టు అభివృద్ధి చేసిన అంతరవర్తి యునిటీ, దీనిని మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ మరియు ఉబుంటు వన్ వంటి వాటికి యునిటీ సమన్వయాన్ని మెరుగుపరిచారు. 
అనువర్తనాలు
లినక్స్ కెర్నల్ 3.2.0-23.36, యునిటీ 5.10, నాటిలస్ 3.4.1, జియెడిట్ 3.4.1, గ్విబర్ 3.4, రిథమ్ బాక్స్ 2.96, ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ 5.2, సరికొత్త లిబ్రే ఆఫీస్ 3.5.2 మరియు మొజిల్లా ఫైర్ ఫాక్స్ 11.0 రూపాంతరాలు, థండరుబర్డ్ ఈమెయిల్ కక్షిదారు 11.1, ఎంపతి సత్వర సందేశకం 3.4.1, టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం 3.0.1, షాట్వెల్ 0.12, ట్రాన్స్మిషన్ 2.51
బన్షీకి బదులుగా రిథమ్ బాక్సును తిరిగి అప్రమేయ సంగీత ప్రదర్శకముగా తీసుకున్నారు. బన్షీతో పాటుగా  టోంబాయ్ మరియు జీబ్రెయినీ అనువర్తనాలను తీసివేసారు.
గ్నోమ్ నియంత్రణ కేంద్రంలో జిట్ గీస్ట్ కార్యకలాపాల చిట్టా నిర్వాహకం ద్వారా గోప్యత (ప్రైవసీ) ఐచ్ఛికాన్ని చేర్చారు. దీనిని ఉపయోగించి ఇటీవలి వాడిన దస్త్రాలు, సంచయాలు, అనువర్తనాల చరిత్రను చెరిపివేయవచ్చు.
ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రం
సరికొత్త రూపంతో, మరిన్ని హంగులతో ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రాన్ని బాగా తీర్చిదిద్దారు. అంతే కాకుండా అనువర్తనాల సమీక్షా విధానం ఉండటం వలన సమీక్షలను చదివి అనువర్తనాలను స్థాపించుకోవచ్చు, మీ అభిప్రాయాలను కూడా జోడించవచ్చు. కొనుగోలు చేయుటకు అనేక ఆటలు, మ్యాగజైనులు...అందుబాటులో ఉంచారు, పేపాల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పుస్తకాలు మరియు మ్యాగజైన్స్ అనే కొత్త వర్గం చేర్చబడింది. బహుళ తెరపట్టులు, సిఫారసుల వ్యవస్థ, భాషా ప్యాక్ల మద్ధతు చెప్పుకోదగినవి.
ఉబుంటు తెలుగు లినక్స్ స్థితి:
ఉబుంటు అనువాదం దాదాపు 71 శాతం పూర్తయివుంది, స్థాపక ప్రక్రియ నుండే తెలుగు అందుబాటులో ఉన్నది. అందువల్ల దాదాపు ఉబుంటు నిర్వాహక వ్యవస్థ అంతా తెలుగులో అందుబాటులో ఉంది. అంతేకాక కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నవారు ప్రయత్నించి చూడవచ్చు ఒకవేళ నచ్చకపోతే ఆంగ్ల భాషలోకి మారిపోవడం కూడా ఎంతో సులభం. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు.
ఉబుంటు తెలుగు లినక్స్ గణాంకాలు


ఉబుంటు 12.04 కు ఉన్నతీకరణ(అప్ గ్రేడ్) ద్వారా మారండి
ఒకవేళ మీరు ఉబుంటు పాత విడుదలని వాడుతున్నట్లయితే, క్రిందపేర్కొన్న ఆదేశాల ద్వారా మీ వ్యవస్థను కొత్త విడుదలకు ఉన్నతీకరించవచ్చును.
ముందుగా మీరు వాడుతున్న ప్యాకేజీలన్నీ తాజాగా ఉండేట్టు చూసుకోండి లేకపోతే
sudo apt-get update

sudo apt-get dist-upgrade

ఆ తరువాత క్రింది ఆదేశాన్ని నడపండి
sudo update-manager -d


ఉబుంటు 12.04 ను దింపుకోండి...
ఒకవేళ మీరు ఉబుంటూకి కొత్త అయితే, ఉబుంటు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక లుక్కేసుకోండి. స్థాపన సహాయం కోసం ఈ లంకెను సందర్శించవచ్చు.




ప్రత్యామ్నాయ దింపుకోలు లంకెలు | దింపుకోలు మిర్రర్లు.


వీటిని కూడా చూడండి:
హైదరాబాదులో ఉబుంటు విడుదల వేడుక చేసుకుందామా..?
మీ అభిప్రాయం తెలపండి

31, జనవరి 2012, మంగళవారం

తెలుగు లినక్స్ బ్లాగుకు తిరిగి స్వాగతం...

కొన్ని కారణాల దృష్ట్యా గత కొద్ది కాలముగా ఎటువంటి టపాలను చేయలేకపోయాను. తెలుగు లినక్స్ స్థానీకరణ, వివిధ స్వేచ్ఛాయుత సాఫ్టువేర్ స్థానికీకరణపై పూర్తి శ్రద్ధ పెట్టడం వలన గత కొద్ది నెలలుగా బ్లాగును నవీకరించడం కుదరలేదు. ఉన్నటువంటి అనువాదాలన్నిటినీ సమీక్షించి సామాన్య వాడుకరికి అర్ధమయ్యే రీతిలో ఉండాలని భావించి ఈ కార్యానికి పూనుకోవడం జరిగింది. నా మాతృ భాషకు నేను ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పమే నన్ను ఆ దిశగా నడిపించింది. నేను అనుకున్న లక్ష్యాలు దాదాపు చేరుకున్నాను వాటిలో ముఖ్యమైనవి వియల్సీ మాధ్యమ ప్రదర్శకం (VLC మీడియా ప్లేయర్), జిపార్టెడ్, షాట్వెల్, బన్షీ, ఉబుంటు అంతర్భాగ అనువర్తనాలు, లినక్స్ మింట్, గింప్, గ్నోమ్ అనువర్తనాల అనువాదం మరియు సమీక్ష, వెబ్సైటు తెలుగీకరణ, ఫెడోరా వెబ్సైటు తెలుగీకరణ, Xfce, LXDE అంతరవర్తుల అనువాదం...ఇంకా చాలా చేసాననుకోండి (చెబితే అదో పెద్ద జాబితా అవుతుంది :-)). చిన్న పిల్లల కోసం ఏదైనా ఒక లినక్స్ పంపిణీను తెలుగులోకి తీసుకురావాలనుకున్నాను. అందుకని డ్యుడ్యులినక్స్ అనే పరియోజనలో భాగస్వామినై అనువదించాను. ఇది దాదాపు 43 శాతం పూర్తయినది. కాకపోతే అంతర్జాలంలో అనువదించడం వలన కొన్ని అక్షరాలు ఎగిరిపోయినవి. అందువలన దీనిని ఇప్పటివరకూ ఎవరికీ సిఫారసు చేయలేకపోయాను. ఈ అనువాద దోషాలన్నీ ఇప్పటికే సరిచేసాను ఇక కొత్త రూపాంతరం వెలువడం ఒక్కటే ఆలస్యం. 
ఇకనుండి సరికొత్త లినక్స్ సాంకేతికాలను, మెలుకువలను, చిట్కాలను మరియు జిమ్మిక్కులను  వివిధ రూపాలలో అందించే ప్రయత్నం చేస్తాను.
మీరు తెలుగులినక్సును ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో కూడా అనుసరించవచ్చు.
ఎప్పటివలె మీ సలహాలను, సూచనలను తెలుగులినక్సుకు అందిస్తారని ఆశిస్తున్నాను.
నిర్వాహకుడు,
Praveen Illa.

2, మే 2011, సోమవారం

ఉబుంటు 11.04 విడుదల మరియు సమీక్ష

ప్రత్యేకాంశాలు
  •  స్థాపన ప్రక్రియ నుండే దాదాపు అన్నీ తెలుగు భాషలో అందుబాటు.
  • యునిటీ అంతరవర్తి
ఉబుంటు సరికొత్త డెస్కుటాప్ అంతరవర్తి "యునిటీ"
ఉబుంటు 11.04లో యునిటీ అంతరవర్తి అప్రమేయంగా ఉంటుంది. ఇంతకు ముందు గ్నోమ్ అంతరవర్తి ఉండేది, గ్నోమ్ కొత్త రూపాంతరం గ్నోమ్ 3 విడుదల సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం మరియు కొన్ని ఇతర కారణాల వలన "యునిటీ"ని అభివృద్ధిచేసారు.యునిటీని ఇంతకుముందు వర్షన్ ఉబుంటు 10.10 మేవరిక్ మీర్కట్ లోనే ప్రవేశపెట్టినా అది ప్రయోగాత్మకంగా వుంది, కానీ ఈ రూపాంతరంలో యునిటీని పూర్తిస్థాయిలో చేర్చడం జరిగింది. యునిటీని అనుభవజ్ఙులచే రూపొందించబడింది, ఇది వాడుకరులకు మరింత సౌకర్యవంతంగా ఉండేటట్లు తయారుచేయబడింది.నిజానికి ఇది చాలా వైవిధ్యముగా ఉంటుంది, దీనిని చెత్తగా వుందని అర్ధంచేసుకోకూడదు.ఇది ఇంచుమించు గ్నోమ్ 3 లాగానే ఉంటుంది కానీ ఇది ప్రత్యేకమైనది. బహుశా కొత్త వాడుకరులు అలవాటు పడేవరకూ ఇది అంతగా నచ్చకపోవచ్చు.దీనికి ప్రత్యామ్నాయం కూడా ఒకటి ఉంది అదే ఉబుంటు క్లాసిక్ అంతరవర్తి(interface) దీనిని వాడుకరి కంప్యూటరు నందు ప్రవేశించేటపుడు ఎంపికచేసుకోవలసివుంటుంది, ఇది గ్నోమ్ అంతరవర్తి వలె మెనూలను కలిగివుంటుంది. కొన్ని పాత లేదా గ్రాఫిక్స్ సహకారం సరిగాలేని కంప్యూటర్ నందు యునిటీ లోడవ్వకపోయే అవకాశం ఉంది ఇటువంటి సందర్భంలో ఉబుంటు క్లాసిక్ అంతరవర్తి వాడబడుతుంది. గ్నోమ్ ఇష్టపడేవారు సరికొత్త గ్నోమ్ 3 రూపాంతరాన్ని వ్యక్తిగత ప్యాకేజీ సంగ్రహము(Personal Package Archieve-PPA) నుండి స్థాపించుకొనవచ్చును కాకపోతే ఇలా చేయడం వలన యునిటీని శాశ్వతంగా కోల్పోతారు. 



సరికొత్త మార్పులు-చేర్పులు
ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రములో సమీక్షా విధానాన్ని చేర్చారు.దీని వలన మీరు స్థాపించదలచుకున్న సాఫ్ట్వేర్ యొక్క రేటింగును మరియు సమీక్షలను చదివి స్థాపించుకోవచ్చు. .mp3 ఫైళ్ళను ఇదివరకూ ప్లేచేయాలంటే సాధారణంగా ఉచితంగా లభించని, ఆంక్షలువున్న కొడెక్ లను వాడేవారు కాని ఇపుడు ఈ అవసరం లేదు ఎందుకంటే ఫ్లుయెండో mp3 ప్లగిన్‌ను థర్డ్-పార్టీ సాఫ్ట్వేర్ ద్వారా ఉచితంగానే లభిస్తుంది.అంతేకాకుండా కుచించబడిన .rar ఫైళ్ళకు కూడా సహకారం అప్రమేయంగా చేర్చబడింది.మొజిల్లా వారి సరికొత్త రూపాంతరమయిన ఫైర్‌ఫాక్స్ 4 కూడా చేర్చబడింది.స్క్రోల్ బార్ నందు కూడా మార్పును గమనించవచ్చు.




ఆప్ మెను
అనువర్తనాల మెనూలు ఇదివరకూ ఏ అనువర్తనానికి దానికదే ప్రత్యేక విండోను కలిగి మెనూలన్నీ అదే విండోలో వుండేవి కాని ప్రస్తుతం అన్ని అనువర్తనాలకు ఒకటే మెను దానినే సార్వత్రిక మెను(గ్లోబల్ మెను) ఉంటుంది.

సాఫ్ట్ వేర్ మార్పులు-చేర్పులు
లిబ్రే ఆఫీసు
ఓపెన్ ఆఫీసుకు బదులుగా లిబ్రే ఆఫీసును చేర్చడం జరిగింది. దీనివెనుక అసలు కారణం సన్ నెట్వర్కును ఒరాకిల్ సంస్థ కనుగోలు చేయడం వలన ఓపెన్ ఆఫీసే లిబ్రే ఆఫీసుగా రూపాంతరం చెందింది.అర్జునరావుగారు సరైన సమయానికి దీనిని గమనించి ఉన్న అనువాదాలను సమీక్షించి ఈ ప్రోజెక్టును పూర్తిచేసారు.
షాట్‌వెల్
ఇదివరకూ ఫొటోలను చూడాలన్నా వాటిని నిర్వహించాలన్నా f-స్పాట్ ఫొటో నిర్వాహకాన్ని వాడేవారు ప్రస్తుతం అన్ని ప్రోజెక్టుల నందు దీనికి బదులుగా షాట్‌వెల్ ఫొటో నిర్వాహకాన్ని చేర్చారు.ఇది చాలా సౌకర్యవంతంగా, సులభంగా ఉన్నది.
బన్‌షీ
సంగీత సాధనమైన రిథమ్ బాక్సుకు బదులుగా బన్‌షీ సంగీత ప్లేయరును చేర్చడం జరిగింది. ఇందులో కేవలం సంగీతమే కాకుండా వీడియోలను చూడవచ్చు, అంతర్జాల రేడియో వినవచ్చు మరియు అంతర్జాలములో సంగీతమును శోధించవచ్చు.అమెజాన్ mp3,7 డిజిటల్ సంగీత దుఖానాల సహకారాన్ని చేర్చారు.బన్‌షీ చూడటానికి కూడా ఎంతో ఆసక్తికరంగా, మెనూ ఇంటిగ్రేషనుతో అందముగా కనపడుతుంది.బన్‌షీ అనువాదము పాక్షికముగా అయినప్పటికీ పూర్తయింతవరకూ సంతృప్తికరంగానేవుంది.

