కెనానికల్ నుండి వచ్చిన రితేష్ తన సహచరుడితో రానే వచ్చారు. కానీ
అప్పటికింకా ప్రొజెక్టర్ వేదిక నందు సిద్ధంగాలేదు. వేడుకకు వచ్చేవారిని
స్వాగతం పలుకుటలో, వేదిక వివరాలు అందించుటలో తీరికలేకుండా అటూ ఇటూ
తిరుగుతూ ఉన్నాను. ఇంతలో ప్రణవ్ మరియు వీవెన్ ఒకరి తరువాత ఒకరు వచ్చారు. వారిని స్వాగతించి వేదిక వద్దకు తీసుకువెళ్ళాను. మునుపటి రోజు కరాచీ బేకరీ వద్ద ఆర్డరిచ్చిన కేకుతో పవిత్రన్ శాఖమూరి, వికీమీడియా ప్రతినిధి అయిన శ్రీకాంత్‌తో
కలసి HIT చేరుకున్నారు. అక్కడ విశేషమేమిటంటే కేకు పై ఉన్న ప్యాంగోలిన్
బొమ్మని చూచిన ఇద్దరు యువతులు ఆసక్తితో దాని గురించి అడిగి తెలుసుకున్నారట
అంతేకాకుండా కరాచీ బేకరీ వారు కేకు ఛాయాచిత్రాన్ని తీసుకున్న తరవాతే
చేతికిచ్చారట, బహుశా వారి చిత్రశాలలో చేరుస్తారేమో. ఆ తరువాత పవిత్రన్, అతుల్ జా మరియు క్రిష్‌లకు దిశానిర్దేశం చేయగా వారే వచ్చారు, అప్పటికే గది నిండినది.
మునుపటి రోజున కలిసిన పవిత్రన్ మిత్రుడైన అనివార్
తీరకలేని ప్రణాళికలోనూ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషాన్నిచ్చింది అతడు
మంచి మాటకారి. నేను నా ల్యాపుటాపుని ప్రోజక్టురుకి అనుసంధానించుటకు
కొంతసేపు కుస్తీ పట్టాను కానీ ప్రయోజనం లేదు, ఆ పిమ్మట కష్యప్
గారు వారి ల్యాపుటాపుతో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇక పవిత్రన్
రంగ ప్రవేశం చేసి తన వెంటబెట్టుకొచ్చిన శ్రీకాంత్ గారి ల్యాపుటాపుని
విజయంతంగా అనుసంధానించాడు. గ్రాఫిక్స్ డ్రైవర్ సమస్య ఉన్నప్పటికీ సమర్పణకు
ఎటువంటి ఆటంకం కలుగులేదులేండి.
ఇంతలో రితేష్ గారు తన
గురించి పరిచయం చేసుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉబుంటు, లినక్స్
వంటివి ముందు కటువుగా ఉన్నట్టు అనిపిస్తుందని కానీ రాను రాను అవే
అలవాటవుతాయని, అంతే తప్ప ఒక్క రోజులో నచ్చేవి, వచ్చేవి కాదని విండోస్ కూడా
మొదట్లో అలానే అనిసిస్తుందని పేర్కొన్నారు. అలా అంటే నాకు జులాయి
సినిమాలోని డైలాగు గుర్తు వచ్చింది. "భయమేస్తుందని దెయ్యాల సినిమాలు
చూడకుండా ఉంటామా (కావాలని పట్టుబట్టి మరీ చూస్తాము), ఉబుంటు కూడా అంతే అని
అనుకున్నాను". ఉబుంటు కూడా విండోస్ వలె ఒక నిర్వాహక వ్యవస్థ అని ఉబుంటూని
కూడా మీరు మీ నిర్వాహక వ్యవస్థగా స్వేచ్ఛగా వాడుకోవచ్చని తెలిపారు.
వారి
ప్రసంగం ముగిసిన తరువాత సభికులు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. నా వరకూ
నేను తడబడుతూ ఇటీవలే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ మద్ధతు ఉపసంహరించుకోవడం వలన
ఫైర్‌ఫాక్స్ లోని ఫ్లాష్ మద్ధతు సరిగా ఉండదు కాబట్టి తదుపరి సంస్కరణలో ఏ
విహారిణి ఏమి ఉంచబోతున్నారు అని అడగగా వారు దానిపై ఇంకా నిర్ణయం
తీసుకోలేదని, ఫైర్‌ఫాక్స్ కూడా పెప్పర్ ఎపిఐ చొప్పింతని విహారిణిలో చేర్చే
విషయంపై పనిచేస్తుందని, అలాకాకుంటే క్రోమియమ్ విహారిణి వినియోగించబడుతుందని
తెలిపారు. అలాగే ఉబుంటు యునిటీ గురించి అడగగా, యునిటీని వాడుకరులు
ఆదరిస్తున్నారనీ, మంచి స్పందన వస్తుందని తెలిపారు.
ఇక అసలు
కార్యక్రమం అదేనండీ ఉబుంటు కేకు కోయాలని నిర్ణయించారు కానీ అంతకంటే ముందు
అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆ పిమ్మట ఛాయాచిత్రాలు తీసే
కార్యక్రమం ఆపై కేకు కోసే కార్యక్రమం ఇంతకూ కేకు ఎవరూ కోయాలి అని
అంటుండగానే అతిపిన్న వయస్కుడైన ఉబుంటు వాడుకరి(14 సం)చే కేకు
కోయించాలని ఏకగ్రీవంగా అరిచారు.
అంతకుముందే అతుల్ ఝా ఉబుంటు స్టిక్కర్లను బల్లపై ఉంచాడు. కేకుతో పాటుగా స్టిక్కర్లను కూడా వచ్చినవారందరూ పంచుకున్నారు.
ఆ
తరువాత నేను తెలుగు డెస్కుటాపు గురించి మాట్లాడటం జరిగింది. అందులో ఉబుంటు
ప్రత్యేకతలు, తెలుగుపదం, లాంచ్పాడ్ మరియు గణాంకాలు, లక్షాల గురించి నాకు
తోచిన భాషలో ప్రస్తావించాను. పవిత్రన్, అనివార్ మరియు కష్యప్ మధ్యలో
కల్పించుకుని కాస్త ఆసక్తికరంగా మలిచారు.
మొజిల్లా కౌన్సిల్ మెంబర్ అయిన వినీల్ రెడ్డి
ఫైర్‌ఫాక్స్ 13 లోని ప్రత్యేకతలను వివరించారు. అందులో వెబ్‌సైట్ ట్రాకింగ్
ముఖ్యమైనది. వెబ్‌సైటులు మిమ్మల్ని ట్రాక్ చెయ్యడం ఇష్టం లేకపోతే ఈ
ఐచ్ఛికం ద్వారా నిరోధించవచ్చు. అలాగే వివిధ మొజిల్లా పరియోజనలను గురించి
తెలిపారు.
ఓపెన్‌స్టాక్‌పై మాట్లడుకై ప్రత్యేకించి బెంగుళూరు నుండి విచ్చేసిన అతుల్ ఝా,
ఒపెన్‌స్టాక్ ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్టువేరని, అది యాజమాన్య క్లౌడ్
కంప్యూటింగు సాఫ్టువేర్లకు ప్రత్యామ్నామయమని తెలిపారు. ఓపెన్‌స్టాక్
ప్రత్యేకతలను, పనితీరును చక్కనైన పటాలతో వివరించారు. ఒపెన్‌స్టాక్‌కు
ప్రజాదరణ క్రమక్రమంగా పెరుగుతుందని కూడా తెలిపారు.
క్రిష్
పప్పెట్ గురించి బోర్డుపై పప్పెట్ సెర్వర్స్ మరియు క్లయింట్లను గీస్తూ
వివరించారు. పప్పెట్‌పై మంచి మార్కెట్ ఉన్నదనీ, ఆకర్షనీయమైన జీతాలభ్యాలు
ఉన్నాయనీ పేర్కొన్నారు. ఈ కోర్సు విదేశాల్లో చాలా ఖరీదయిందనీ, ప్రస్తుతం
ఇండియాలో ఈ కోర్సుని పరిమిత సభ్యులకే అతి తక్కువ ధరకే అందిస్తున్నట్లు
చెప్పారు. అతికష్టం మీద అందరిని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని ఆసియాలో
జరుపబోతున్నట్లు తెలిపారు.
చివరిగా వికీమీడియా ప్రతినిధి అయిన శ్రీకాంత్
మాట్లాడారు. ఇంతలో అనివార్ బస్సుకు వేళవడంతో నేను లక్డీకపూల్ వద్ద దించి
తిరిగి వేదిక స్థలానికి చేరుకున్నాను. ఇంతలో అంతా అయిపోయింది ఎందుకంటే అసలు
మజా అప్పుడే ఉంటుంది అంతా అయిపోయినపుడు జరిగే చర్చలు చాలా బాగుంటుంది,
కాని నేను ఆ ఆనందాన్ని మిస్సయ్యాను. అందరూ వెళ్లిపోతున్నారు. నా బ్యాగు
సర్దుకుని ఇక నేను బయటకు చేరుకున్నాను.
బయటకు వచ్చిన తరువాత పవిత్రన్
శ్రీకాంత్ ఒక బైకుపై, రితేష్ తన బైకుపై ముందుగా బయలుదేరారు. నేను విపుల్, అతుల్
ఝా ముగ్గురమూ కలసి క్రిష్ కారులో మెల్లగా ప్యారడైజ్ వెళ్లి ఫుడ్ తీసుకుని
నేరుగా మిలటరీ జోన్‌లోని రితేష్ గారి కుటుంబీకుల ఇంటికి వెళ్లాము. అపుడు
ఇంటిలో ఎవరూలేరనుకోండి. అక్కడ మరలా డిస్కషన్ షురూ చేసినాము. మధ్యలో రహ్మాన్
గారు ఫోను చేసి అందరితోనూ స్పీకరులో మాట్లాడారు. తరువాత రాత్రికి మేము
ముగ్గురము అక్కడే బస చేసి తరువాత రోజు ఇంటికి చేరుకున్నాము.
కొసమెరుపేంటంటే ప్రణవ్ అయినవోలు ఒక్కరే ఉబుంటు 12.04 సీడీని పొందగలిగారు :p