15, మే 2012, మంగళవారం

గింప్ 2.8 విడుదలయింది - ప్రయత్నించారా?

గింప్ - గ్నూ ఇమేజ్ మానిపులేషన్ ప్రోగ్రాముకు సంక్షిప్త రూపం. ఇది బొమ్మలను, చిత్రాలను సరిదిద్దేందుకు వాడవచ్చు. ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది, గ్నోమ్‌లో అప్రమేయంగా వస్తుంది.

దాదాపు మూడున్నరేళ్ళ తరువాత వచ్చిన ఈ కొత్త రూపాంతరంలో ఎన్నో విశేషాలు కలవు.

గింప్ గురించి కొంత తెలుసుకుందాం : గింప్ విండోస్, మాక్ మరియు లినక్స్ అన్నింటా వాడగలము. ఇది గుణవిశేషాల్లో అడోబ్ ఫోటోషాప్‌ను పోలి ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుండీ ఖరీదయిన అడోబ్ ఉత్పాదనలకు ఉచిత ప్రత్యామ్నాయంగా గింప్‍ను వాడుకరులు ఆదరించారు.

ఈ నెల మొదటి వారంలో గింప్ యొక్క సరికొత్త రూపాంతరం(2.8) విడుదలయింది. ఈ కొత్త వెర్షన్‌లో ఎన్నో కొత్త విశేషాలున్నాయి. సరికొత్త అంతరవర్తిని ఇందులో ముఖ్యమయిన విశేషం. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోదగ్గ మార్పు ఒకే కిటికీలో అన్ని సమకూరి ఉండడం. ఇదివరకు వచ్చిన అన్ని గింప్ వెర్షన్‍‌లలోనూ పరికరాలన్నీ ఒక కిటికీలో, మార్పులు పొందుతున్న ముఖ్య చిత్రం ఒక కిటికీలో, ఇంకా చిత్రం యొక్క అంశాలను చూపే పనిముట్ట్లు ఒక కిటికీలో ఉండేవి; ఇప్పుడిక మూడింటినీ ఒకే కిటికీలో మార్చుకొనవచ్చు లేదా మునుపటిలా కూడా వాడవచ్చు. ఈ కొత్త అంతరవర్తినిలో ఒకటి కన్నా ఎక్కువ బొమ్మలతో పని చేస్తుంటే, ఒక్కోటి ఒక్కో ట్యాబులో తెరుచుకుంటుంది. మునుపటిలా ఒక్కోటి ఒక్కో కిటికోలోలా ఉండదిక!

మరికొన్ని కొత్త విషయాలు:

  • ఇక పై బొమ్మ అప్రమేయంగా .xcf గా భద్రపరుచబడుతుంది, మిగతా పొడిగింతలు/ఆకృతుల కోసం Export వాడాలి.
  • పనిముట్ట్లు, పరికరాల కోసం ఎక్కువ జాగా ఏర్పడింది, సౌకర్యం పెరిగింది.
  • పొరలను ఇంతకు ముందు, అయితే యథా ప్రకారం ఉంచవలసి వచ్చేది లేదా, ఒక దానిలో ఒకటి మెర్జ్ చెయ్యవలసి వచ్చేది, ఇప్పుడు పొరలను ఒక సమూహంగా పేర్కొని, మరింత సులభంగా పనులు చేయవచ్చు.
  • పాథ్యం ఇంతకు మునుపు వేరే డైలాగ్‌లో రాసి, ఆ పై కాన్వాస్ పై చూసే వాళ్ళం, ఇప్పుడు నేరుగా కాన్వాస్ పై పాఠ్యం ఉంటుంది. 
  • ఇక పై కొత్త కీబోర్డు అడ్డదారులు కూడా వాడవచ్చు, Ctrl+E Export కోసం, Ctrl+J బొమ్మను కాన్వాస్ పై కుచించటం కోసం
  • కుంచెల వాడకం కూడా సులభంగా ఉంది. కుంచెలను ఇప్పుడు తిప్పవచ్చు!
పైవి నేను నాకుగా కనుగొన్న మార్పులు. ఇంకా ఎన్నో కొత్త విశేషాలున్నాయి.

గింప్ ఎక్కడ దొరుకుతుంది? 

విండోస్ మరియు మ్యాక్‌లకు ఇంకా స్థిర రూపాంతరం అందుబాటులో లేదు, లినక్స్ వాడుకరులకు ఇది అందుబాటులో ఉంది.

నాకయితే గింప్ కొత్త రూపం పిచ్చ పిచ్చగా నచ్చింది. 

మరి మీ మాటేంటి..?


కామెంట్‌లు లేవు: