వీడియోల్యాన్ ఒక స్వచ్ఛంద సంస్థ, విరాలాలు మరియు స్వచ్ఛంద కార్యకర్తలచే నడుపబడుతున్నది. గత కొద్ది కాలంగా వియల్సీ నుండి ఎటువంటి నవీకరణ లేదు అందుకు కారణం వీయల్సీ సరికొత్త రూపాంతరంపై దృష్టిపెట్టింది. వందల కొలది ఉన్న లోపాలను స్థిరపరుచుటకు 160 మంది స్వచ్ఛంద కార్యకర్తలు కృషిచేసారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదములు.
ప్రపంచ వ్యాప్తంగా (కేవలం సోర్సుపోర్జు నుండే 483,309,301 దింపుకున్నారు) అత్యధికంగా దింపుకున్న మధ్యమ ప్రదర్శకముగా వియల్సీకి రికార్డు ఉన్నది.
వియల్సీ 2.0 సరికొత్త హంగులతో మరియు అనేక విశిష్టతలతో మన ముందుకు వచ్చింది అవేంటో చూద్దాం.
సరికొత్త అంతరవర్తి
(మ్యాక్ నిర్వహణ వ్యవస్థలో వియల్సీ 2.0)
ఈసారి మ్యాక్ నిర్వహణ వ్యవస్థ కోసం కాస్త ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్ ఆపరేటింగ్ వ్యవస్థలో డివిడి ప్లేబ్యాక్ కొరకు సరైన సాఫ్టువేర్ లేనట్టుంది. మ్యాక్ ఓయస్ కొరకు రూపొందించిన అంతరవర్తి కూడా చాలా బాగా రూపొందించారు.
విశిష్టతలు:
- RAR సంగ్రహాలలోవున్న బహుల మాధ్యమ దస్త్రాలను ప్రదర్శించగలదు
- వీడియో అవుట్‌పుట్ రీతులను, బ్లూ-రే మాధ్యమ మద్ధతును మెరుగుపరిచారు
- ఆండ్రాయిడ్, ఐఓయస్, OS/2 మరియు విండోస్ 64 లకు సాఫ్టువేరును రూపొందించారు
- సరికొత్త ఆడియో, వీడియో ఫిల్టర్లు
- HTTP లైవ్ స్ట్రీమింగ్ ప్లేబ్యాక్ మద్ధతు
- పల్స్ ఆడియో ఇన్‌పుట్ మద్ధతు
- మట్రోస్క (mkv) డీమక్సర్ అభివృద్ధి
- థియొరా మరియు వోర్బిస్ కొరకు రియల్ టైమ్ ట్రాన్సుపోర్టు ప్రోటోకాల్ (RTP) నందు మద్ధతు
గత రూపాంతరానికి మరియు ప్రస్తుత రూపాంతరానికి సంబంధించిన మార్పులచిట్టాను ఇక్కడ చూడవచ్చు.
తెలుగు కూడా ఉన్నది...
(డెబియన్ లినక్స్ నందు వియల్సీ మాధ్యమ ప్రదర్శకం తెలుగు తెరపట్టు)
సరికొత్త వియల్సీ మాధ్యమ ప్రదర్శకం 2.0 టూఫ్లవర్ రూపాంతరంలో తెలుగు కూడా అందుబాటులో ఉన్నది. కావున ఆసక్తి ఉన్నవారు వాడి మీ అభిప్రాయాలను పంచుకోవలసినదిగా మనవి. వీయల్సీని అనువదించుటలో తోడ్పడిన తెలుగుపదం గుంపుకు ధన్యవాదములు.
ఉబుంటు/డెబియన్ పంపణీలలో వియల్సీ 2.0 స్థాపించడం ఎలా..?
ఉబుంటు (12.04) మరియు డెబియన్ (SID)ల భాండాగారంలో ఇప్పటికే చేర్చారు కాబట్టి మీ వ్యవస్థను నవీకరిస్తే సరిపోతుంది.
ఉబుంటు 11.10 వాడుకరులైతే, క్రింద పేర్కొన్న పర్సనల్ ప్యాకేజీ ఆర్చీవ్ లను మీ సాఫ్టువేర్ మూలాలకి జతచేయండి.
sudo add-apt-repository ppa:n-muench/vlc
sudo apt-get update && sudo apt-get install vlc
పైన తెరపట్టులోని చిత్రం బ్లెండరు ద్వారా రూపొందించిన సింటెల్ చిత్రంలోనిది.