తన పర్యటనలో భాగంగా గత కొద్ది రోజులుగా రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్ (ఆర్ఎంఎస్) భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇంతకూ ఎవరీ రిచర్డ్ స్టాల్‌మన్ అని మీరు అడగవచ్చు. ఈయనే ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. గ్నూ పరియోజనను, ఈమాక్స్ మరియు జిసిసి(గ్నూ కలెక్షన్ కంపైలర్), జిపియల్ (జనరల్ పబ్లిక్ లైసెన్స్) వంటి అనేక ప్రయోజనకరమైన వాటిని రూపొందించారు. ప్రస్తుతం ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషనుకు అధ్యక్షులుగా ఉన్నారు. జిసిసి అనేది లినక్స్ మరియు బియస్డీ వంటి కంప్యూటర్ నిర్వాహణ వ్యవస్థలలో కంపైలరుగా వాడబడుతున్నది. అలాగే మనం నిత్యంవాడే ఫ్రీ సాఫ్టువేర్లలో అధికశాతం జిపియల్ (జనరల్ పబ్లిక్ లైసెన్స్) లైసెన్సుతో ఇవ్వబడతాయి.
అసలు మనలో ఎంతమంది సాఫ్టువేర్ స్థాపించేటపుడు లైసెన్సులు చదువుతాం...? ఏదో అడిగింది కదా అని టిక్ పెట్టి అగ్రీ పై నొక్కి ముందుకి కొనసాగుతాము అంతే తప్ప అందులో ఏముందో చదువుదాం అని మాత్రం అనుకోం ఎందుకంటే ఇంత పెద్దగావుంది ఏం చదువుతాము లే అయినా అవన్నీ మన దేశంలో ఎవడు పట్టించుకుంటాడు అని అనుకుంటాము. ఎందుకంటే మన దేశంలో పైరేటెడ్ సాఫ్టువేరుపై చట్టాలు లేకపోవడం వలన ఇలా ఉన్నాము అదే అమెరికాలో అయితే అంతే...
పొరపాటున మీరు అమెరికాలో ఉన్నారునుకుందాం, అంతర్జాల వేగం(మెగాబైట్లలో, వేగం బాగానే ఉంటుంది తరవాతే వాచిపోద్ది) అద్భుతంగా ఉంది కుమ్మేద్దాం అనుకుని ఏదైనా సినిమాను లేక సాఫ్టువేరును టోరెంటు లేదా దస్త్రాలు పంచుకునే సైట్ల నుండి దింపుకున్నారనుకోండి, అంతే వెంటనే మీ ఇంటికి బిల్లు వచ్చేస్తుంది. అలా ఉంటాయి మరి అమెరికాలో చట్టాలు, ఎందుకంటే అక్కడ అన్నిటినీ ట్రాక్ చేస్తారు. ఇలాంటి చట్టాలన్నీ అమెరికాలోనే ఉద్భవిస్తాయి.
ఇటీవలి సోపా మరియు పీపా అని రెండు బిల్లులను అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు గానీ అదృష్టవశావత్తూ అవి పాసవ్వలేదు లేండి ఎందుకంటే ఆ బిల్లులపై విశ్వవ్యాపితంగా తీవ్రమైన నిరశనలు. ఎందుకంటే అవి అంతర్జాల స్వేచ్ఛను పూర్తిగా నిషేదించేలా రూపొందించబడ్డాయి.జనవరి 18న వికీపీడియా, గూగుల్, వర్డ్ ప్రెస్ వంటి అనేక సంస్థలు ఆ రోజు సేవలను పరిమితంగా నిలిపివేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసాయి.
సోపా(స్టాప్ ఆన్ లైన్ పైరసీ యాక్ట్) మరియు పీపాలు(ప్రొటెక్ట్ ఐపీ యాక్ట్) వంటి చట్టాల వలన అంతర్జాల స్వేచ్ఛ ఎలా హరించుకుపోతుందనే విషయంపై డా. రిచర్డ్ స్టాల్‌మన్ ప్రసంగించనున్నారు.
భారతదేశ ఫ్రీ సాఫ్టువేర్ ఉద్యమంలో భాగమైన స్వేచ్ఛ సంస్థ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది.
ఎక్కడ: స్వేచ్ఛ కార్యాలయం, గచ్చిబౌలి క్రాస్ రోడ్స్.
ఎప్పుడు: ఫిబ్రవరి 8, 2012, మధ్యాహ్నం 3 గంటల నుండి...
ప్రవేశం: ఉచితం
అందరూ స్వేచ్ఛగా తరలిరావాలని కోరుకుంటున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి