17, నవంబర్ 2010, బుధవారం

ఓపెన్ సోర్సు... అపోహలేల...?

ఏదన్నా సరే ఫ్రీ అంటే ఇట్టే ఎగరేసుకుపోయే వారూ ఉన్నారు. ఉచితం! అంటే లోకువ కట్టేసే వారూ లేకపోలేదు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లను ఇట్టే ఎగరేసుకుపోకుండా అపోహలు సృష్టించేవారే అధికం! ముఖ్యంగా యూజర్స్‌కీ, కస్టమర్స్‌కీ ఉండే పరిజ్ఞాన, విజ్ఞాన సమాచారాలు తక్కువ. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కొన్ని వ్యాపార సంస్థలు ఓపెన్ సోర్సు గురించి వ్యతిరేక భావనలు కల్పించడంలో సక్సెస్ అవుతున్నారు. అందువల్ల ఓపెన్ సోర్స్ గురించిన అపోహలు తొలగించుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది.
ఐటి రంగంలో ఓపెన్ సోర్సుకి స్థానం లేదు. కేవలం నేర్చుకోవడానికి విద్యార్థులు కళాశాల గదులకే పరిమితం- అని చాలామంది అంటుంటారు. అది శుద్ధ తప్పు. నేడు ఓపెన్ సోర్సు సాఫ్ట్‌వేర్‌లైన లినక్స్, అపాచి వెబ్ సర్వర్, జావా లాంగ్వేజ్- ఇలాంటివెన్నో ఐటి రంగంలో విస్తృతంగా వాడుతున్నారు.
కీలకమైన (మిషన్ క్రిటికల్) ఈ-గవర్నెన్స్ అప్లికేషన్స్‌కు పనికిరాదనీ ఒక అపోహ ఉంది. నేడు ఎన్నో దేశాల్లో ఈ-గవర్నెన్స్ అప్లికేషన్లు ఓపెన్ సోర్స్ నుంచి వాడటంవల్ల కోట్లాది రూపాయలను ఆదా చేసుకుంటున్నాయి. ఓపెన్ సోర్స్ సంస్థలకు స్వతహాగా వారి మేధోవాక్కులు ఉండవు -ఇదీ అపోహే. ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్ సంస్థలకు కాపీరైట్ హక్కులెలా ఉంటాయో, ఓపెన్ సోర్స్ సంస్థలకూ ఉంటాయి. వాణిజ్యపరమైన సంస్థల్లా, ఓపెన్ సోర్స్ సంస్థలు నియంతృత్వ ధోరణిని అవలంబించవు. ఓపెన్ సోర్స్ పరిజ్ఞానం ప్రొప్రయిటరీ టైపు సపోర్టునివ్వదు -ఇదీ అపోహే. కస్టమర్ సపోర్టు పేరున డబ్బులు వసూలు చేసి సపోర్టునిచ్చేవి వ్యాపార సంస్థలు. నిజానికి ఓపెన్‌సోర్స్‌లో లభిస్తున్నంత చక్కని డాక్యుమెంటేషన్, ప్రొఫెషనల్ సపోర్ట్, మరే వాణిజ్యపరమైన సాఫ్ట్‌వేరూ ఇవ్వడం లేదు. ఓపెన్ సోర్సులో నియంత్రణ లేదు. ఎవరైనా మార్చొచ్చు. ఇది ఓపెన్ సోర్స్ అంటే తెలీనివారు చేసే ప్రచారం. ఎలాపడితే అలా సోర్సుకోడ్‌ను మార్చడానికి వీలులేదు. ఎలాంటి కోడ్ మార్పులు జరిగినా, అవి కేవలం ‘బగ్’ (ఎర్రర్) తొలగింపునకు చెందినదే ఉంటాయి. ఓపెన్‌సోర్స్ సేఫ్ కాదని అందరూ అంటుంటారు. ఓపెన్‌సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసేస్తారనేది కేవలం అపోహే. ఓపెన్ సోర్స్ ప్రమాణాలు ఉన్నతమైనవీ, సురక్షతమైనవీను!

వనరు: ఆంధ్రభూమి

కామెంట్‌లు లేవు: