19, ఆగస్టు 2014, మంగళవారం

ఆగస్టు 21 నుండి .भारत డొమెయిన్ పేరు లభ్యం


అంతర్జాలంలో ప్రతి జాలస్థలినీ ఒక చిరునామా ద్వారా గుర్తిస్తాం. ఉదాహరణకు etelugu.org, ఇక్కడ etelugu  అనేది జాలస్థలి పేరయితే, org అనేది డొమెయిన్ పేరు. ఒక వెబ్సైటు నడపడానికి, మొట్టమొదట మనం చేసే పని ఈ జాలస్థలి పేరునూ, సరియయిన డొమెయిన్ నేం తో పాటూ నమోదు చేసుకోవటం. ఇందుకు కొంత రుసుము చెల్లిస్తాం కూడా. blogspot.com, wordpress.com లాంటి సంస్థలు ఉచితంగా మనకు సబ్డొమెయిన్ ను ఇస్తున్నాయి కూడా!
అయితే ఈ డొమెయిన్ పేరుకు కొన్ని నిబంధనలుండేవి. మొదట్లో కనీసం మూడక్షరాలు గా ఉండాలనీ, తరువాత మూడు లేదా రెండు సరిపోతాయి అనీ, ఆపైన మూడు కన్నా ఎక్కువ ఉండొచ్చనీనూ. అయితే కొద్ది రోజుల క్రితం ఈ డొమెయిన్ పేరు ఆంగ్లంలోనే కాక లాటిన్ కుటుంబంలోని ఇతర భాషలలోనూ పనిచేసేలా చేసారు. (జాలస్థలి పేరుకి ఏ భాషలోనైనా ఉండే సౌలభ్యం ఉంది - ఉదా: వీవెన్.com {ఇప్పుడు పని చేయకపోవచ్చు}). అయితే భారతీయ భాషలలో కూడా ఈ డొమెయిన్ పేరు త్వరలో రానుంది. ప్రస్తుతానికి .in అని వాడుతున్నామే, అలా కాక .भारत అని జాలస్థలుల చిరునామా చివర ఉంటుందనమాట. ఈ సదుపాయం ఆగస్టు 21 మొదలు అందుబాటులోకి రానుంది.
90 రోజుల "సూర్యోదయ" కాలంలో ఈ సదుపాయం దేవనాగరిలోని హిందీ, మరాఠీ, బోడో, డోగ్రీ మొ॥ భాషల జాలస్థలులు వాడేవారు ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఆ తరువాత సాధారణ వెబ్సైటుల వారికి కూడా ఇది వాడుకునే అవకాశం వస్తుంది.
ఈ మొత్తం కార్యక్రమాన్ని నిక్సి మరియు సీడాక్ వారు నిర్వహిస్తున్నారు.
త్వరలో తెలుగు మరియు ఇతర భారతీయ భాష లిపులలో కూడా ఈ సదుపాయం రానున్నది.      


18, ఆగస్టు 2014, సోమవారం

'గ్నోమ్-సుషి' దస్త్ర మునుజూపకం

గ్నోమ్ అనువర్తనాలలో నాకు బాగా నచ్చిన అనువర్తనాలలో  'గ్నోమ్-సుషి' కూడా ఒకటి. ఈ ప్రయోజనకారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. గ్నోమ్-సుషి అనువర్తనం వ్యవస్థలోని వివిధ రకాల దస్త్రాలను మునుజూపుతుంది. అంటే మీ కంప్యూటరులో ఉండే వివిధ దస్త్రాలను చాలా సులభంగా తెరచి అందులోని అంశాలను/ప్రాథమిక సమాచారాన్ని చూడవచ్చు. ఇది వ్యవస్థలో ఉన్న వివిధ లైబ్రరీలను వాడుకుని శ్రవ్యక(ఆడియో), దృశ్యక(వీడియో), పాఠ్య, పత్ర దస్త్రాలను మును చూపిస్తుంది.

గ్నోమ్ సుషిలో వీడియో ప్రదర్శన
పరిమితులు: దస్త్రాలను వీక్షిస్తున్నప్పుడు అవి చూడటానికి మాత్రమే తప్ప నకలుచేయుటకు లేదా మరే ఇతర పనులు చేపట్టడానికి అనుమతించదు. అలాగే సుషిని వాడుతున్నంతసేపూ దస్త్ర విహారకం తెరచేవుండాలి.
 
ఈ అనువర్తనాన్ని మీ లినక్స్ వ్యవస్థలో స్థాపించడానికి
డెబియన్‌లో అయితే
#apt-get install gnome-sushi

ఉబుంటులో అయితే
$sudo apt-get install gnome-sushi

ఫెడోరాలో అయితే
$su yum install gnome-sushi

వాడటం ఎలా:
ముందుగా నాటిలస్ (దస్త్రాలను తెరవడానికి, చూడటానికి, నకలు చేయడానికి వాడే అనువర్తనం) దస్త్ర విహారకాన్ని తెరచి ఏదైనా దస్త్రాన్ని(.txt,pdf,odt,avi,wmv,mp4,mp3,jpeg,png...వంటివి) ఎంపికచేసి 'space' మీటను నొక్కండి. మీరు ఎంచుకున్న దస్త్రం దృశ్యకం(వీడియో) అయితే ప్రదర్శించబడుతుంది, శ్రవ్యకం(ఆడియో) అయితే వినిపిస్తుంది. ఒకవేళ PDF దస్త్రం అయితే చదువుటకు అనుమతిస్తుంది. తెరచిన దస్త్రాన్ని మూసివేయుటకు space లేదా esc మీటలను వాడవచ్చు. పూర్తిస్థాయిలో(నిండుతెరలో) దస్త్రాన్ని చూడటానికి F లేదా Ctrl+F వాడవచ్చును.

గమనిక: ఈ అనువర్తనం కేవలం గ్నోమ్ 3‌.2 లేదా ఆ తరువాత రూపాంతరాల పై మాత్రమే పనిచేస్తుంది.

పైన వాడిన పదజాలం
1. Applications - అనువర్తనాలు
2. File Previewer - దస్త్ర మునుజూపకం
3. File Browser - దస్త్ర విహారకం - దస్త్రాలు తెరవడానికి, చూడటానికి, నకలు చేయడానికి, తరలించడానికి ఉపయోగించే అనువర్తనం
4. Install - స్థాపించు

పై పదాలకు అచ్చ తెలుగు పదాలు/ఇంకా సులభమైన పదాలు మీకు ఏమైనా తడితే వ్యాఖ్య రూపంలో ఇక్కడ చేర్చండి