7, ఫిబ్రవరి 2011, సోమవారం

డెబియన్ విడుదలల కథా కమామీషు

డెబియన్  సగటున 1.5 సంవత్సరాల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల చేస్తుంది.అంటే దాదాపు 535 రోజుల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల అవుతుంది.దీని అభివృద్ధి సాధారణంగా మూడు స్థితుల్లో జరుగుతుంది.వీటిని స్థిరమైన,పరీక్షించబడుతున్న,అస్థిరమైన దశలుగా విభజించారు.ఇందులో మొదటిగా అస్థిరమైన దశలో ఉన్న దానిని తీసుకుని అందులో గల లోపాలను కొంతవరకూ సరిచేసిన తర్వాత దానిని పరీక్షించబడుతున్న స్థితిలో ఉన్న దానిగా పరిగణించి దాంట్లో కూడా ఉన్న దోషాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాడుకరులనుంచి సేకరించి వాటిలోని ఉన్న దోషాలను కూడా పరిష్కరించి ఒక స్థిరమైన స్థితికి తీసుకువస్తారు అలా అ దశలో ఉన్న దానిని స్థిరమైనది(Stable)గా  ప్రకటిస్తారు.డెబియన్ అభివృద్ధి క్రమంలో ఉన్నమూడు దశలు ఇక్కడ గమనించవచ్చు.
  • Stable (స్థిరమైన)
  • Testing (పరీక్షించబడుతున్న)
  • Unstable (అస్థిరమైన)
డెబియన్ ప్రతీ విడుదలకూ ఒక పేరు ఉంటుంది కదా అది టాయ్ స్టోరీ అనే ఒక అంగ్ల చిత్రంలోని పాత్రలను తీసుకుని పెట్టడం జరుగుతుంది.డెబియన్ ప్రోజెక్టు ఎల్లప్పుడూ అస్థిర విడుదల మీద పని కొనసాగిస్తుంది.దీనినే "సిడ్ "(కోడ్ పేరు sid, ఇది కూడా టాయ్ స్టోరీ చిత్రంలో ఒక పాత్ర.సిడ్ అనే పేరు గల కుర్రాడు బొమ్మలను ధ్వంసం చేస్తూ అనందిస్తూ ఉండే ఒక దుష్టమైన పాత్ర.)గా పిలుస్తారు.ఇక ఈ పేరును డెబియన్ వారు ఎంతో తెలివిగా SID(Still in Developement)గా వాడుతున్నారు.ఇందులో కొత్తగా నవీకరించబడిన ప్యాకేజీలను స్థిరంగా ఉన్న కొత్త విడుదలకు జతచేసి తరువాయి స్థిరమైన విడుదలకు ప్రయత్నిస్తారు.ఈ విధంగా డెబియన్ విడుదల చక్రం తిరుగుతూ ఉంటుంది.డెబియన్ ఎల్లప్పుడూ ఒక స్థిరమైన విడుదలని వాడుకలో ఉంచుతుంది.ఎప్పుడైతే ఒక కొత్త వెర్షన్ విడుదలవుతోందో , అంతకు ముందు విడుదల అయిన వెర్షన్ కి మరో సంవత్సరం పాటు డెబియన్ రక్షణ బృందం వారు మద్ధతు అందిస్తారు.తరువాయి స్థిరమైన విడుదల అయ్యేవరకూ అస్థిర మరియు పరీక్షించబడుతున్న రెండు నిక్షేపాలను ఎడతెగకుండా నవీకరించి అభివృద్ధి చేస్తారు.మీరు డెబియన్ కు కొత్త అయితే స్థిరమైన వెర్షన్ వాడిండి.మీరు ఇంతకు పూర్వమే లినక్స్ వాడిన అనుభవం ఉంటేమరియు కొత్త సాప్ట్వేర్లు కోసం పరీక్షించబడుతున్న దానిని వాడవచ్చు.ఇప్పటివరకూ విడుదల అయిన క్రమాన్ని ఇక్కడ గమనించవచ్చు.



ప్రతీ విడుదలకూ కొత్త సాప్ట్వేర్లను మరియు ప్యాకేజీలను నవీకరిస్తూ, కొత్త నిర్మితాలకు(ఆర్కిటెక్చర్లకు) మద్ధతును పెంచుతూ డెబియన్ ముందుకు కొనసాగుతుంది.ఇప్పటి వరకూ విడుదల అయిన వెర్షన్లను ఒకసారి చూద్దాం.
  • 1.1 Buzz (బజ్జ్-17 జూన్ 1996)
  • 1.2 Rex (రెక్స్-12 డిసెంబర్ 1996)
  • 1.3 Bo (బో-5 జూన్ 1997)
  • 2.0 Hamm (హమ్మ్-24 జూలై 1998)
  • 2.1 Slink (స్లింక్-9 మార్చి 1999)
  • 2.2 Potato (పొటాటో-15 జూలై 2000)
  • 3.0 Woody (వుడీ-19 జూలై 2002)
  • 3.1 Sarge (సార్జ్-6 జూన్ 2005)
  • 4.0 Etch (ఎట్చ్-8 ఏప్రిల్ 2007)
  • 5.0 Lenny (లెన్ని-14 ఫిబ్రవరి 2009)
  • 6.0 Squeeze (స్క్వీజ్-6 ఫిబ్రవరి 2011)

కామెంట్‌లు లేవు: