27, జూన్ 2012, బుధవారం

ఉబుంటు 12.04 వేడుక విశేషాలు


కెనానికల్ నుండి వచ్చిన రితేష్ తన సహచరుడితో రానే వచ్చారు. కానీ అప్పటికింకా ప్రొజెక్టర్ వేదిక నందు సిద్ధంగాలేదు. వేడుకకు వచ్చేవారిని స్వాగతం పలుకుటలో, వేదిక వివరాలు అందించుటలో తీరికలేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను. ఇంతలో ప్రణవ్ మరియు వీవెన్ ఒకరి తరువాత ఒకరు వచ్చారు. వారిని స్వాగతించి వేదిక వద్దకు తీసుకువెళ్ళాను. మునుపటి రోజు కరాచీ బేకరీ వద్ద ఆర్డరిచ్చిన కేకుతో పవిత్రన్ శాఖమూరి, వికీమీడియా ప్రతినిధి అయిన శ్రీకాంత్‌తో కలసి HIT చేరుకున్నారు. అక్కడ విశేషమేమిటంటే కేకు పై ఉన్న ప్యాంగోలిన్ బొమ్మని చూచిన ఇద్దరు యువతులు ఆసక్తితో దాని గురించి అడిగి తెలుసుకున్నారట అంతేకాకుండా కరాచీ బేకరీ వారు కేకు ఛాయాచిత్రాన్ని తీసుకున్న తరవాతే చేతికిచ్చారట, బహుశా వారి చిత్రశాలలో చేరుస్తారేమో. ఆ తరువాత పవిత్రన్, అతుల్ జా మరియు క్రిష్‌లకు దిశానిర్దేశం చేయగా వారే వచ్చారు, అప్పటికే గది నిండినది.

మునుపటి రోజున కలిసిన పవిత్రన్ మిత్రుడైన అనివార్ తీరకలేని ప్రణాళికలోనూ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషాన్నిచ్చింది అతడు మంచి మాటకారి. నేను నా ల్యాపుటాపుని ప్రోజక్టురుకి అనుసంధానించుటకు కొంతసేపు కుస్తీ పట్టాను కానీ ప్రయోజనం లేదు, ఆ పిమ్మట కష్యప్ గారు వారి ల్యాపుటాపుతో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఇక పవిత్రన్ రంగ ప్రవేశం చేసి తన వెంటబెట్టుకొచ్చిన శ్రీకాంత్ గారి ల్యాపుటాపుని విజయంతంగా అనుసంధానించాడు. గ్రాఫిక్స్ డ్రైవర్ సమస్య ఉన్నప్పటికీ సమర్పణకు ఎటువంటి ఆటంకం కలుగులేదులేండి. 

ఇంతలో రితేష్ గారు తన గురించి పరిచయం చేసుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉబుంటు, లినక్స్ వంటివి ముందు కటువుగా ఉన్నట్టు అనిపిస్తుందని కానీ రాను రాను అవే అలవాటవుతాయని, అంతే తప్ప ఒక్క రోజులో నచ్చేవి, వచ్చేవి కాదని విండోస్ కూడా మొదట్లో అలానే అనిసిస్తుందని  పేర్కొన్నారు. అలా అంటే నాకు జులాయి సినిమాలోని డైలాగు గుర్తు వచ్చింది. "భయమేస్తుందని దెయ్యాల సినిమాలు చూడకుండా ఉంటామా (కావాలని పట్టుబట్టి మరీ చూస్తాము), ఉబుంటు కూడా అంతే అని అనుకున్నాను". ఉబుంటు కూడా విండోస్ వలె ఒక నిర్వాహక వ్యవస్థ అని ఉబుంటూని కూడా మీరు మీ నిర్వాహక వ్యవస్థగా స్వేచ్ఛగా వాడుకోవచ్చని తెలిపారు.
వారి ప్రసంగం ముగిసిన తరువాత సభికులు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. నా వరకూ నేను తడబడుతూ ఇటీవలే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ మద్ధతు ఉపసంహరించుకోవడం వలన ఫైర్‌ఫాక్స్ లోని ఫ్లాష్ మద్ధతు సరిగా ఉండదు కాబట్టి తదుపరి సంస్కరణలో ఏ విహారిణి ఏమి ఉంచబోతున్నారు అని అడగగా వారు దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఫైర్‌ఫాక్స్ కూడా పెప్పర్ ఎపిఐ చొప్పింతని విహారిణిలో చేర్చే విషయంపై పనిచేస్తుందని, అలాకాకుంటే క్రోమియమ్ విహారిణి వినియోగించబడుతుందని తెలిపారు. అలాగే ఉబుంటు యునిటీ గురించి అడగగా, యునిటీని వాడుకరులు ఆదరిస్తున్నారనీ, మంచి స్పందన వస్తుందని తెలిపారు. 
ఇక అసలు కార్యక్రమం అదేనండీ ఉబుంటు కేకు కోయాలని నిర్ణయించారు కానీ అంతకంటే ముందు అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆ పిమ్మట ఛాయాచిత్రాలు తీసే కార్యక్రమం ఆపై కేకు కోసే కార్యక్రమం ఇంతకూ కేకు ఎవరూ కోయాలి అని అంటుండగానే అతిపిన్న వయస్కుడైన ఉబుంటు వాడుకరి(14 సం)చే కేకు కోయించాలని ఏకగ్రీవంగా అరిచారు.
అంతకుముందే అతుల్ ఝా ఉబుంటు స్టిక్కర్లను బల్లపై ఉంచాడు. కేకుతో పాటుగా స్టిక్కర్లను కూడా వచ్చినవారందరూ పంచుకున్నారు.


ఆ తరువాత నేను తెలుగు డెస్కుటాపు గురించి మాట్లాడటం జరిగింది. అందులో ఉబుంటు ప్రత్యేకతలు, తెలుగుపదం, లాంచ్పాడ్ మరియు గణాంకాలు, లక్షాల గురించి నాకు తోచిన భాషలో ప్రస్తావించాను. పవిత్రన్, అనివార్ మరియు కష్యప్ మధ్యలో కల్పించుకుని కాస్త ఆసక్తికరంగా మలిచారు.


మొజిల్లా కౌన్సిల్ మెంబర్ అయిన వినీల్ రెడ్డి ఫైర్‌ఫాక్స్ 13 లోని ప్రత్యేకతలను వివరించారు. అందులో వెబ్‌సైట్ ట్రాకింగ్ ముఖ్యమైనది. వెబ్‌సైటులు మిమ్మల్ని ట్రాక్ చెయ్యడం ఇష్టం లేకపోతే ఈ ఐచ్ఛికం ద్వారా నిరోధించవచ్చు. అలాగే వివిధ మొజిల్లా పరియోజనలను గురించి తెలిపారు.


ఓపెన్‌స్టాక్‌పై మాట్లడుకై ప్రత్యేకించి బెంగుళూరు నుండి విచ్చేసిన అతుల్ ఝా, ఒపెన్‌స్టాక్ ఒక క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్టువేరని, అది యాజమాన్య క్లౌడ్ కంప్యూటింగు సాఫ్టువేర్లకు ప్రత్యామ్నామయమని తెలిపారు. ఓపెన్‌స్టాక్ ప్రత్యేకతలను, పనితీరును చక్కనైన పటాలతో వివరించారు. ఒపెన్‌స్టాక్‌కు ప్రజాదరణ క్రమక్రమంగా పెరుగుతుందని కూడా తెలిపారు.
క్రిష్ పప్పెట్ గురించి బోర్డుపై పప్పెట్ సెర్వర్స్ మరియు క్లయింట్లను గీస్తూ వివరించారు. పప్పెట్‌పై మంచి మార్కెట్ ఉన్నదనీ, ఆకర్షనీయమైన జీతాలభ్యాలు ఉన్నాయనీ పేర్కొన్నారు. ఈ కోర్సు విదేశాల్లో చాలా ఖరీదయిందనీ, ప్రస్తుతం ఇండియాలో ఈ కోర్సుని పరిమిత సభ్యులకే అతి తక్కువ ధరకే అందిస్తున్నట్లు చెప్పారు. అతికష్టం మీద అందరిని ఒప్పించి ఈ కార్యక్రమాన్ని ఆసియాలో జరుపబోతున్నట్లు తెలిపారు. 
చివరిగా వికీమీడియా ప్రతినిధి అయిన శ్రీకాంత్ మాట్లాడారు. ఇంతలో అనివార్ బస్సుకు వేళవడంతో నేను లక్డీకపూల్ వద్ద దించి తిరిగి వేదిక స్థలానికి చేరుకున్నాను. ఇంతలో అంతా అయిపోయింది ఎందుకంటే అసలు మజా అప్పుడే ఉంటుంది అంతా అయిపోయినపుడు జరిగే చర్చలు చాలా బాగుంటుంది, కాని నేను ఆ ఆనందాన్ని మిస్సయ్యాను. అందరూ వెళ్లిపోతున్నారు. నా బ్యాగు సర్దుకుని ఇక నేను బయటకు చేరుకున్నాను.
బయటకు వచ్చిన తరువాత పవిత్రన్ శ్రీకాంత్ ఒక బైకుపై, రితేష్‌ తన బైకుపై ముందుగా బయలుదేరారు. నేను విపుల్, అతుల్ ఝా ముగ్గురమూ కలసి క్రిష్ కారులో మెల్లగా ప్యారడైజ్ వెళ్లి ఫుడ్ తీసుకుని నేరుగా మిలటరీ జోన్‌లోని రితేష్ గారి కుటుంబీకుల ఇంటికి వెళ్లాము. అపుడు ఇంటిలో ఎవరూలేరనుకోండి. అక్కడ మరలా డిస్కషన్ షురూ చేసినాము. మధ్యలో రహ్మాన్ గారు ఫోను చేసి అందరితోనూ స్పీకరులో మాట్లాడారు. తరువాత రాత్రికి మేము ముగ్గురము అక్కడే బస చేసి తరువాత రోజు ఇంటికి చేరుకున్నాము.

కొసమెరుపేంటంటే ప్రణవ్ అయినవోలు ఒక్కరే ఉబుంటు 12.04 సీడీని పొందగలిగారు :p

15, జూన్ 2012, శుక్రవారం

స్కైప్ 4.0 లినక్స్ రూపాంతరం విడుదలైంది

ప్రముఖ యాజమాన్య VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) కక్షిదారు(క్లయింటు) అయిన స్కైపును మైక్రోసాఫ్ట్ సంస్థ కొనుగోలు చేసిన తరువాత లినక్సుకు మద్ధతు ఉండదేమో అని అందరూ భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. దాదాపు కొనుగోలు చేసిన ఏడాది తరువాత సరికొత్త రూపాంతరాన్ని విడుదల చేసింది. స్కైప్ 2.2 తరువాత నేరుగా స్కైప్ 4.0 విడుదలైంది. ఈ విడుదల యొక్క సంకేతనామం "ఫోర్ రూమ్స్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్". సుదీర్ఘకాలం తరువాత విడుదలయిన ఈ రూపాంతరంలో విశిష్టతలేమిటో చూద్దాం.

ఈ రూపాంతరంలో ప్రత్యేకతలు
  •  ఆడియో, వీడియో నాణ్యతను మెరుగుపరిచారు.
  • అదనపు వెబ్ క్యామ్ మద్ధతు
  • చాట్ చరిత్ర నింపుట మరింత వేగం
  • క్రాష్ లేదా ఫ్రీజ్ అయ్యే అవకాశాలు తక్కువ
  • సంభాషణల సమకాలీకరణను మెరుగుపరిచారు
  • సరికొత్త స్థితి ప్రతీకలు మరియు హావభావాల చిహ్నాలు
  • ట్యాబ్స్ ద్వారా సంభాషణ
  • సంభాషణ మరియు కాల్ వీక్షణలలో మార్పులు
గమనిక: మీ వ్యవస్థలో స్కైప్ 2.2 స్థాపించబడివుంటే ప్యాకేజీల సంఘర్షణ తలెత్తకుండా ఉండాలంటే ముందుగా పాత ప్యాకేజీని తొలగించి తరువాత సరికొత్త ప్యాకేజీని స్థాపించుకోండి

ప్రస్తుతం డెబియన్, ఉబుంటు మరియు ఫెడోరా, ఓపెన్‌స్యూజ్ పంపకాలకు మాత్రమే ప్యాకేజీలు అందుబాటులోవున్నాయి. ఇతర పంపకాల వాడుతున్న వారు కనీసం కంపైల్ చేసుకుని స్థాపించుకుందామనుకుంటే, సోర్సుకోడు అందుబాటులో లేదు.
 

13, జూన్ 2012, బుధవారం

గ్నోమ్ షెల్‌లో వ్యవస్థను మూసివేయడం ఎలా



సాధారణంగా గ్నోమ్‌లో వ్యవస్థను మూసివేయుటకు నేరుగా మూసివేసే (ష్యట్‌డౌన్) బటన్ ఉండేది. కానీ ఆ తరువాత విడుదలైన గ్నోమ్ షెల్‌లో అటువంటి బటన్ ఏమీ కనిపించదు. కేవలం నిష్క్రమించు (లాగౌట్) మరియు తాత్కాలికంగా మూసివేయి (సస్పెండ్) ఐచ్ఛికాలు మాత్రమే కనిపిస్తాయి. గ్నోమ్ షెల్ వాడే చాలా మందికి తమ వ్యవస్థను నేరుగా మూసివేయడం తెలియక ముందుగా లాగౌట్ అయ్యి లాగిన్ మెనూ నుండి ష్యట్‌డౌన్ అవుతారు. అసలు విషయం ఏమిటంటే మీరు ఆల్ట్ బటన్ ఒత్తి పట్టుకుంటే సస్పెండ్ ఐచ్ఛికం కాస్తా విద్యుత్ ఆపు(పవర్ ఆఫ్)గా మారుతుంది.


ప్రతీసారీ ఆల్ట్ నొక్కనవసరం లేకుండా ఈ ఐచ్ఛికాన్ని గ్నోమ్ షెల్ పొడిగింత ద్వారా మార్చుకోవచ్చు. ఈ పొడిగింతను స్థాపించుకోండి. గ్నోమ్ షెల్ పొడిగింతల గురించి తెలుసుకోవాలంటే దిగువ ఇవ్వబడిన లంకెను సందర్శించండి.
గ్నోమ్ షెల్ పొడిగింతలు


గ్నోమ్ తదుపరి విడుదలయిన 3.6లో మూసివేత ఐచ్ఛికాన్ని నేరుగా ఇవ్వనున్నట్లు సమాచారం. నిజానికి ఈ టపాను ఏడాది క్రిందటే పోస్టు చేయవలసింది తీరికలేకపోవడం వలన ఆలస్యమైంది.

8, జూన్ 2012, శుక్రవారం

ఆడియన్స్ వీడియో ప్లేయర్


టోటెమ్ లేదా వీయల్సీ మాధ్యమ ప్రదర్శకాలతో విసిగిపోయారా....సరికొత్త వీడియో ప్లేయర్‌ని కోరుకుంటున్నారా..? అయితే మీ కోసం సరికొత్త ఆధునిక దృశ్యక ప్రదర్శకం వచ్చేసింది. అదే ఆడియెన్స్ దృశ్య ప్రదర్శకం. సరికొత్త రూపంతో, అలరించే రీతిలో ఆడియెన్స్ ప్లేయర్‌ని రూపొందించారు. ఇది వాలా ప్రోగ్రమింగ్ భాషలో వ్రాయబడింది. క్లట్టర్ ఆధారిత వాడుకరి అంతరవర్తితో ఉంటుంది. ఈ ప్రదర్శకంలోని నియంత్రణలు అన్నీ అపారదర్శకతతో మృదువుగా ఉంటాయి. దృశ్యకంలో ముందుకు కొనసాగుటకు సీక్‌బార్‌పై మౌసు సూచికను ఉంచినట్లయితే ఆ స్థానంలో ఉన్న దృశ్యాన్ని చిరుచిత్రంగా చూపుతుంది.



ఈ ప్రదర్శకం ఇంకా ప్రయోగదశలోనే ఉన్నది అయినప్పటికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందనటంలో సందేహంలేదు.
ఇందులో ఎటువంటి శబ్ద నియంత్రకం లేదు, వ్యవస్థ శబ్దస్థాయి ఎంతవుంటే అంతే శబ్దం వస్తుంది.


