తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2014, మంగళవారం

ఆగస్టు 21 నుండి .भारत డొమెయిన్ పేరు లభ్యం


అంతర్జాలంలో ప్రతి జాలస్థలినీ ఒక చిరునామా ద్వారా గుర్తిస్తాం. ఉదాహరణకు etelugu.org, ఇక్కడ etelugu  అనేది జాలస్థలి పేరయితే, org అనేది డొమెయిన్ పేరు. ఒక వెబ్సైటు నడపడానికి, మొట్టమొదట మనం చేసే పని ఈ జాలస్థలి పేరునూ, సరియయిన డొమెయిన్ నేం తో పాటూ నమోదు చేసుకోవటం. ఇందుకు కొంత రుసుము చెల్లిస్తాం కూడా. blogspot.com, wordpress.com లాంటి సంస్థలు ఉచితంగా మనకు సబ్డొమెయిన్ ను ఇస్తున్నాయి కూడా!
అయితే ఈ డొమెయిన్ పేరుకు కొన్ని నిబంధనలుండేవి. మొదట్లో కనీసం మూడక్షరాలు గా ఉండాలనీ, తరువాత మూడు లేదా రెండు సరిపోతాయి అనీ, ఆపైన మూడు కన్నా ఎక్కువ ఉండొచ్చనీనూ. అయితే కొద్ది రోజుల క్రితం ఈ డొమెయిన్ పేరు ఆంగ్లంలోనే కాక లాటిన్ కుటుంబంలోని ఇతర భాషలలోనూ పనిచేసేలా చేసారు. (జాలస్థలి పేరుకి ఏ భాషలోనైనా ఉండే సౌలభ్యం ఉంది - ఉదా: వీవెన్.com {ఇప్పుడు పని చేయకపోవచ్చు}). అయితే భారతీయ భాషలలో కూడా ఈ డొమెయిన్ పేరు త్వరలో రానుంది. ప్రస్తుతానికి .in అని వాడుతున్నామే, అలా కాక .भारत అని జాలస్థలుల చిరునామా చివర ఉంటుందనమాట. ఈ సదుపాయం ఆగస్టు 21 మొదలు అందుబాటులోకి రానుంది.
90 రోజుల "సూర్యోదయ" కాలంలో ఈ సదుపాయం దేవనాగరిలోని హిందీ, మరాఠీ, బోడో, డోగ్రీ మొ॥ భాషల జాలస్థలులు వాడేవారు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఆ తరువాత సాధారణ వెబ్సైటుల వారికి కూడా ఇది వాడుకునే అవకాశం వస్తుంది.
ఈ మొత్తం కార్యక్రమాన్ని నిక్సి మరియు సీడాక్ వారు నిర్వహిస్తున్నారు.
త్వరలో తెలుగు మరియు ఇతర భారతీయ భాష లిపులలో కూడా ఈ సదుపాయం రానున్నది.      


21, ఫిబ్రవరి 2012, మంగళవారం

వియల్సీ 2.0 విడుదలైంది.

వీడియోల్యాన్ ఒక స్వచ్ఛంద సంస్థ, విరాలాలు మరియు స్వచ్ఛంద కార్యకర్తలచే నడుపబడుతున్నది. గత కొద్ది కాలంగా వియల్సీ నుండి ఎటువంటి నవీకరణ లేదు అందుకు కారణం వీయల్సీ సరికొత్త రూపాంతరంపై దృష్టిపెట్టింది. వందల కొలది ఉన్న లోపాలను స్థిరపరుచుటకు 160 మంది స్వచ్ఛంద కార్యకర్తలు కృషిచేసారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదములు.
ప్రపంచ వ్యాప్తంగా (కేవలం సోర్సుపోర్జు నుండే 483,309,301 దింపుకున్నారు) అత్యధికంగా దింపుకున్న మధ్యమ ప్రదర్శకముగా వియల్సీకి రికార్డు ఉన్నది.

వియల్సీ 2.0 సరికొత్త హంగులతో మరియు అనేక విశిష్టతలతో మన ముందుకు వచ్చింది అవేంటో చూద్దాం.
సరికొత్త అంతరవర్తి
(మ్యాక్ నిర్వహణ వ్యవస్థలో వియల్సీ 2.0)
 ఈసారి మ్యాక్ నిర్వహణ వ్యవస్థ కోసం కాస్త ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్ ఆపరేటింగ్ వ్యవస్థలో డివిడి ప్లేబ్యాక్ కొరకు సరైన సాఫ్టువేర్ లేనట్టుంది. మ్యాక్ ఓయస్ కొరకు రూపొందించిన అంతరవర్తి కూడా చాలా బాగా రూపొందించారు.

విశిష్టతలు:
  • RAR సంగ్రహాలలోవున్న బహుల మాధ్యమ దస్త్రాలను ప్రదర్శించగలదు
  • వీడియో అవుట్‌పుట్ రీతులను, బ్లూ-రే మాధ్యమ మద్ధతును మెరుగుపరిచారు
  • ఆండ్రాయిడ్, ఐఓయస్, OS/2 మరియు విండోస్ 64 లకు సాఫ్టువేరును రూపొందించారు
  • సరికొత్త ఆడియో, వీడియో ఫిల్టర్లు
  • HTTP లైవ్ స్ట్రీమింగ్ ప్లేబ్యాక్ మద్ధతు
  • పల్స్ ఆడియో ఇన్‌పుట్ మద్ధతు
  • మట్రోస్క (mkv) డీమక్సర్ అభివృద్ధి
  • థియొరా మరియు వోర్బిస్ కొరకు రియల్ టైమ్ ట్రాన్సుపోర్టు ప్రోటోకాల్ (RTP) నందు మద్ధతు
మరిన్ని విశిష్టతలు...

గత రూపాంతరానికి మరియు ప్రస్తుత రూపాంతరానికి సంబంధించిన మార్పులచిట్టాను ఇక్కడ చూడవచ్చు.

తెలుగు కూడా ఉన్నది...
 (డెబియన్ లినక్స్ నందు వియల్సీ మాధ్యమ ప్రదర్శకం తెలుగు తెరపట్టు)
సరికొత్త వియల్సీ మాధ్యమ ప్రదర్శకం 2.0 టూఫ్లవర్ రూపాంతరంలో తెలుగు కూడా అందుబాటులో ఉన్నది. కావున ఆసక్తి ఉన్నవారు వాడి మీ అభిప్రాయాలను పంచుకోవలసినదిగా మనవి. వీయల్సీని అనువదించుటలో తోడ్పడిన తెలుగుపదం గుంపుకు ధన్యవాదములు.

ఉబుంటు/డెబియన్ పంపణీలలో వియల్సీ 2.0 స్థాపించడం ఎలా..?
ఉబుంటు (12.04) మరియు డెబియన్ (SID)ల భాండాగారంలో ఇప్పటికే చేర్చారు కాబట్టి మీ వ్యవస్థను నవీకరిస్తే సరిపోతుంది.
ఉబుంటు 11.10 వాడుకరులైతే, క్రింద పేర్కొన్న పర్సనల్ ప్యాకేజీ ఆర్చీవ్ లను మీ సాఫ్టువేర్ మూలాలకి జతచేయండి.
    
   sudo add-apt-repository ppa:n-muench/vlc
   sudo apt-get update && sudo apt-get install vlc

పైన తెరపట్టులోని చిత్రం బ్లెండరు ద్వారా రూపొందించిన సింటెల్ చిత్రంలోనిది.

31, డిసెంబర్ 2010, శుక్రవారం

డెబియన్ ఇన్స్టాలర్ ఇకనుంచి తెలుగులో...

అర్జున రావు గారి కృషి/తోట్పాటు వల్ల ఇకనుంచి త్వరలోనే మనందరం డెబియన్ మరియు ఆధారిత ఆపరేటింగ్ సిస్టంల స్థాపన ప్రక్రియను తెలుగులో ప్రారంభించవచ్చు.సాధారణంగా మనం ఆపరేటింగ్ స్థాపన మొదలుపెట్టేటప్పుడు మొదటగా మనం (ఆంగ్లంలో) భాషను ఎంచుకుని ప్రారంభిస్తాము ఇదే పనిని మీరు సులభంగా ఇప్పటినుంచి తెలుగులో కూడా చెయ్యవచ్చు.డెబియన్ వారు తొందరలోనే వారి కొత్త వెర్షన్ డెబియన్ 6.0 Squeeze విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెర్షన్ ను మీరు తెలుగులోనే స్థాపించవచ్చు.
అర్జున రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ప్రక్రియను నేను పరీక్షించాను మీ ముందు స్థాపక ప్రక్రియ తెరచాపలను ఉంచుతున్నాను వీక్షించి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తున్నాను. దీనిని మీరు తెలుగులినక్స్ యు ట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు.