27, నవంబర్ 2010, శనివారం

ఎంఎస్‌ ఆఫీస్‌కు ధీటుగా ఓపెన్‌ ఆఫీస్‌


 కంప్యూటర్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆఫీస్‌ సూట్‌ను ఉపయోగిస్తూనే వుంటారు. వర్డ్ ఫైల్స్ దగ్గర నుండి డేటా బేస్‌ తయారీ వరకు అనేక రకాల పనులకు సంబంధిత సాఫ్ట్వేర్స్ అందుబాటులో వున్నాయి. ఆఫీస్‌ సూట్‌ అనగానే ఎక్కువమంది ఠక్కున చెప్పేది మైక్రోసాఫ్ట్ఆఫీస్‌ (ఎం.ఎస్‌.ఆఫీస్‌) గురించే. కానీ మైక్రోసాఫ్ట్ఆఫీస్‌ సూట్‌ను తలదన్నేరీతిలో ఈమధ్యకాలంలో అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చిన ఆఫీస్‌ సూట్‌ 'ఓపెన్‌ ఆఫీస్‌'. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో కూడా లేనటువంటి అద్భుతమైన ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ కు  ధీటైన సవాల్‌ విసురుతోంది  ఓపెన్‌ ఆఫీస్‌. ఆ వివరాలు...

ఆఫీసు అవసరాలకు వాడే సాఫ్ట్‌వేర్‌ని ఆఫీస్‌ సూట్‌ అంటారు. ఒక సాధారణ ఆఫీస్‌ సూట్‌లో వ్యాసాలు, ప్రజెంటేషన్లు, కంపెనీ ఖాతాలు, డేటా బేస్‌ వంటి అనేక పనులు నిర్వహించవచ్చు. అన్ని ఆఫీస్‌ సూట్లలోనూ ఎక్కువగా వాడే మైక్రోసాఫ్ట్ఆఫీస్‌లో వ్యాసాలు రాయటానికి వాడే సాఫ్ట్‌వేర్‌ని మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటారు. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఒక వ్యాసాన్ని రాసి ఫైలును భద్రపరిస్తే ఆ ఫైల్‌ను 'వర్డ్ డాక్యుమెంట్‌' అంటారు. వర్డ్ డాక్యుమెంట్‌లో మనం రాసిన వ్యాసం రహస్య పద్ధతిలో భద్రపరచి వుంటుంది. దీనిని ఏ పద్ధతిలో మైక్రోసాఫ్ట్‌వారు భద్రపరిచారో మైక్రోసాఫ్ట్ వారికి తప్ప మరెవరికీ తెలియదు. ఈ పద్ధతిని వారు ఎవరికీ చెప్పరు. ఈ సాఫ్ట్‌వేర్లలో తప్ప మరే సాఫ్ట్‌వేర్‌లోనూ ఈ వ్యాసాన్ని చదవలేరు. కనుక మన సమాచారం మొత్తం అమెరికాలోని ఒక కంపెనీ గుప్పెట్లో వుంటుందన్నమాట. మైక్రోసాఫ్ట్‌వారు డాక్యుమెంట్లను దాచే విధానాన్ని అవసరం లేకపోయినా తరచూ మార్చేస్తుంటారు. ఇప్పటికి 'మైక్రోసాఫ్ట్ఆఫీస్‌ -40, 95, 98, 2000, XP, 2003, 2007, 2010' వరకు విడుదలయ్యాయి. వీటన్నిటిలోనూ వర్డ్ డాక్యుమెంట్లు దాచే విధానం మారిపోతూ వచ్చింది.


