16, మే 2012, బుధవారం

డెబియన్ 7.0 రూపుదిద్దుకోబోతుంది...

డెబియన్ భవిష్యత్ విడుదల అయిన "వీజీ" స్థాపకము యొక్క ఆల్ఫా రూపాంతరాన్ని డెబియన్ అభివృద్ధికారులు విడుదల చేసారు. డెబియన్ 7.0 వీజీ (wheeze)ను 2013 ఆరంభంలో విడుదలచేయాలని యోచిస్తున్నారు.


స్థాపకము యొక్క మొదటి ఆల్ఫా రూపాంతరంలో ARM నిర్మాణం మరియు వైర్‌లెస్ అనుసంధానాల కొరకు WPA ధృవీకరణను జతచేసారు. ఇందులో ప్రామాణిక దస్త్ర వ్యవస్థగా ext4 ఉంటుంది. ఇప్పుడు Btrfs ను కూడా boot విభజన కోసం ఉపయోగించవచ్చు. వీజీ నందు లినక్స్ కెర్నల్ 3.2 ఉండబోతుంది, ఈ కెర్నల్‌కు దీర్ఘకాలిక మద్ధతు అందిస్తామని పేర్కొన్నారు.

డెబియన్ 7.0 ను జూన్ మధ్యలో ఫ్రీజ్ చేయాలని భావిస్తున్నారు. ఫ్రీజ్ చేసిన నాటి నుండి వీజీ ప్యాకేజీలలో ఉన్న లోపాలను సరిచేయుటపై దృష్టి పెట్టి వాటి పరిష్కారాలను కనుగొని వాటిని ప్యాచ్ చేస్తారు.

ఈ ఆల్ఫా రూపాంతరాన్ని వాడుకరులు పరీక్షించాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగల వారు డెబియన్ పరియోజన జాలస్థలి నుండి సరికొత్త ఆల్ఫా రూపాంతరపు స్థాపక ఇమేజు(.iso)ను దింపుకుని ప్రయత్నించవచ్చు. ఇందులో వాడబడిన సాఫ్టువేరును ఇంకా స్థిరపరచలేదు కాబట్టి దీనిని సాధారణంగా వాడకూడదు ఎందుకంటే వ్యవస్థలో ఉన్న విలువైన సమాచారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకోసం స్థిర విడుదల అయిన స్క్వీజీని ఉపయోగించండి.

కామెంట్‌లు లేవు: