24, మే 2012, గురువారం

లినక్స్ మింట్ 13 విడుదలైంది...

లినక్స్ మింట్ యొక్క సరికొత్త విడుదల "మాయ" విడుదలైంది. ఈ విడుదల ఉబుంటు 12.04 నుండి నిర్మించబడింది. ఈ విడుదల రెండు రూపాలలో లభిస్తున్నది. గ్నోమ్ 2 వాడుకరులకు మంచి ప్రత్యామ్నాయాలైన మేట్ 1.2 మరియు సినెమెన్ 1.4.అంతరవర్తులతో వస్తున్నది. లినక్స్ మింట్ 13 ఒక దీర్ఘకాలిక మద్ధతు(LTS) గల విడుదల, దీనికి ఏప్రిల్ 2017 వరకూ మద్ధతుంది.

తెరపట్టులు
 

 మేట్ 1.2                                                  సినెమెన్ 1.4

సరికొత్త డిస్‌ప్లే మ్యానేజర్ MDM

MDM (మింట్ డిస్‌ప్లే మ్యానేజర్) ఒక సరికొత్త తెర నిర్వాహకం, ఇది గ్నోమ్ డిస్‌ప్లే మ్యానేజర్ 2.20 ద్వారా నిర్మించబడింది. ఇప్పుడున్న అన్ని తెర నిర్వాహకాల కంటే ఎక్కువ విశిష్టతలతో కూడి ఉన్నది.ఇందులో మీ డెస్కుటాపును మలచుకునేందుకు వీలుగా చిత్రరూపంతో కూడిన స్వరూపణ పనిముట్లు మరియు భాష ఎంపిక, స్వయంచాలక ప్రవేశం వంటివి ఉన్నాయి.
 


23, మే 2012, బుధవారం

ఉబుంటు 12.04 స్థాపించిన తర్వాత చేయాల్సిన పనులు

ఉబుంటు స్థాపించిన తరువాత వ్యవస్థనంతటినీ మనకు కావలసిన విధంగా మలుచుకోవాల్సివుంటుంది. ఇందుకు కొన్ని కొత్త అనువర్తనాలను, ప్యాకేజీలను స్థాపించాలి. ఉబుంటు 12.04 స్థాపించిన తరువాత వ్యవస్థలో ఉన్న నవీకరణ నిర్వాహకం (అప్డేట్ మ్యానేజర్) ద్వారా నవీకరణలు ఏమైనా అందుబాటులో ఉన్నాయేమో పరిశీలించి వాటిని స్థాపించిన తరువాత క్రింది పేర్కొన్న ప్యాకేజీలను, అనువర్తనాలను స్థాపించడం మంచిది.



కోడెక్‌లను మరియు ఇతరాలను స్థాపించండి

ఉబుంటులో పాటలు వినటానికి లేక చలనచిత్రాలు చూడాలంటే అందుకు కావలసిన కొడెక్‌లను మీరు స్థాపించాలి. న్యాయపరమైన కారణాల దృష్ట్యా ఉబుంటు ఈ కొడెక్‌లను అప్రమేయంగా అందించుటలేదు. MP3, DVD, Flash, Quicktime, WMA మరియు WMV,వంటి దస్త్రాలను ప్రదర్శించుటకు, అలాగే RAR దస్త్రాలను తెరుచుటకు, మైక్రోసాఫ్టు కోర్ ఫాంట్స్, ఫైర్‌ఫాక్స్ అడోబ్ ఫ్లాష్ చొప్పింత కొరకు క్రింద పేర్కొన్న ప్యాకేజీని స్థాపించాలి.
 
sudo apt-get install ubuntu-restricted-extras



జిడెబి మరియు సినాప్టిక్ మ్యానేజర్


.deb ప్యాకేజీలను స్థాపించుటకు అంతరవర్తితో కూడిన జిడెబి మరియు సినాప్టిక్ నిర్వాహకాలను స్థాపించండి.

sudo apt-get install gdebi


sudo apt-get install synaptic
 


 గూగుల్ క్రోమ్ విహారిణిని స్థాపించండి

అడోబ్ వారు లినక్సుకు ఫ్లాష్ ప్లేయర్ మద్దతును ఫ్లాష్ ప్లేయర్ ప్లగిన్ ద్వారా అందిస్తున్నారు. కాకపోతే ఈ ప్లగిన్‌కు ఇక ముందు ఎటువంటి మద్ధతును అందించమని పేర్కొన్నారు. గూగుల్ వారు క్రోమ్ విహారిణిలో అప్రమేయంగా పెప్పర్ ఎపిఐతో ఫ్లాష్ తోట్పాటును ఏర్పాటుచేసారు. అందువలన మీరు ఎటువంటి లోపాలను లేని స్థిరమైన ఫ్లాష్ మద్ధతు కావాలంటే గూగుల్ క్రోమ్ ఎంచుకోవాల్సివుంటుంది.

http://google.com/chrome


  ఫ్లాష్ చొప్పింతను స్థాపించండి

మీరు ఫైర్‌ఫాక్స్ అభిమానా...విహారిణిని మార్చకూడదనుకుంటున్నారా. సమస్య ఏమీ లేదు ఎందుకంటే అడోబ్ ఇదివరకు విడుదల చేసిన ఫ్లాష్ చొప్పింత ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రంలో అందుబాటులో ఉండనే ఉంది. మీరు ఫైర్‌ఫాక్స్ లోనే ఫ్లాష్ మద్ధతు కావాలనుకుంటే క్రింద పేర్కొన్న చొప్పింతను స్థాపించుకోండి.


sudo apt-get install flashplugin-installer


యునిటీ ప్రత్యామ్నాయాలు


ఉబుంటు 12.04 ప్రిసైజ్ ప్యాంగోలిన్‌లో యునిటీ అంతరవర్తి అప్రమేయంగా ఉంటుంది. ఒకవేళ మీకు యునిటీ నచ్చకపోయినట్లయితే, గ్నోమ్ క్లాసిక్ లేదా గ్నోమ్ షెల్ వాడవచ్చును.


క్లాసిక్ గ్నోమ్ సెషన్

sudo apt-get install gnome-session-fallback

గ్నోమ్ షెల్

sudo apt-get install gnome-shell

ఐబస్
తెలుగులో టంకించుటకు ఆపిల్, ఇన్‌స్క్రిప్ట్, ఆర్టియస్, పోతన మరియు ఐట్రాన్స్ వంటి వివిధ రకాల కీబోర్డు నమూనా(అమరిక)లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఐబస్ తో పాటుగా ibus-m17n ప్యాకేజీని స్థాపించాల్సివుంటుంది. ఒకవేళ మీరు ఇన్‌స్క్రిప్ట్ వినియోగించువారయితే ఐబస్ సహాయం లేకుండానే వ్యవస్థలో ఉన్న కీబోర్డు అమరికల ద్వారా ఇన్‌స్క్రిప్ట్ అమర్చుకోవచ్చును.

sudo apt-get install ibus ibus-m17n

గ్నోమ్ ట్వీక్ టూల్

గ్నోమ్ అంతరవర్తిని మీకు కావలసిన విధంగా అనురూపించుటకు గ్నోమ్ ట్వీక్ టూల్ సహకరిస్తుంది.  
 

sudo apt-get install gnome-tweak-tool

వీయల్సీ మాధ్యమ ప్రదర్శకం
 


వియల్సీ సరికొత్త రూపాంతరమయిన టూఫ్లవర్‌ను స్థాపించండి. వియల్సీ ద్వారా ఎటువంటి మాధ్యమ దస్త్రాలనైనా ప్రదర్శించవచ్చు. కాబట్టి లినక్సులో వియల్సీ మాధ్యమ ప్రదర్శకం ప్రామాణికమైన మాధ్యమ ప్రదర్శకంగా పేర్కొనవచ్చును.

sudo apt-get install vlc 



అదనపు (ffmpeg, x264) మాధ్యమ ప్యాకేజీలను స్థాపించండి క్రింద పేర్కొన్న ప్యాకేజీలను దింపుకుని జిడెబి లేదా టెర్మినల్ ద్వారా స్థాపించండి.
ffmpeg
http://db.tt/Gtmz7pO0

x264
http://db.tt/bcAA2cZp
libvpx
http://db.tt/myGXyfX3
qt-fast start
http://db.tt/fWWqJh04

16, మే 2012, బుధవారం

డెబియన్ 7.0 రూపుదిద్దుకోబోతుంది...

డెబియన్ భవిష్యత్ విడుదల అయిన "వీజీ" స్థాపకము యొక్క ఆల్ఫా రూపాంతరాన్ని డెబియన్ అభివృద్ధికారులు విడుదల చేసారు. డెబియన్ 7.0 వీజీ (wheeze)ను 2013 ఆరంభంలో విడుదలచేయాలని యోచిస్తున్నారు.


స్థాపకము యొక్క మొదటి ఆల్ఫా రూపాంతరంలో ARM నిర్మాణం మరియు వైర్‌లెస్ అనుసంధానాల కొరకు WPA ధృవీకరణను జతచేసారు. ఇందులో ప్రామాణిక దస్త్ర వ్యవస్థగా ext4 ఉంటుంది. ఇప్పుడు Btrfs ను కూడా boot విభజన కోసం ఉపయోగించవచ్చు. వీజీ నందు లినక్స్ కెర్నల్ 3.2 ఉండబోతుంది, ఈ కెర్నల్‌కు దీర్ఘకాలిక మద్ధతు అందిస్తామని పేర్కొన్నారు.

డెబియన్ 7.0 ను జూన్ మధ్యలో ఫ్రీజ్ చేయాలని భావిస్తున్నారు. ఫ్రీజ్ చేసిన నాటి నుండి వీజీ ప్యాకేజీలలో ఉన్న లోపాలను సరిచేయుటపై దృష్టి పెట్టి వాటి పరిష్కారాలను కనుగొని వాటిని ప్యాచ్ చేస్తారు.

ఈ ఆల్ఫా రూపాంతరాన్ని వాడుకరులు పరీక్షించాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగల వారు డెబియన్ పరియోజన జాలస్థలి నుండి సరికొత్త ఆల్ఫా రూపాంతరపు స్థాపక ఇమేజు(.iso)ను దింపుకుని ప్రయత్నించవచ్చు. ఇందులో వాడబడిన సాఫ్టువేరును ఇంకా స్థిరపరచలేదు కాబట్టి దీనిని సాధారణంగా వాడకూడదు ఎందుకంటే వ్యవస్థలో ఉన్న విలువైన సమాచారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకోసం స్థిర విడుదల అయిన స్క్వీజీని ఉపయోగించండి.

15, మే 2012, మంగళవారం

గింప్ 2.8 విడుదలయింది - ప్రయత్నించారా?

గింప్ - గ్నూ ఇమేజ్ మానిపులేషన్ ప్రోగ్రాముకు సంక్షిప్త రూపం. ఇది బొమ్మలను, చిత్రాలను సరిదిద్దేందుకు వాడవచ్చు. ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది, గ్నోమ్‌లో అప్రమేయంగా వస్తుంది.

దాదాపు మూడున్నరేళ్ళ తరువాత వచ్చిన ఈ కొత్త రూపాంతరంలో ఎన్నో విశేషాలు కలవు.

గింప్ గురించి కొంత తెలుసుకుందాం : గింప్ విండోస్, మాక్ మరియు లినక్స్ అన్నింటా వాడగలము. ఇది గుణవిశేషాల్లో అడోబ్ ఫోటోషాప్‌ను పోలి ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుండీ ఖరీదయిన అడోబ్ ఉత్పాదనలకు ఉచిత ప్రత్యామ్నాయంగా గింప్‍ను వాడుకరులు ఆదరించారు.

ఈ నెల మొదటి వారంలో గింప్ యొక్క సరికొత్త రూపాంతరం(2.8) విడుదలయింది. ఈ కొత్త వెర్షన్‌లో ఎన్నో కొత్త విశేషాలున్నాయి. సరికొత్త అంతరవర్తిని ఇందులో ముఖ్యమయిన విశేషం. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగ్గ మార్పు ఒకే కిటికీలో అన్ని సమకూరి ఉండడం. ఇదివరకు వచ్చిన అన్ని గింప్ వెర్షన్‍‌లలోనూ పరికరాలన్నీ ఒక కిటికీలో, మార్పులు పొందుతున్న ముఖ్య చిత్రం ఒక కిటికీలో, ఇంకా చిత్రం యొక్క అంశాలను చూపే పనిముట్ట్లు ఒక కిటికీలో ఉండేవి; ఇప్పుడిక మూడింటినీ ఒకే కిటికీలో మార్చుకొనవచ్చు లేదా మునుపటిలా కూడా వాడవచ్చు. ఈ కొత్త అంతరవర్తినిలో ఒకటి కన్నా ఎక్కువ బొమ్మలతో పని చేస్తుంటే, ఒక్కోటి ఒక్కో ట్యాబులో తెరుచుకుంటుంది. మునుపటిలా ఒక్కోటి ఒక్కో కిటికోలోలా ఉండదిక!

మరికొన్ని కొత్త విషయాలు:

  • ఇక పై బొమ్మ అప్రమేయంగా .xcf గా భద్రపరుచబడుతుంది, మిగతా పొడిగింతలు/ఆకృతుల కోసం Export వాడాలి.
  • పనిముట్ట్లు, పరికరాల కోసం ఎక్కువ జాగా ఏర్పడింది, సౌకర్యం పెరిగింది.
  • పొరలను ఇంతకు ముందు, అయితే యథా ప్రకారం ఉంచవలసి వచ్చేది లేదా, ఒక దానిలో ఒకటి మెర్జ్ చెయ్యవలసి వచ్చేది, ఇప్పుడు పొరలను ఒక సమూహంగా పేర్కొని, మరింత సులభంగా పనులు చేయవచ్చు.
  • పాథ్యం ఇంతకు మునుపు వేరే డైలాగ్‌లో రాసి, ఆ పై కాన్వాస్ పై చూసే వాళ్ళం, ఇప్పుడు నేరుగా కాన్వాస్ పై పాఠ్యం ఉంటుంది. 
  • ఇక పై కొత్త కీబోర్డు అడ్డదారులు కూడా వాడవచ్చు, Ctrl+E Export కోసం, Ctrl+J బొమ్మను కాన్వాస్ పై కుచించటం కోసం
  • కుంచెల వాడకం కూడా సులభంగా ఉంది. కుంచెలను ఇప్పుడు తిప్పవచ్చు!
పైవి నేను నాకుగా కనుగొన్న మార్పులు. ఇంకా ఎన్నో కొత్త విశేషాలున్నాయి.

గింప్ ఎక్కడ దొరుకుతుంది? 

విండోస్ మరియు మ్యాక్‌లకు ఇంకా స్థిర రూపాంతరం అందుబాటులో లేదు, లినక్స్ వాడుకరులకు ఇది అందుబాటులో ఉంది.

నాకయితే గింప్ కొత్త రూపం పిచ్చ పిచ్చగా నచ్చింది. 

మరి మీ మాటేంటి..?


14, మే 2012, సోమవారం

లినక్స్ ఏవిధంగా నిర్మితమైంది...

లినక్స్ ఫౌండేషన్ రూపొందించిన ఈ లఘుచిత్రంలో లినక్స ఏ విధంగా అభివృద్ధిచేయబడిందో చూడవచ్చు.