ఉబుంటు shipit free కార్యక్రమమును ఆపి వేసారు కనుక ఇకనుంచి ఉబుంటు సిడిలను ఉచితంగా పొందటం అంత సులభం కాదు.గత కొన్ని సంవత్సరములుగా వారు నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉబుంటు గురించి తెలిసిన వారందరూ ఉచిత సిడిలను పొందివున్నారు. కెనానికల్ సంస్థ దాదాపు వారనుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు ప్రకటించారు.అయినప్పటికీ ఈ కార్యక్రమమును తమ స్థానిక జట్ల ద్వారా కొనసాగిస్తామన్నారు.ఇది ఎంతవరకూ సఫలమవుతుందో వేచి చూడాలి.
ఉబుంటుని నేరుగా ఇక్కడి నుండి దిగుమతి చేసుకోండి.
 
ఇతర పద్ధతులలో దిగుమతి చేసుకోవడానికి ఈ పేజీని సందర్శించండి.
తెలుగులినక్స్ బ్లాగు బ్లాగర్ నుండి త్వరలోనే వర్డ్ ప్రెస్ కు విస్తరించబడనుంది గమనించగలరు.
మీ అభిప్రాయాలను, సూచనలను వ్యాఖ్యల రూపంలో నిర్మొహమాటంగా జోడించగలరు.

2, ఏప్రిల్ 2011, శనివారం

ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ రాబోతుంది...

లినక్స్ గురించి పెద్దగా పరిచయం లేనివారు కూడా ఉబుంటు గురించి కాస్తో కూస్తో తెలుసుకుంటున్నారు.దీనికి ముఖ్య కారణాలు ఉబుంటు ఉచితం, ఆకర్షణీయమైన డెస్కుటాప్ పరిసరం మరియు ఆన్ లైన్ లో లభించే మద్ధతు కూడా ఎక్కువే.అంతేకాకుండా ఈ పంపకాన్ని నిర్వహిస్తున్న కెనానికల్ సంస్థ అందరికీ అందుబాటుల్  ఉండేలా ఉబుంటు CDలను ఉచితంగా పంపిణీచేస్తుంది. అందువలన చాలామంది ఈ ఉచిత CDని పొందుటకు ఆశక్తి చూపుతున్నారు. ప్రపంచంలో చాలా మంది ఈ విధంగా ఉచిత CDలను పొందుతున్నారు, మన రాష్ట్రంలో కూడా. కాని ఇలా పొందిన వారిలో ఎంతమంది దానిని సరిగా ఉపయోగిస్తున్నారనేది ఆలోచించవలసిన విషయం.దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకి అంతర్జాల అనుసంధానం ఎలా ఏర్పరుచుకోవాలో తెలియకపోవడం, ఏమేమి అనువర్తనాలు ఉన్నాయో వాటిని ఎలా వాడుకోవాలో...ఇలా అనేకం ఉండవచ్చు.


ఇక విషయానికి వస్తే ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఇప్పటికే బీటా 1 వెర్షన్ విడుదలయింది, బీటా 2 ఏప్రిల్ 14న విడుదల అవుతుంది.బీటా 2 కల్లా ఉన్న అన్ని లోపాలను, దోషాలను సరిదిద్ది ఆఖరి విడుదల చేస్తారు.

ఉబుంటు 11.04 ఎలా ఉండబోతోందో ఇక్కడ ఒకసారిచూడండి...వీడియోబంధించేటపుడుకొన్నిప్రభావాలు సరిగాబంధించలేకపోయింది దానిని రికార్డర్ తప్పిదముగా గుర్తించగలరు.





తెలుగు స్థానికీకరణ విషయానికి వస్తే నేను కొంత భాధ్యత తీసుకుని ఉన్న లోపాలను, తప్పులను సరిదిద్దాను అంతేకాకుండా ఈ సారి తెలుగువారు ఒక అడుగు ముందుకేసి తెలుగులో వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కాస్త సరళీకరించాను.కొన్ని కొత్త అనువర్తనాలను మరియు అప్రమేయంగా వచ్చే అనువర్తనాలను స్థానికీకరించాను. వాడుకరి అంతరవర్తి (user interface) దాదాపు తెలుగులోనే ఉండబోతుంది. నిన్న విడుదలయిన బీటా వెర్షన్ లో మొన్నటివరకూ చేసిన అనువాదాలు ఇంకా పూర్తిగా చేర్చబడలేదు. చివరి విడుదలకల్లా ఇవి చేర్చబడతాయి.


గమనిక: తెలుగు లినక్స్ లేదా అనువర్తనాలను తెలుగులో వాడటం అనేటప్పటికీ చాలా మంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. లినక్స్ తెలుగులో వాడటమంటే కేవలం తెలుగు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇంగ్లీషు ఉండబోదని కొంతమంది అనుకుంటారు. నిజానికి ఎందులోనైనా అప్రమేయంగా ఇంగ్లీషు ఉంటుంది.దీనికి అదనంగా తెలుగు భాష కూడా అందుబాటులో ఉంటుంది. సిస్టం యొక్క వాడుకరి అంతరవర్తి (user interface) భాషను సిస్టం ప్రారంభించేటపుడే ఎంచుకోవలసి ఉంటుంది. మీ ప్రాధాన్యత బట్టి తెలుగులో కావలిస్తే తెలుగులో లేదా ఇంగ్లీషులో.


ఈసారి తెలుగు ఉబుంటు విడుదలలో చెప్పుకోదగ్గ విషయాలు


  • స్థాపన ప్రక్రియను తెలుగులోనే ప్రారంభించవచ్చు.
  • దాదాపు వాడుకరి అంతరవర్తి (user interface) అంతా తెలుగులోనే ఉండబోతుంది.


ఉబుంటు 11.04 లో మార్పులు-చేర్పులు


  1. ఉబుంటు 11.04 నాటీ నార్వాల్ లో సాధారణంగా ఎప్పుడూ ఉండే వాడుకరి అంతరవర్తి గ్నోమ్ కాకుండా ఉబుంటు వారు ప్రత్యేకంగా యునిటీ [unity] అనే దానిని రూపొందించి అభివృద్ధిచేసారు. ఇది దాదాపు కొత్తగా రాబోయే గ్నోమ్ 3(gnome 3)ను పోలి ఉంటుందనుకోండి.
  2. ఫ్లుయెండో MP3ప్లగిన్ ను ఉబుంటు ఉచితంగా అందిస్తున్నది.
  3. రిథమ్ బాక్స్ కు బదులుగా బన్‌షీ మీడియా ప్లేయర్ ను ఉండబోతుంది.
  4. F-spotకు బదులుగా షాట్‌వెల్ ఫొటో మానేజర్ ఉండబోతుంది.
  5. rar పైళ్ళకు మద్ధతు.
  6. సాఫ్ట్ వేర్ కేంద్రంలో కొత్తగా సమీక్ష చేసే అవకాశాన్ని కల్పించారు.ఈ సమీక్షల ఆధారంగా వాటి యొక్క రేటింగులను చూసి సాఫ్ట్ వేర్లను స్థాపించుకోవచ్చు.అంతేకాకుండా కొన్ని సాఫ్ట్ వేర్లను కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.(దాదాపు ఉబుంటూలో లభించే సాఫ్ట్ వేర్ అంతా ఉచితంగానే అందించబడుతుంది)
  7. సరికొత్త ఫైర్ ఫాక్స్ 4 వెర్షన్.
  8. ఓపెన్ ఆఫీసుకు బదులుగా లిబ్రే ఆఫీసు ఉండబోతుంది (సన్ నెట్వర్కుని ఒరాకిల్ సంస్థ కనుగోలు చేసి దీనిని లిబ్రే ఆఫీసుగా మార్చడం జరిగింది.)
ఉబుంటూనిప్రచారం చేయాలనుకుంటే ఈకౌంటర్లనిమీ బ్లాగులలోను మరియుసైట్లలోను ఉంచగలరు.వీటిని జతచేయాలంటే మీ బ్లాగు డిజైన్ కు వెళ్ళి add gadgets లో html/Javascript  ను నొక్కి ఈ కింది పాఠ్యమును ప్రవేశపెట్టన తరువాత Richtext మీద క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది.