దీనివల్ల ఒక వెర్షన్లో వున్న వ్యాసం మరో వెర్షన్‌లో చదవడం కష్టమవుతుంది. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వారు కొత్త వెర్షన్‌ విడుదల చేసిన ప్రతిసారీ పెద్దమొత్తంలో డబ్బులు వెచ్చించి కొనాల్సి వుంటుంది. అంతేకాకుండా ఈ వర్డ్ డాక్యుమెంట్ల ద్వారా వైరస్‌ కూడా సులువుగా వ్యాప్తి చెందుతుంది. అందువల్లనే చాలావరకు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్లపై ఆధారపడకుండా ఫ్రీ సాఫ్ట్‌వేర్లను వాడుతున్నారు. ఇక్కడ ఫ్రీ అంటే 'ఉచిత' అని కాకుండా 'స్వేచ్ఛ' అని అర్థం వస్తుంది. ఈ ఫ్రీ సాఫ్ట్‌వేర్లను మైక్రోసాఫ్ట్ వారిలా కాకుండా మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఎవరికైనా ఉచితంగా ఇవ్వవచ్చు. మైక్రోసాఫ్ట్ఆఫీసును పోలివుండే ఈ సాఫ్ట్‌వేర్‌లో నేరుగా పిడిఎఫ్‌ చేసుకునే అవకాశం వుంది. ఆప్షన్స్ బార్‌లోని 'ఎక్స్‌పోర్ట్ పిడిఎఫ్‌' అనే బటన్‌పై క్లిక్‌ చేసి నేరుగా పిడిఎఫ్‌ చేసుకోవచ్చు. డ్రా అనే వెక్టార్‌ గ్రాఫిక్స్ సాఫ్ట్‌వేర్‌ లాంటివి అదనపు ఆకర్షణలు.


దీనిని http://download.openoffice.org/index.html నుండి డౌన్లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేయాలి. ప్రోగ్రామ్స్ ఫోల్డర్‌లో 'ఓపెన్‌ ఆఫీస్‌.ఆర్గ్' పేరుతో ఓ ఫోల్డర్‌ క్రియేట్‌ అవుతుంది. అందులో ఈ సూట్‌లో వుండే ఆరు సాఫ్ట్‌వేర్ల జాబితా కనబడుతుంది. అందులోనుండి మనకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను డైరెక్ట్‌గా ఓపెన్‌ చేసుకోవచ్చు. లేదా అదే లిస్టులో  పైన కనిపించే 'ఓపెన్‌ఆఫీస్‌.ఆర్గ్'ను సెలెక్ట్‌ చేసుకొని ఓపెన్‌ చేసుకుంటే చిత్రంలో కనిపించే విధంగా ఐకాన్లతో కూడిన పేజీ తెరుచుకొంటుంది. అందులో మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఆ ఐకాన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెరవవచ్చు.


ఓపెన్‌ ఆఫీస్‌ రైటర్‌ : ఇది ఎం.ఎస్‌.వర్డ్  మాదిరిగా పనిచేస్తుంది. చాలా తేలికగా దీనిని ఉపయోగించవచ్చు. దీని ఆఫీస్‌ సూట్‌లోని మరో సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళాలన్నా ఆప్షన్‌బార్‌ మొదట్లో వుండే 'న్యూ' అనే బటన్‌పై క్లిక్‌చేసి వచ్చే
లిస్టులో ఏదికావాలో ఎంపిక చేసుకోవచ్చు.

ఓపెన్‌ ఆఫీస్‌ స్ప్రెడ్ షీట్ : విండోస్‌లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ ఏ రకంగా ఉపయోగపడుతుందో అంతకంటే మెరుగైన సౌకర్యాలతో ఈ
కాల్ సి ఉపయోగపడుతుంది. స్ప్రెడ్‌ షీట్‌లో సమాచారాన్ని తీసుకొని, గణిత సంబంధమైన లెక్కలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇచ్చిన సమాచారాన్ని చార్టుల రూపంలోనూ, గ్రాఫుల రూపంలోనూ చిత్రీకరించవచ్చు. దీనిని ఉపయోగించి మనకు కావలసిన సమాచారాన్ని గణనం చేసి, విశ్లేషించవచ్చు. దీనిలోని గణాంక, బ్యాంకు, వ్యాపార సంబంధమైన ఆదేశాల (ఫంక్షన్స్)ను ఉపయోగించి సూత్రాలను కొనుక్కోవచ్చు. ఈ సూత్రాల సహాయంతో మనం అతి క్లిష్టమైన లెక్కింపుల సమస్యలను పరిష్కరించవచ్చు.

ఓపెన్‌ ఆఫీస్‌ ఇంప్రెస్‌ : ఎం.ఎస్‌.ఆఫీస్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ మాదిరి ఉపయోగపడుతుంది. ప్రజెంటేషన్‌ అనేది కొన్ని స్లైడ్స్ లేదా కొన్ని పేజీల సముదాయం. పేజీలలో లేదా 
స్లైడ్స్ లో బొమ్మలు, టేబుల్స్, గ్రాఫ్స్ తదితర సమాచారాన్ని ఎదుటివారికి సులభంగా విశదీకరించేందుకు, మన భావాలను సులభంగా వ్యక్తీకరించేందుకు ఈ ప్రజెంటేషన్లు ఉపకరిస్తాయి. రకరకాల బ్యాక్‌గ్రౌండ్‌ డిజైన్లతో కూడిన ఈ పేజీలను స్లైడ్స్ రూపంలో ఒక్కసారి ఆర్గనైజ్‌ చేయడం తెలిస్తే ఇక ఏదైనా ప్రజెంటేషన్‌ రూపంలో చేయగలుగుతారు.

ఓపెన్‌ ఆఫీస్‌ బేస్‌ : ఎం.ఎస్‌.యాక్సెస్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది. దీనిని యాక్సెస్‌ కంటే మెరుగైన, సురక్షితమైన డేటాబేస్‌ను తయారుచేసుకోవచ్చు.


ఓపెన్‌ ఆఫీస్‌ మ్యాథ్స్: ఎం.ఎస్‌.ఆఫీస్‌లో ఈ రకమైన ఫీచర్‌లేదు. దీనిని ఉపయోగించి లెక్కలకు సంబంధించిన అనేక ఫార్ములాలను తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.


ఓపెన్‌ ఆఫీస్‌ డ్రా : ఈ రకమైన ఫీచర్‌ ఎం.ఎస్‌.ఆఫీస్‌లో లేదు. దీని
లో ఉపయోగించి వెక్టార్‌ డ్రాయింగ్స్ క్రియేట్‌ చేయవచ్చు.




ఓపెన్‌ ఆఫీస్‌ ప్రత్యేకతలు

ఇది పూర్తిగా ఉచితం. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్‌ఆఫీస్‌.ఆర్గ్ నుండి డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాంటి లైసెన్స్‌ ఫీజు చెల్లించనవసరంలేదు. వ్యక్తిగత, కార్యాలయ ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా వాడుకోవచ్చు. దీని కాపీలను ఇతరులకు పంపిణీ చేయవచ్చు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త ఓపెన్‌సోర్స్ సముదాయానికి సలహాలు పంపవచ్చు. అనేక రకాలైన
హార్డువేర్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్ అయిన మైక్రోసాఫ్ట్ విండోస్‌, మ్యాక్‌, లినక్స్, సన్‌ సోలారిస్‌ల మీద పనిచేస్తుంది. అనేక భాషలను సపోర్టు చేస్తుంది. సుమారు 40 భాషల డిక్షనరీలు, స్పెల్లింగులు మొదలైన సౌకర్యాలున్నాయి.

ఓపెన్‌ ఆఫీస్‌ ప్రస్తుతం అను ఫాంట్స్ వంటి తెలుగు ఫాంట్స్‌కు సపోర్టు చేయడంలేదు. అయితే యూనికోడ్‌ ఫాంట్స్‌ను నిక్షేపంలా వాడుకోవచ్చు. పైసా ఖర్చులేకుండా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లను ఉచితంగా డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. మరెందుకాలస్యం  http://openoffice.org ను సందర్శించి డౌన్లోడ్‌ చేసుకోవడమే తరువాయి.



2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Thanks for posting a good article . i gave a small doubt if they are giving the softwares freely how they can get money?

Unknown చెప్పారు...

~సాయి గారు,
ఇక్కడ ఫ్రీ అంటే స్వేచ్చ ఇచ్చేదిగా భావించండి.ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్లు అధినాయకత్వ(proprietary software) ధోరణిని అవలంభించవు, మీరు ఈ సాఫ్ట్వేర్ను ఇతరులకు నకలు తీసి పంచవచ్చు,సవరణలు చెయ్యవచ్చు.ఈ సంస్థలు చాలా మట్టుకు విరాళాల ద్వారా నడుస్తాయి(ధనార్జన వీటి ప్రధాన లక్ష్యం కాదు).

- ధన్యవాదాలు