ఉబుంటు వాడుకరులు
sudo add-apt-repository ppa:audience-members/ppa
sudo apt-get update

sudo apt-get install audience



ఇతర పంపిణీలలో స్థాపించుటకు ఇక్కడి నుండి మూలాన్ని దింపుకుని, సంకలనం చేసుకోండి.

7, జూన్ 2012, గురువారం

లినక్స్ మింట్ డెబియన్ ఎడిషన్

లినక్స వాడదామనుకుంటున్నవారు లినక్స్ మింట్‌తో ప్రారంభించడం మేలు, ఎందుకుంటే ఇది మరింత అనురూపిత(కస్టమైజ్డ్) లినక్స్ పంపకం. లినక్స్ మింట్ ప్రాథమికంగా ఉబుంటు ఆధారితంగా నిర్మించారు. ఆ తరువాత 2010 లో డెబియన్ సంకలనాన్ని కూడా రూపొందించారు. దీనిని లినక్స్ మింట్ డెబియన్ ఎడిషన్ అని నామకరణం చేసారు, క్లుప్తంగా ఎల్ఎమ్‌డియి అని పిలుస్తారు. ఇది 32 మరియు 64 బిట్లలో, గ్నోమ్ మరియు ఎక్స్ఎఫ్‌సియి అంతరవర్తులలో లభిస్తుంది.




డెబియన్ టెస్టింగ్ మరియు సిడ్ వంటి రూపాంతరాలను ప్రయత్నించలేకపోతున్నాము అని బాధపడేవారు లినక్స్ మింట్ డెబియన్ సంకలనాన్ని నిశ్చింతగా వాడవచ్చు.

లినక్స్ మింట్ డెబియన్ ఎడిషన్ విశిష్టతలు
* ఇందులో ఎటువంటి కొడెక్‌లను స్థాపించాల్సిన అవసరం ఉండదు.
* సినెమెన్ వాడుకరి అంతరవర్తి
* డెబియన్ టెస్టింగు కోడు ద్వారా నిర్మించబడుతుంది
* మరింత వేగమైనది
* వ్యవస్థను మరలా మరలా స్థాపించాల్సిన అవసరముండదు

ప్రతికూల అంశాలు
  • డెబియన్ చెప్పుదగిన రీతిలో వాడుకరికి సన్నిహితంగా ఉండదు. 
  • ఇది స్థిరమైన రూపాంతరం కాదు సరికొత్త ప్యాకేజీలలో లోపాలు ఉంటే అవి కొన్ని సార్లు విఫలమవ్వవచ్చు, అందువలన మీకు ఆప్టిట్యూడ్, డిపికెజి మరియు లినక్స్ పై లోతైన అవగాహన ఉండితీరాలి. అయినా పెద్ద సమస్య ఉండదనుకోండి ఎందుకంటే లోపాలను స్థిరపరిచే ప్యాచ్‌లను కూడా వేగంగా అందిస్తారు.

సరికొత్త లినక్స్ మింట్ డెబియన్ ఎడిషన్ ఏప్రిల్ 24న విడుదలైంది. ఈ విడుదలను క్రింది పేర్కొన్న లంకెకు వెళ్లి దింపుకోవచ్చు. లైవ్ డీవీడీని ప్రయత్నించాలనుకుంటే వాడుకరిపేరు(username) వద్ద mint అని టంకించి ఎంటర్ నొక్కండి.







6, జూన్ 2012, బుధవారం

ఫెడోరా 17 బీఫీ మిరాకిల్


గత నెల 29 న ఫెడోరా 17 బీఫీ మిరాకిల్ విడుదలైంది. ఇందులో గ్నోమ్ 3.4 స్థిర రూపాంతరం అప్రమేయ డెస్కుటాప్ అంతరవర్తిగా ఉంటుంది. ఫెడోరా వివిధ రూపాలలో లభిస్తున్నది, వాటిలో ఆటలకు, భద్రతకు, రూపకల్పనకు మరియు వైజ్ఞానిక రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. ఫెడోరాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకొనుటకు ఫెడోరా వెబ్‌సైటును తెలుగులో సందర్శించండి.


విశిష్టతలు
  1. గ్నోమ్ 3.4
  2. గింప్ 2.8
  3. గ్నోమ్ షెల్ రెండరింగు
  4. లోహిత్ యూనీకోడ్ 6.0
  5. జావా 7



ఫెడోరా స్థాపించిన తరువాత చేయాల్సిన పనులు
న్యాయపరమైన, తత్వపరమైన కారణాల వలన ఆంక్షలు ఉన్న మాధ్యమ కొడెక్లు మరియు యాజమాన్య సాఫ్టువేరులకు ఉబుంటు మరియు లినక్స్ మింట్ వలె ఫెడోరా అధికారికంగా ఎటువంటి మద్ధతు అందించుటలేదు. మరివాటినెలా స్థాపించాలి..?


ఆటోప్లస్(ఫెడోరాప్లస్) అనువర్తనాన్ని స్థాపించండి.
ఈ అనువర్తనం ఫెడోరా భాండాగారంలో ఉండదు, అందువలన ఈ ప్యాకేజీని దింపుకుని స్థాపించుకోవాలి. అందుకని క్రింది ఆదేశాన్ని వాడండి.
su -c 'yum -y --nogpgcheck install http://dnmouse.org/autoplus-1.4-5.noarch.rpm'

మానవీయంగా స్థాపించుటకు .rpm ప్యాకేజీని ఇక్కడి నుండి దింపుకోండి.


ఆటోప్లస్ అనువర్తనాన్ని ప్రారంభించుటకు Activities->applications->system tools->autoplus



ఇప్పుడు మీకు కావలసిన అనువర్తనాలను మరియు కొడెక్లను ఎంపికచేసి స్థాపించుకోండి.
ఉబుంటు లేదా లినక్స్ మింట్‌లో వలె ఫెడోరాలో సాఫ్టువేర్ సెంటర్ ఉండదు అందుకు గ్నోమ్ ప్యాకేజీ కిట్ అనువర్తనం ఉపయోగించాలి. ఈ అనువర్తనం ద్వారా సాఫ్టువేర్లను వెతికి స్థాపించుకోవచ్చు.


గ్రాఫిక్స్ డ్రైవర్
nVidia మరియు ati catalyst వంటి గ్రాఫిక్స్ డ్రైవర్ల కొరకు ఆటోప్లస్ స్థాపించిన తరువాత వ్యవస్థలో స్థాపించబడిన add/remove software అనువర్తనం ద్వారా ఎన్వీడియా అని వెతికినట్లయితే ఫలితాలను చూపిస్తుంది. సరైన డ్రైవరును ఎంపికచేసి స్థాపించుకోవాలి.


nVidia డ్రైవరు స్థాపించిన తరువాత క్రింది ఆదేశాన్ని నడుపండి


su nvidia-xconfig


ఫెడోరా యుటిల్స్ (fedora utils)


ఫెడోరా యుటిల్స్ కూడా ఆటోప్లస్ లాంటి అనువర్తనమే కాకపోతే ఆటోప్లస్ కంటే ఇందులో మరిన్ని ఎక్కువ ఐచ్ఛికాలు ఉంటాయి..ఫెడోరా భాండాగారంలో అందుబాటులోలేని ప్యాకేజీలను దీని ద్వారా సులభంగా స్థాపించవచ్చును.


ఫెడోరా యుటిల్స్ ద్వారా క్రింద పేర్కొన్న వాటిని స్థాపించవచ్చును
  • బహుళమాధ్యమ కొడెక్లు
  • అడోబ్ ఫ్లాష్ ప్లేయర్
  • మైక్రోసాఫ్ట్ కోర్ ఫాంట్స్
  • సినెమెన్ షెల్
  • టీమ్ వ్యూవర్
  • థర్డ్-పార్టీ భాండాగారాలు
  • ప్రస్తుత వాడుకరిని సుడోయర్స్ కు జతచేయవచ్చు
  • అదనపు సాఫ్టువేర్లు
  • ఇంకా మరెన్నో...


ఫెడోరా యుటిల్స్ స్థాపించుటకు క్రింది ఆదేశాన్ని వాడండి.


su -c "curl http://master.dl.sourceforge.net/project/fedorautils/fedorautils.repo -o /etc/yum.repos.d/fedorautils.repo && yum install fedorautils"