<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner1.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>
లేదా


<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner2.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>

లేదా


<a href="http://www.ubuntu.com/"><img src="http://www.ubuntu.com/countdown/banner3.png" border="0" width="180" height="150" alt="The next version of Ubuntu is coming soon"></a>
లేదా

<a href="http://www.ubuntu.com/testing/natty/beta"><img title="Ubuntu 11.04 days to go" src="http://picomol.de/counter/i_t.png" alt="Ubuntu 11.04 days to go" /></a>


స్థానికీకరణలోనూ మరియు ఇతర అంశాలలోనూ సహాయం, సహకారం అందించిన అర్జున రావు, కృష్ణబాబు, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం, రవిచంద్ర, సునీల్ మోహన్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

నెనరులు,
Praveen Illa.

14, ఫిబ్రవరి 2011, సోమవారం

లినక్స్ ఎందుకు?

ఈ టపా ఇంతక ముందు రాసిన లినక్స్ అంటే ఏమిటి?  అన్న టపా కు తరువాయి భాగం.
లినక్స్ అవగాహనలో ఇది రెండవ మజిలీ.
మీకిప్పుడు లినక్స్ అంటే ఏమిటో తెలిసింది. 
కానీ అది మీరు విండోస్ లేక మ్యాక్ ను వదిలి లినక్స్ వాడుకర్లు కావటానికి దోహదం చేయదు.
లినక్స్ యునిక్స్ కన్నా ఎన్నోరెట్లు ప్రత్యేకమైనది. అదెలా?
ఇందుకు గల ముఖ్య కారణం లినక్స్ కు ఉన్న లైసెంస్ -- "ఓపెన్ సోర్స్"

లినక్స్ ఒక సంపూర్ణ ఓపెన్ సోర్స్ నిర్వహణా వ్యవస్థ, అదెలా?
ఇలా:
  1. లినక్స్ వాడే గ్నూ జెనరల్ పబ్లిక్ లైసెన్స్ ప్రకారం, మీరు లినక్స్ ను ఉచితంగా పొందవచ్చు, దాని మూలపదాల్ని కూడా పొంది, మార్పులు చేసి మరలా అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. మరియు ఇలా తిరిగి పంచేప్పుడు కావాలంటే ఒక ధర నిర్ణయించి ఆ ధరకు అమ్మవచ్చుకూడా!
  2. లినక్స్ మూల పదాలు(సోర్స్ కోడ్) అందుబాటులో ఉండటం వలన అలా రూపొందే సాఫ్ట్వేర్ లో సాధారణం కంటే తక్కువ లోపాలు(బగ్స్) ఉంటాయి, మరియు అవి కూడా వెంటనే నివృత్తి చేయబడి, లోపరహితంగా ఉండే లినక్స్ అందుబాటులో ఉంటుంది.
  3. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే అది ఎటువంటి ప్లాట్ఫాం అయినా పనిచేస్తోంది. వహనీయత చాలా విస్తృతం.
  4. నమ్మదగిన సాఫ్ట్వేర్ ఎందుకంటే మూలపదాలు మనవద్ద  ఉండటంవలన మన దస్త్రాలు లేక మన సమాచారం ఏ-ఏ మార్పులకు లోనవుతుందో మనకు తెలుసు, అందువల్ల సమాచారచౌర్యం(data stealing, eavesdropping) వంటి సమస్యలు ఉండవు.
  5. ఏదో ఒకరోజు ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ జెండా ఎత్తేస్తే ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదు అన్న సమస్య నెట్ స్కేప్ వాడుకర్లకు నెట్స్కేప్ బ్రౌజరు  నిలిపివేత తరువాత ఎదురైంది. అలా ఏనాటికీ లినక్స్ మూసివేత ఉండదు.
  6. ఇది ఉచితం! మరియు ఎటువంటి సాంకేతిక సహాయం కావాలన్నా మేమున్నాం! :)
అంటే, మీకు డబ్బూ ఖర్చు ఉండదు, మంచి నాణ్యతగల సాఫ్ట్వేర్ కూడా మీ స్వంతం!
మరి వాణిజ్యం? సాధారణంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వ్యవస్థకు ఆదాయం సాంకేతిక సహాయం, పంపకాలు మరియు శిక్షణ ద్వారా వస్తాయి. ఇది ఒక వినూత్నమైన వ్యాపార సూత్రం, దీనిని ఇప్పటికే వాణిజ్యరంగంలో మహామహులైన ఐబీఎమ్, హెచ్ పీ, నోవెల్, సన్ , ఇన్టెల్ ఆచరణలో పెట్టారు. ఐటీకాని కంపెనీలు, ఉదాహరణకు బోయింగ్, గ్లాక్సోస్మి త్క్లైన్  , మొదలగునవి కూడా ఈ సూత్రాన్నే వాడుతూ ఓపెన్ సోర్స్ కు తమ వంతు తోడ్పాటు చేస్తున్నారు.

