‘జురాసిక్ పార్క్’ చిత్రం గుర్తుందా? అలనాడు యువతనే కాదు అన్నిరకాల ప్రేక్షకులకూ ఒక ‘కిక్’ ఇచ్చిందీ చిత్రం. దానికి కారణం అందులో వాడిన గ్రాఫిక్స్, ఆనిమేషన్‌లే. ఈ సినిమా తర్వాతే దాదాపు అన్ని చిత్రాల్లోనూ (అసరం ఉన్నా, లేకున్నా) అంతో ఇంతో గ్రాఫిక్స్ జొప్పించటం ఆరంభమైంది. అంతలా ‘సినీ’ నిర్మాణాన్నే ప్రభావితం చేసిన జురాసిక్ పార్క్ చిత్రంలోని గ్రాఫిక్స్, ఆనిమేషన్ అంతా రూపుదిద్దుకొన్నది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘లినక్స్’లోని సాఫ్ట్వేర్లతోనే..! ఆశ్చర్యంగా ఉంది కదూ! నిజం!
1991లో లినస్ టోర్వాల్డ్స్ అనే ‘ఫిన్‌లాండ్’ దేశ ప్రోగ్రామర్ రూపొందించడం, ఆ తర్వాత 12 ఏళ్ళల్లో కంప్యూటర్ రంగంలో కొత్త వివాదాలకూ, వ్యాపార అవకాశాలకూ కేంద్రబిందువైంది ‘లినక్స్’. హాబీగా, సరదాగా తయారు చేసుకొన్న ఆపరేటింగ్ సిస్టం ‘లినక్స్’. నేడు ఎందరెందరినో అలరిస్తోంది. ఐబిఎం, హెచ్‌పి, ఇంటెల్ వంటి సంస్థల అండదండలతో ఎదురులేని ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఎదిగింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా 2వేల దశకంలో వెలుగులోకి వచ్చి ప్రాచుర్యాన్ని పొందడానికి కారణాలు బోలెడు. ఆర్థికరంగ పరిస్థితితో అప్పటికే వివిధ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకు పోవడంతో ఖర్చులు తగ్గించుకొని లాభాల బాటలో పయనించాలంటే ‘ఓపెన్ సోర్స్ గతి’ అని భావించారు. దాంతోబాటు ఆపరేటింగ్ సిస్టం, సాఫ్ట్వేర్స్ వీటిపై బడ్జెట్ ఖర్చులను తగ్గించుకోవాలని వివిధ కార్యాలయాలూ, కార్పొరేట్ సంస్థలూ ‘లినక్స్’ వైపే మొగ్గు చూపనారంభిచాయి. ఇంటెల్ సంస్థ కూడా ‘లినక్స్’కు ఉన్న సత్తాను గుర్తించి దాన్ని సపోర్టు చేసే రీతిలో ప్రొఫెసర్లను తయారు చేయడం ద్వారా సపోర్టు నివ్వడంతో ‘లినక్స్’ ఎదగుదల సాధ్యమైంది. ఫెడోరా, రెడ్‌హేట్, ఓపెన్ స్యూజ్, ఉబుంటు వంటి సంస్థలు ‘లినక్స్’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నాయి. వీటిపై సమగ్రమైన డాక్యుమెంటేషన్, ఆపరేషన్స్, డౌన్‌లోడింగ్ సౌకర్యాలు ఇప్పటికీ వారివారి వెబ్ సైట్లలో లభ్యమే. ఎందుచేతనో రెడ్‌హేట్ సంస్థ ఇటీవల ధోరణి మార్చి కొంత వ్యాపారాత్మక వ్యూహాన్ని అనుసరించడంవల్ల ‘ఫ్రీ’ సర్వీసులు పరిమితమైపోయాయి. నేడు సర్వత్రా ఉబుంటు లినక్స్ బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. లినక్స్‌మీద ఫోరమ్స్‌లో కూడా చర్చించుకున్నారంతా. లినక్స్‌కు అలనాడు అందర్నీ అలరించిన యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం మూలమనే విషయాన్ని గమనించాలి! యునిక్స్ అలనాడు ఆసియా దేశాల్లో, ముఖ్యంగా ఇండియాలో బాగా వాడేవారు కూడా. మెయిన్ ఫ్రేమ్‌లలో కూడా యునిక్స్, దాని రూపాంతరాలూ కొన్ని లభ్యమయ్యేవి. చక్కగా పనిచేయడం, వైరస్‌ల గోల లేకుండా ఉండటం, ఎప్పటిపకప్పడు తాజా అప్‌డేట్స్ నెట్‌లో దొరుకుతుండటం, అన్నిటినీ మించి సమస్యలు తక్కువగా ఉంటూ, ఉచితంగా లభించడం ‘లినక్స్’ విజయ రహస్యం.
వనరు: ఆంధ్రభూమి
వనరు: ఆంధ్రభూమి
లినక్స్ మీద మరింత సమాచారం కోసం ఈ లంకెలను దర్శించండి.