ఎంతటి క్లిష్టమైన పనినైనా చెయ్యటానికి లినక్స్ ఒక నమ్మదగిన వేదిక:
  • విండోస్ వంటి వాటితో పోలిస్తే అనవసరపు ప్రోగ్రాంలతో లినక్స్ సమర్థవంతంగా పని చెయ్యటం వల్ల మీ సిస్టం క్రాష్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీ దస్త్రాలకు భద్రత.
  • లినక్స్ లో ప్రస్తుతం వైరస్లు లేవు. లినక్స్ వంటి నిర్దిష్టమైన వ్యవస్థలో ప్రస్తుత వైరస్ లు చొరబడలేవు, పూర్తి వైరస్ తీరుతెన్నులు మారితే గానీ ఆ అవకాశం లేదు, అది ఇప్పట్లో సాధ్యం కాదు.
  • ఇది పాత, మూలపడిన మీ హార్డ్వేర్ పై కూడా నడుపవచ్చు.
  • యాంటివైరస్లకు ఇక స్వస్తి పలుకండి.
  • సెక్యూరిటీ(భద్రత) అనేది ఇక్కడ ఒక భాగం, అదనపు విశేషం కాదు.


లినక్స్ కొన్ని అద్వితీయమైన ఉత్తమమైన సాఫ్ట్వేర్లకు నెలవు. అంతకంటే ఉత్తమమైన విషయం ఇవి ఉచితంగా లభించడం. చట్టరీత్యా విండోస్ లేక అడోబ్ వారిచ్చే వీడియో లేక ఆడియో ప్లేయర్లకు వారు మనవద్ద రుసుము తీసుకొనవచ్చు, అలా కాకపోతే అది అనైతికం అవుతుంది. కానీ లినక్స్ తో ఆ చిక్కులు లేవు.


లినక్స్ తోవచ్చే కొన్ని ప్రముఖమైన సాఫ్ట్వేర్లు:

    ఓపెన్ ఆఫీస్ (ప్రస్తుతం లిబ్రే ఆఫీస్)
    Gimp Logo
    గింప్ : ఫోటోషాప్ కు ధీటుగా అందుబాటులో ఉన్న ఫోటో కూర్పు సాఫ్ట్వేరు
    VideoLan movie playerవీడియోలాన్ (వీఎల్సీ)
    ప్రముఖ మీడియా ప్లేయర్.
      Gaim Instant Messengerపిడ్గిన్ యాహూ, జీమెయిల్, ఐఆర్సీ, ల్లో చాటింగ్ చేస్కొనే ఉపకరణం 
    Evolution email and groupware clientఎవల్యూషన్ మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ కు ధీటైన బహుముఖ సాఫ్ట్వేఋ
...ఇలా ఎన్నో ఎన్నెన్నో...
మరి అంతా ఉచితమయితే, నాకేమిటంటా? 

మీరే కాదు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే పొరబడుతుంటాయి. చాలా వరకు లినక్స్ అంటే ఒక వ్యాపకం, అది కాలేజీ కుర్రాళ్ళకుండే ఒక చెడు వ్యసనం అని ఫీలయ్యేవాళ్ళు నేటికీ ఉన్నారూ( మా హెచ్ ఓడీ తోసహా)
అయితే ఇవన్నీ కేవలం అపోహలు. నిజాలు:
  • ఎలా అయితే కార్పొరేట్ సాఫ్ట్వేర్లను పెద్ద కంపెనీలు కొని వాడుకుంటాయో అలానే లినక్స్ ను కూడా కొని వాడుతారు.
  • ఇన్టెల్ వంటి బహుళజాతి సంస్థలు లినక్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టి తద్ఫలితంగా వారు తయారుచేసిన హార్డ్వేర్ కు వెనువెంటనే పని చేయించే సాఫ్ట్వేర్ కేవలం లినక్స్ మాత్రమే ఇవ్వగలదు. విండోస్ వంటి సాఫ్ట్వేర్లు కొత్తగా వచ్చిన హార్డ్వేర్కు సరిపోవు.
  • చైనా వంటి దేశాల్లో ౭౦% వరకూ అన్ని కంప్యూటర్లలోనూ లినక్స్ ను మాత్రమే వాడుతున్నారు.ఈ విధంగా ఆ దేశ పౌరులకు చాలా వరకు ధనం ఆదా అవుతుంది. తద్వారా కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
  • మరెన్నో కంపెనీలు వారి సర్వర్లను లినక్స్ కు మార్చుకుంటున్నారు, కారణం : రక్షణ మరియు భద్రత.
  • అలానే ఈ విధంగా లినక్స్ ద్వారా, లేక ఇతర స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల ద్వారా లాభం పొందిన వ్యక్తులు, విద్యార్థులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వారి వారి తోడ్పాటులను లినక్స్ కు తిరిగి అందించటం ద్వారా లినక్స్ మరింత ప్రభావవంతం అవుతున్నది. దీనికి మంచి ఉదాహరణ : వికీపీడియా. వికీపీడియా ఎటువంటి ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా మీకు సమాచారాన్ని అందిస్తుంది, అందువల్లనే కోట్లాది మంది మరలా తిరిగి వికీపీడియాకు సమాచారాన్ని చేర్చి మరింత సమృద్ధి పరుస్తున్నారు. 

లినక్స్ లోని అన్ని ప్రకల్పాలు(ప్రాజెక్టులు) దాదాపు ఇదే విధంగా పని చేస్తాయి.

22, డిసెంబర్ 2010, బుధవారం

ఉబుంటు

 
ఓపెన్ఆప్యాయత..!
అంతా ఉచితం..!’ అంటే -అటు ఎగబడే వారూ ఉన్నారు..! ఇటు పోదూ బడాయి అని నవ్వేసేవారూ ఉన్నారు! కొనలేని స్థితిలో పైరసీకి సిద్ధమే కానీ, చచ్చినా ఓపెన్ సోర్సు వొద్దు బాబోయ్ ! అనేవారు సైతం ఈ చిన్ని వ్యాసం చదవండి. విండోస్ కన్నా దీటుగా ఉబుంటు అనే లినక్స్ వెర్షన్ ఉచితంగా దొరుకుతుంది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ప్రస్తుతానికి రెండో స్థానంఉబుంటూదే ! రేపో, ఎల్లుండో అది ప్రథమస్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఆరు నెలలకీ దీని కొత్త వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిగ్గా మీ పీసీలో అప్డేట్ చేసేసుకోవచ్చు కూడా. ప్రతీ వెర్షన్ కీ 18 నెలల సపోర్టు గ్యారంటీ.‌‌‌‌

'ఉబుంటు' పేరు వినడానికే చాలా తమాషా. అటు లినక్స్ కుటుంబం ఆదరణా, ఇటు ప్రొఫెషనల్స్ తోడ్పాటూ వెరసి ఉబుంటు లినక్స్ -ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ‘సాఫ్ట్వేర్ అనేది ఉచితంగా దొరకాలి. అందరూ వారి వారి స్థానిక భాషల్లో వాడుకోగలగాలి. యూజర్లు తాము కోరుకున్న రీతిలో కస్టమైజ్ చేసుకునే వీలుండాలి’ -ఇదీ ఉబుంటు మేనిఫెస్టో. ఇది ఏదో ఆషామాషీ భారతీయ ఎలెక్షన్ మానిఫెస్టో కాదు. సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిందే చేసి చూపించే ఆపరేటింగ్ సిస్టం.
ఇంతకీఉబుంటుఅనేది జులు, హాసా భాషాలకు సంబంధించిన పదం. దక్షిణ ఆఫ్రికాలో మానవీయ సంబంధాలను వ్యక్తీకరించే ఒక భావన అది. ఒకరికొకరు, పరస్పరం చూపుకునే ఆప్యాయతకు మారుపేరుఉబుంటు’! అందుకే లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు వచ్చింది. ఓపెన్ సోర్స్ అంటే, అంతేకదా! ఆకాశమే హద్దు. అలాంటప్పుడు ఈ వసుధైక కుటుంబాన్ని కలిపే శక్తిఉబుంటుకే ఉందనడం అతిశయోక్తి కాదు. ఇంటెల్, ఎఎమ్డి ప్రాసెసర్ల మీదే కాదు, సన్ ఆల్ట్రా, స్పార్క్, అమెజాన్ ఇసి 2 ఆర్కిటెక్చర్లో సైతం పనిచేసేలా నేడు ఉబుంటూ దొరుకుతోంది. ప్రజాదరణతో అందరికీ చేరువవుతోంది! ఆఖరికి ఎంటర్ప్రేజ్ వెర్షన్ కూడా ఫ్రీగా లభిస్తోంది. ఇది అత్యుత్తమ ట్రాన్స్లేషన్, యాక్సెసబిలిటీ సౌకర్యాలను కలిగి ఉంది. ఉబుంటు ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సులభం. అంతా 20 నిముషాల పని. ఉబుంటు 10.4 వెర్షన్ ఏప్రిల్ 2010లో అందుబాటులోకి వచ్చింది. ఉబుంటు 10.10 వెర్షన్ అక్టోబర్లో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సాయం కావాలన్నా, ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి.